‘అగ్రి’ బాధితుల ఏరివేత! | TDP Govt is preparing another fraud before the election on Agri Gold Lands | Sakshi
Sakshi News home page

‘అగ్రి’ బాధితుల ఏరివేత!

Published Wed, Jan 23 2019 3:19 AM | Last Updated on Wed, Jan 23 2019 9:13 AM

TDP Govt is preparing another fraud before the election on Agri Gold Lands - Sakshi

సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా దాదాపు 20 లక్షల మంది అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల జీవితాలతో చెలగాటమాడుతూ సంస్థకు చెందిన విలువైన భూములను కాజేసే ఎత్తుగడతో కాలక్షేపం చేసిన టీడీపీ సర్కారు ఎన్నికల ముందు మరో మోసానికి సిద్ధమైంది. అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల సంఖ్య డేటాతో సరిపోలడం లేదంటూ బాధితుల ఏరివేత చర్యలకు పాల్పడుతోంది. రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని, వారికి రూ.1,182 కోట్లను చెల్లిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతిపక్షనేత చేసిన ప్రజాసంకల్ప పాదయాత్రలో పలుచోట్ల అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులు పెద్ద ఎత్తున పాల్గొ న్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకో కుండానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.200 కోట్లు ఇస్తుందని, దీనికి అదనంగా ఆస్తుల వేలం ద్వారా రూ.50 కోట్లు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇదంతా కేవలం ప్రతిపక్ష నేత ఇచ్చిన హామీకి భయపడే తప్ప ముఖ్యమంత్రికి ఇందులో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నిజంగా అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులను అదుకోవాలనే ఉద్దేశం ఉంటే నాలుగున్నరేళ్లుగా ఎందుకు ముందుకు రాలేదని అధికార వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. బాధితులను ఆదుకోకుండా విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేయటంపైనే ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదా దగ్గర నుంచి అగ్రిగోల్డ్‌ వ్యవహారం దాకా ప్రతిపక్ష నేత బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నడుస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రతిపక్ష నేత ఏది చెబితే దాన్ని సీఎం కాపీ కొడుతున్నారని పేర్కొంటున్నాయి.

ఆస్తులను తగ్గించి చూపే యత్నం..
రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులు 19.52 లక్షల మంది ఉండగా రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారు 13.83 లక్షల మంది ఉన్నారు. వీరికి రూ.1,182.17 కోట్లు చెల్లించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వమే తేల్చింది. టీడీపీ సర్కారు కేవలం రూ.200 కోట్లు మాత్రమే చెల్లిస్తామంటూ ప్రకటించడం బాధితులను మోసగించడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క అగ్రిగోల్డ్‌ ఆస్తులను తగ్గించి చూపే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. తొలుత సీఐడీ దర్యాప్తులో అగ్రిగోల్డ్‌కు 16,857.81 ఎకరాలున్నట్లు తేలింది. పలు ప్రాంతాల్లో అగ్రిగోల్డ్‌కు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, పవర్‌ ప్రాజెక్టులు, అవెన్యూ ప్లాంటేషన్, డెయిరీ ఫారాలు, మల్టీ ప్రొడెక్ట్స్, హాయ్‌ల్యాండ్, ఆఫీసు భవనాలు ఉన్నట్లు నిర్ధారించింది. అయితే డిపాజిట్‌ దారుల సంఖ్యను కుదించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం డేటా, నగదు వివరాలు సరిపోలడం లేదంటూ బాధితులకు ఏకంగా రూ.2,250 కోట్ల మేర ఎగనామం పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement