ఏడిపింఛన్!
..ఇది ఈ ముగ్గురి ఆవేదన మాత్రమే కాదు. జిల్లా వ్యాప్తంగా 30 వేలమందికిపైగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గత కొన్నాళ్లుగా అనుభవిస్తున్న మానసిక క్షోభ. ఏ ఆధారం లేక.. ఆదుకొనేవారు అంతకన్నా లేక.. ఇంతకాలం ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లపై ఆధారపడి జీవితాలను నెట్టుకొస్తున్న దీనుల పాలిట సర్కారు ఏర్పాటు చేసిన సర్వే కమిటీలు పిడుగుపాటుగా పరిణమించాయి. పింఛను మొత్తాలు పెంచుతామని ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీతో తమ బతుకులు కొంతైనా మెరుగుపడతాయని ఆశపడ్డ పింఛనుదారులు పింఛను మొత్తాలు పెంచినా.. అసలు పింఛనే లేకుండా చేయడంతో హతాశులాయ్యరు. అసలుకే మోసం వచ్చిందంటూ దిగులు చెందుతున్నారు. కొందరు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. చాలామంది ఇప్పటికీ అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతూ కాళ్లావేళ్లాపడి తమ పింఛను బతికించమని బతిమాలుతున్నారు.
కమిటీల పుణ్యమే..!
పింఛన్లు పెంచుతామన్న హామీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పింఛన్ మొత్తాలు పెంచినట్లే పెంచి.. మెలిక పెట్టింది. ప్రస్తుత పింఛనుదారుల్లో చాలామంది బినామీలు, అనర్హులు ఉన్నారంటూ వాటిని నిర్ధారించేందుకు గ్రామస్థాయిలో సర్వే కమిటీలను నియమించింది. అయితే ఈ కమిటీల్లో అధికార పార్టీ కార్యకర్తలనే నియమించడంతో గ్రామస్థాయి రాజకీయాలు సర్వేలోకి చొచ్చుకొచ్చాయి. ఇతర పార్టీల మద్దతుదారులు, గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయని వారిని గుర్తించి రకరకాల కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ లబ్ధిదారుల జాబితాల నుంచి తొలగించారు. సాంకేతిక లోపాలు కూడా అర్హులపై వేటుకు యథాశక్తి దోహదపడ్డాయి. నాయకులను అడిగితే ‘మా పార్టీలో చేరండి.. అప్పుడే మీకు పింఛను వస్తుంది’ అని తెగబడి తేల్చేస్తున్నారు. అధికారులను ఆశ్రయిస్తే గ్రామ కమిటీల సర్వే ప్రకారమే తొలగించామని చెబుతూ చేతులెత్తేస్తున్నారు. మొత్తానికి కమిటీల సర్వే నివేదికల్లో పూర్తిగా అధికార పార్టీ ముద్ర కనపడటంతో అర్హత ఉన్నా అధికార పార్టీ ముద్ర లేకపోతే పింఛను అందదన్న సంకేతాలు స్పష్టంగా వెళ్లాయి. అర్హులపై కుంటి సాకులతో లబ్ధిదారుల జాబితాల నుంచి తొలగించిన ఈ కమిటీలు.. అదే సమయంలో ఏ అర్హతలూ లేని అధికార పార్టీ కార్యకర్తలు, అభిమానుల పేర్లను భారీ స్థాయిలో జాబితాల్లో చేర్చాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
భారీగా కోత
జిల్లాలో సర్వేకు ముందు అన్ని రకాల కేటిగిరీలు కలిపి 2,92,630 మంది పింఛనుదారులు ఉండగా సర్వే అనంతరం వారి సంఖ్య 2,62,559కి తగ్గింది. అంటే సర్వేలో 30,071 మంది లబ్ధిదారుల పేర్లు తొలగించారన్న మాట. కొత్త జాబితాలు మండల కేంద్రాలకు అందాయి. వీటిలో పేర్లు కనిపించని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. కాగా ఇదే సర్వేలో కొత్తగా 31,998 మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించారు. అయితే వీరికి ఎప్పటి నుంచి పింఛన్లు ఇస్తారన్నది మాత్రం స్పష్టం కావడంలేదు. వీరంతా ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకొని పింఛను కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
అధికార పార్టీ నేతల ప్రాపకం ఉంటేనే..
పింఛనుదారుల వయసు నిర్ధారణకు రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే రేషన్ కార్డుల్లో వివరాలు తప్పులతడకలుగా నమోదయ్యాయని ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. 95 ఏళ్ల పండు ముదుసలి కళ్లెదుట కనిపిస్తున్నా పట్టించుకోకుండా రేషన్ కార్డులో ఆయన వయసు 45 ఏళ్లుగా నమోదైనందున అనర్హుడంటూ పేరు తొలగించడం సర్వే కమిటీల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తోంది. కాగా అంపిలి గ్రామంలో వాకముడి పెద్ద అప్పలనాయుడు అనే 80 ఏళ్ళ వృద్ధుడి పింఛన్ తొలగించి, అతని ఇద్దరు తమ్ముళ్లకు కొనసాగించడం అధికార పార్టీ దురాగాతాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇలా జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో గత ఎన్నికలలో ఆ పార్టీకి అనుకూలంగా లేని వారి పింఛన్లన్నీ తొలగించారు. దీనిపై అన్ని గ్రామాలలోను నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
70 ఏళ్లు అయినా పెన్షన్ తొలిగించారు.....
ఈ ఫొటోలోని వృద్ధ మహిళ పేరు చుక్కల చెల్లమ్మ. ఈమె వయసు 70 సంవత్సరాలు. గత కొన్నేళ్లుగా చేనేత పెన్షన్ అందుకునేది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామంలో పార్టీల పేరుతో ఆమె పెన్షన్ తొలిగించారు. 50 ఏళ్లు దాటిన వారికి చేనేత పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా.. 70 ఏళ్లున్న తన పెన్షన్ తొలగించడంతో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
పాలకొండ, సిరికొండ గ్రామానికి చెందిన ఊయక శంకరరావుకు 75 సంవత్సరాలు. తినేందుకు తిండి కూడా లేని పేదరికం. ఎవరూ లేరు. ఇటీవల పింఛను ఆపేశారు. పింఛను కావాలని గ్రామ సర్పంచ్ వద్దకు వెళితే మీ కుటుంబమంతా పార్టీ మారాలి. అప్పుడే పింఛను అందుతుంది’ అని చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అదే గ్రామానికి చెందిన బిడ్డిక పట్టయ్య 95 ఏళ్ల పండు ముదుసలి. ఈయనకూ పింఛను తొలగించారు. రేషన్ కార్డులో వయసు 45 సంవత్సరాలుగా నమోదైనందున పింఛను ఇవ్వలేమని చెబుతున్నారని ఆయన వాపోతున్నారు. చివరి కాలంలో తినేందుకు తిండి లేక అవస్థలు పడుతున్న తనకు ఇలాంటి పరిస్థితి కల్పించడంపై ఆవేదన చెందుతూ మంచం పట్టారు.
జిల్లాలో పింఛన్ల అంకెలు
కేటగిరీ పాత సంఖ్య {పస్తుత సంఖ్య తొలగించినవి
వృద్ధాప్యం 1,36,538 1,22,849 13,689
చేనేత 4,388 3,997 391
వికలాంగ 32,659 29,698 2,961
వితంతు 88,286 78,190 10,096
గీత కార్మికులు 492 455 37
అభయహస్తం 30,267 27,410 2,857
మొత్తం 2,92,630 2,62,559 30,071