దేముడమ్మ రేషన్ కార్డు బాధితురాలు దేముడమ్మ పింఛన్ జాబితాలో నర్సిబాబు వివరాలు
విశాఖపట్నం, దేవరాపల్లి(మాడుగుల): ఓ వితంతువుకు చెందిన పింఛన్‌ను రెండేళ్లుగా టీడీపీ నేత ఒకరు పొందుతున్నారు. ఈవ్యవహారాన్ని ఎ.కొత్తపల్లి వైఎస్సార్‌సీపీ నేతలు బట్టబయలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తాటికొండ దేముడమ్మ భర్త అచ్చిబాబు సుమారు రెండు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి తన భర్త పింఛన్‌ను తనకు వితంతువు పింఛన్‌గా మార్పు చేయాలని జన్మభూమి సమావేశాల్లో పలుమార్లు అధికారులకు దరఖాస్తు చేసుకుంది.
అయితే దరఖాస్తు చేసిన ప్రతిసారీ పింఛన్ తప్పక వస్తుందని చెప్పడంతో ఆశగా ఎదురు చూసి, చివరకు నిరాశకు గురికావడం పరిపాటిగా మారిపోయింది. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా దేముడమ్మకు పింఛన్ ఎందుకు మంజూరు కాలేదని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు చింతల సత్య వెంకటరమణ ఎంపీడీవో కార్యాలయంలో ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దేముడమ్మ రేషన్ కార్డు నంబరుపై స్థానిక దేశం నాయకుడు గంటా నర్సిబాబు రెండు సంవత్సరాలుగా పింఛన్ పొందుతున్నట్టుగా గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లగా, ఈ పింఛన్ సదరు వ్యక్తికి వెళ్లకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అయితే ఎ.కొత్తపల్లిలో ఆదివారం జరిగిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మళ్లీ పింఛన్ పొందేందుకు దేశం నేత గంటా నర్సిబాబు ప్రయత్నించడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుతగిలి, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీవో అక్కడికి చేరుకుని నర్సిబాబుకు పింఛన్ ఇవ్వవద్దని స్థానిక సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తాను వైఎస్సార్‌సీపీ సానుభూతిపరురాలిని కావడంతో కావాలనే తన పింఛన్ నగదును రెండేళ్లు తనకు చెందకుండా కాజేశారని బాధితురాలు దేముడమ్మ ఆరోపించారు. ఇదే విషయమై ఎంపీడీవోను వివరణ కోరగా సాంకేతిక సమస్య కారణంగా అలా జరిగిందని, కార్డు నంబర్ మార్పు చేయాలని ఉన్నతాధికారులకు లేఖ రాశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment