
సాక్షి, నర్సీపట్నం: రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగుతాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోస్యం చెప్పారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలపై ఆసక్తిగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
కాగా, బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీ దోస్తీ కొనసాగుతోందన్న ఆరోపణలకు అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరవెనుక టీడీపీతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పోటీచేసిన మంగళగిరిలో జనసేన అభ్యర్థిని నిలబెట్టకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. మరోవైపు ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. అవినీతి కేసుల నుంచి చంద్రబాబును కాపాడేందుకే వీరు బీజేపీలో చేరారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. (చదవండి: పవన్ పర్యటనలో టీడీపీ నేతలు)
Comments
Please login to add a commentAdd a comment