టీడీపీ నేతలు పక్షపాతం చూపుతున్నారు. పచ్చి ఘాతుకానికి తెరలేపారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తరువాత ప్రజా సంక్షేమం పైనే తమ దృష్టి ఉంటుందని నిత్యం వల్లించే చంద్రబాబు, ఆయన మంత్రులు ఇప్పుడు చాలా విషయాలను పచ్చరంగుటద్దాలోంచి చూస్తున్నారు. భోగాపురం మండలంలో టీడీపీకిమద్దతు తెలిపిన, టీడీపీ నాయకులకు భూములున్న గ్రామాలను వదిలేసి, వైఎస్‌ఆర్ సీపీకి మద్దతు తెలిసిన గ్రామాల రైతుల నుంచి భూములు లాక్కొనేందుకు ఎత్తులువేస్తున్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ అభ్యంతరాలు తెలిపిన ‘ప్లాన్’వైపే మొగ్గుచూపుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎయిర్‌పోర్టు కోసం వైఎస్సార్‌సీపీ సానుభూ తి గ్రామాల్ని పణంగా పెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిం చింది. విమానాశ్రయం ఏర్పాటు కు అనుకూలం కాదని, సాంకేతిక ఇబ్బందులున్నాయంటూ ఎయిర్‌పోర్టు అథారటీ అభ్యంతరం వ్యక్తం చేసిన ప్లాన్‌నునే మళ్లీ తెరపైకి తెచ్చింది. విశాఖపట్నంలో మంగళవారం జరిగిన సమీక్షలో మంత్రి గంటా శ్రీనివాసరావు తుది నిర్ణయాన్ని వెల్లడించారు. ఇందుకు టీడీపీ నేతలు వత్తాసు పలుకుతున్నారు. బాధిత గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎయిర్‌పోర్టు విషయంలో తన పంతం నెగ్గించుకునేందుకు భోగాపురం మండల ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తోంది.
తొలుత ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌పై ఎయిర్‌పోర్టు అథారటీ అభ్యంతరం తెలిపిందని, సాంకేతిక ఇబ్బందులొస్తాయన్న కారణంతో నిపుణుల కమిటీ నివేదించిన మేరకు రెండో ప్లాన్ అమలు చేస్తున్నట్టు గత నెల 22వ తేదీన డీఆర్‌డీఎ సమావేశం భవనంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి మంత్రి మృణాళిని ప్రకటించారు. అయితే, దానిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఇప్పుడేమో మాట మార్పి, తూచ్ అంటూ దాదాపు తొలుత ప్రతిపాదించిన ప్లాన్‌వైపే మొగ్గు చూపింది. ఈ క్రమంలో దాదాపు వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపుతున్న గ్రామాల్నే ఎంపిక చేసుకుంది. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నట్టు తెలుస్తోంది.
మొన్నటి వరకు 5040ఎకరాలు సరిపోతాయని చెప్పిన మంత్రులు ఈరోజు 5,551ఎకరాలు అవసరమని ప్రకటించారు. వీటిలో 4,130ఎకరాల్ని రైతుల నుంచి సమీకరించనున్నారు. మిగతా వాటిలో 574ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 847ఎకరాల్ని డి-పట్టాల కింద ఎస్సీ, ఇతరత్రా వర్గాలకిచ్చిన భూముల్ని తిరిగి లాక్కోనుంది. ఎయిర్‌పోర్టు కోసం దాదాపు 21గ్రామాల్ని ఏకంగా తరలించాల్సి వస్తోంది. 1895 కుటుంబాలు ఉన్న ఊరిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. 7,559మంది నిరాశ్రయులవుతారు.
21గ్రామాలకు గండం
పూర్తిగా తరలించేందుకు ప్రతిపాదించిన గ్రామాల్లో కొంగవానిపాలెం, తూర్పబడి, రెడ్డికంచేరు, బెరైడ్డిపాలెం, ముడసర్లపేట, బమ్మిపేట, మరడపాలెం, జమ్మయ్యపేట, గూడెపువలస, రెల్లిపేట, వెంపాడపేట, దల్లిపేట, రాళ్లపాలెం,బొల్లింకలపాలెం, చిన రావాడ, జోగపేట, కొయ్యవానిపాలెం, చిన్నిపేట, పిన్నింటిపాలెం, దల్లిపేట, అమపాం గ్రామాలున్నాయి.
భూములు కోల్పోనున్న ఏడు రెవెన్యూ గ్రామాలు
భూసమీకరణ విషయానికొస్తే ముంజేరు రెవెన్యూలో 172ఎకరాలు, కొంగవానిపాలెం రెవెన్యూలో 163ఎకరాలు, కంచేరు రెవెన్యూలో 1343ఎకరాలు, కవులవాడ రెవెన్యూలో 935ఎకరాలు, గూడెపువలస రెవెన్యూలో 2139, రావాడ రెవెన్యూలో 352, ఎ.రావివలస రెవెన్యూలో 443ఎకరాల్ని సమీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ప్రకటించారు. ఈ మార్పు వెనక పూర్తిగా రాజకీయ కారణాలు ఉన్నాయన్నది స్పష్టంగా కన్పిస్తోంది. ఈ గ్రామాల్ని పరిశీలిస్తే ప్రతీ ఒక్కరికీ ఈ విషయం బోధపడుతుంది. విశాఖలో మంగళవారం జరిగిన సమీక్ష సందర్భంగా దాదాపు బాధిత గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం తెలపడమే కాకుండా తీవ్ర నిరసన తెలియజేశారు. కానీ, ఆ మండల టీడీపీ ప్రజాప్రతినిధులు మాత్రం వత్తాసు పలికారు.
ప్రతిపక్షమే లక్ష్యంగా పచ్చ ఘాతుకం!
Published Wed, Jul 8 2015 12:34 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement