తాగినోడికి తాగినంత ! | Erulai belt lies liquor shop | Sakshi
Sakshi News home page

తాగినోడికి తాగినంత !

Published Mon, Aug 25 2014 3:29 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

తాగినోడికి తాగినంత ! - Sakshi

తాగినోడికి తాగినంత !

  •     బెల్ట్‌షాపుల్లో ఏరులై పారుతున్న మద్యం
  •      సీఎం మాటలు ఒట్టివే
  •      మద్యం దుకాణాల్లోనూ లూజు విక్రయాలు
  •      ఎమ్మార్పీ కంటే అధిక ధరలు
  •      తెల్లవారక ముందే తెరుచుకుంటున్న దుకాణాలు
  • ‘నోరు ఒకటి చెబుతాది.. చెయ్యి ఇంకోటి చేస్తాది..దేనిదోవ దానిదే’! అన్నట్టుంది సీఎం చంద్రబాబు తీరు. అధికారంలోకి రాగానే బెల్ట్‌షాపులను తొలగిస్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఒట్టి బూటకమని స్పష్టమవుతోంది. ఓ వైపు బెల్ట్‌షాపులు మూసేయాలని జిల్లా ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు పంపి.. మరోవైపు వాటి జోలికెళ్లొద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో బెల్ట్‌షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. దీనికి తోడు మద్యం దుకాణాల్లో ‘లూజు’ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎకై ్సజ్ యంత్రాంగం కూడా బెల్ట్‌షాపుల తనిఖీలు చేయకుండా నిర్లిప్తంగా ఉంది.
     
    సాక్షి, చిత్తూరు: మద్యం సిండికేట్‌ల వ్యవహారం రెం డేళ్ల కిందట రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే! బినామీల పేరుతో దుకాణాలను దక్కిం చుకుని యథేచ్ఛగా విక్రయాలు సాగించారు. అప్ప ట్లో 80 శాతం దుకాణాలు తెల్లరేషన్ కార్డుదారులైన బినామీల పేరుతో నడిచాయి. ఈ క్రమంలో గత ప్రభుత్వం పాత విధానానికి ఫుల్‌స్టాప్ పెట్టి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. లాటరీ పద్ధతిన దుకాణాలు కేటాయించింది. చంద్రబాబు సర్కారు కూడా అదే పాలసీని కొనసాగిస్తోంది. ప్రస్తుతం జిల్లా లో 458 మద్యం దుకాణాలు ఉన్నాయి.

    ఇందులో 388 దుకాణాలకు లెసైన్స్‌లు ఇచ్చారు. 70 దుకాణాలకు లెసైన్స్‌దారులు ముందుకు రాలేదు. ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాల పరిధిలో భారీగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. జిల్లాలో 3600 బెల్ట్‌షాపులు ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ప్రతి గ్రామంలో మద్యం బాటిళ్ల విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని మద్యం దుకాణాల ద్వారా ఆబ్కారీకి 40 శాతం ఆదాయం వస్తుంటే, 60 శాతం ‘బెల్ట్’ ద్వారానే సమకూరుతోంది.
     
    ఆర్డర్ సరే.. ఆచరణ ఏదీ?


    టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఆపై చంద్రబాబు సీఎం పీఠమెక్కాక రాష్ట్రంలో మద్యాన్ని పారించి ‘మద్యాంధ్రప్రదేశ్’గా మార్చారు. ఇలాంటి చేష్టలతో పదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు 2014 ఎన్నికల ప్రచారంలో ‘బెల్ట్‌రాగాన్ని’ అందుకున్నారు. అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపులను నివారిస్తామని ప్రకటించారు. మ్యానిఫెస్టోలో కూడా పొందుపరిచారు. నిజానికి బెల్ట్‌షాపుల నిర్వహణకు ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలో అనుమతుల్లేవు.

    ఈ క్రమంలో నెలకిందట బెల్ట్ షాపులను తొలగించాలని ఓ జీవోను కూడా జారీచేశారు. దీం తో బాబు మాటపైన నిలబడ్డారని అంతా భావించారు. ఇంతలోనే తనదైన శైలిలో ‘బెల్ట్’జోలికి వెళ్లొద్దని, ‘బెల్ట్’ తీస్తే సర్కా రు ఖజానా గండిపడి గల్లాపెట్టె నిండదని మౌఖిక ఆదేశాలు జారీ చేయించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తు తం రాష్ట్రం ఆర్థికకష్టాల్లో ఉందని ఇలాంటి సమయంలో ఎంత మద్యం తాగిస్తే.. అంత ఆదాయం వస్తుందని కూడా బాబు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు ‘బెల్ట్’ వైపు కన్నెత్తి చూడటం లేదు. పైగా జూలై నుంచి కొత్త లెసైన్స్‌లు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్‌శాఖ ఆదాయ సేకరణలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే ‘బెల్ట్’ ఆసరా తప్పనిసరి.
     
    నడుస్తున్నవీ నిబంధనలకు విరుద్ధంగానే..

    కొత్త నిబంధన ప్రకారం లాటరీలో ఎవ్వరి పేరుతో షాపు వచ్చిందో వారే నడపాలి. అయితే లాటరీలో దుకాణం దక్కించుకున్న వారి నుంచి తిరిగి ‘ఎక్సెస్‌రేటు’ చెల్లించి ఖద్దరు నేతలు నడుపుతున్నారు. ప్రస్తుతం 388 దుకాణాల్లో 246 దుకాణాలు ఇదే రకంగా నడుస్తున్నాయని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. అయినా చర్యలు లేవు. జిల్లాలో కొన్ని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. లిక్కర్‌పై 5-10, బీరుపై 10-15 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు.

    లూజు విక్రయాల సంగతి సరేసరి! ఆగస్టు నుంచి కంప్యూటర్ బిల్లుల ద్వారా విక్రయాలు జరపాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దాన్ని అమలు చేసేందుకు ఇప్పటి ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు. నిబంధనల మేరకు ఉదయం 11 గంటలకు దుకాణం తెరిచి, రాత్రి 10 గంటలకు మూసేయాలి. దాదాపు ఎక్కడా ఈ నిబంధన అమలు కావడం లేదు. తెల్లవారినప్పటి నుంచి అర్ధరాత్రి దాకా అమ్మకాలు సాగిస్తున్నారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అయినా ఎక్సైజ్ చూపు అక్కడ పడటం లేదు. కాదు..కాదు..చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది.
     
     సమాచారం ఇస్తే దాడులు చేస్తాం
    బెల్ట్‌షాపులు నివారించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారని సమాచారం ఇస్తే దాడులు చేస్తాం. ఇందుకోసం రెండు టాస్క్‌ఫోర్స్ టీంలు పనిచేస్తున్నాయి. కంప్యూటర్ బిల్లులపై ఇంకా విధివిధానాలు రాలేదు. రాగానే అమలు చేస్తాం.
     -సత్యప్రసాద్, డెప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement