
బెల్టుపోయి.. చైన్ వచ్చే!
ఆదాయమే ధ్యేయంగా ప్రభుత్వం మద్యం ఏరులై పారించేందుకు కసరత్తు చేస్తోంది. బెల్టు షాపులను తొలగిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆమేరకు వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అందువల్ల వల్ల వచ్చే నష్టాలను పూడ్చుకోవడంతో పాటు మరింత ఆదాయం పెంచేందుకు కొత్త మార్గాలను వెతుకుతోంది.
అందులో భాగంగానే అనధికారంగా నడుపుతున్న బెల్ట్‌షాపుల స్థానంలో అధికారికంగా చైన్ షాపులు పెట్టాలని భావిస్తోంది. సగటున ఒక్కో వైన్‌షాపు పరిధిలో మూడు చైన్‌షాపులు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే లెసైన్‌స్డ్ బెల్టు షాపులు నడిపినట్టే.
తిరుపతి గాంధీరోడ్: జిల్లాలో ప్రస్తుతం నెలకు సుమారు రూ.90 కోట్ల మద్యం విక్రయిస్తున్నారు. దాన్ని రూ.140 కోట్లు దాటించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా ప్రారంభించింది. జిల్లాలో మద్యం షాపుల వ్యాపార స్థితి, బాగా విక్రయాలు జరిగే షాపులు, ప్రాంతాలు, అనధికారికంగా సాగుతున్న బెల్ట్ షాపుల వివరాలను సేకరించే పనిలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
మూడు రెట్లు పెరగనున్న షాపులు
ప్రస్తుతం జిల్లాలో చిత్తూరు పరిధిలో 191, తిరుపతి పరిధిలో 196 మద్యం షాపులు ఉన్నాయి. చిత్తూరు పరిధిలో 16, తిరుపతి పరిధిలో 14 బార్లున్నాయి. వీటన్నింటి ద్వారా నెలకు సగటున 85 నుంచి 90 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. తిరుపతి పరిధిలో అమ్మకాలు అధికంగా ఉన్నాయి. జిల్లా మొత్తం మీద ప్రస్తుతం ఉన్న షాపులకు అనుబంధంగా సుమారు 1100 వరకు చైన్‌షాపులు ఏర్పాటుచేసే అవకాశం ఉంది. తద్వారా బెల్ట్‌షాపులు పూర్తిగా తగ్గిపోతాయని, ఆదాయం కూడా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వ్యాపారుల ఆదాయానికి గండి
నిబంధనల ప్రకారం మద్యం లెసైన్స్ విలువకు అనుగుణంగా దానికి ఆరు రెట్లు విక్రయించే అవకాశం వ్యాపారులకు ఉంటుంది. ఒక వ్యాపారి రూ.50 లక్షలు లెసైన్స్ ఫీజు చెల్లిస్తే అతను రెండు సంవత్సరాల్లో రూ.3 కోట్ల వరకు మద్యం విక్రయించవచ్చు. ఈ మూడు కోట్లు రూపాయలు ఎమ్మార్పీపై 28 శాతం కమీషన్ చెల్లిస్తారు. రూ.3 కోట్లకు పైగా విక్రయాలు జరిగితే కేవలం 12 శాతం మాత్రమే కమీషన్ ఇస్తారు. ఈ క్రమంలోప్రతి షాపునకు అనుబంధంగా మూడు చైన్‌షాపులు ఏర్పాటుచేస్తే వాటి లెక్కలు కూడా అధికారికంగా చూపాల్సి వస్తుంది. దీంతో రూ.3 కోట్ల టర్నోవర్ ఏడాదిలోపే దాటిపోయే అవకాశం ఉంటుంది. కమీషన్ భారీగా తగ్గిపోతుంది. దీంతో పెట్టుబడి ఎక్కువ లాభం తక్కువగా మారుతుంది.