టీడీపీ కార్యాలయం కోసం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆక్రమించిన స్థలం
పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కారణమో....తిరిగి అధికారంలోకి రాలేమన్న అనుమానమో... తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. నాలుగన్నరేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవకాశం ఉన్న ప్రతిచోటా అందినకాడికి దోచుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ తమకు వాటా ఉండాల్సిందేనంటూ టీడీపీ నేతలు ఎవరికి వారు తమ తమ స్థాయిలో ప్రజాధనాన్ని లూటీ చేశారు. ‘అందులేదు... ఇందు లేదు, ఎందెందు వెతికినా అంతా అవినీతి అక్రమాల మయం’ అన్న చందంగా మాజీ ఎమ్మెల్యే, జన్మభూమి కమిటీలు, చోటా మోటా నాయకులందరూ పోటీపడి ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించుకున్నారు. నీరు–చెట్టు పేరుతో ప్రభుత్వ నిధులను స్వాహా చేశారు. రైతు రథం, ఆదరణ పథకం కింద పంపిణీ చేసిన యంత్రాలు, పనిముట్లను బినామీ పేర్లతో దొంగిలించారు. కార్పొరేషన్ రుణాలను కాజేశారు. ఎన్‌టీఆర్ హౌసింగ్ పథకంలో పక్కాగృహాలను నిరుపేదలకు దక్కకుండా బంధువులు, అనుచరులకు పంచిపెట్టారు. ‘ఫర్ ఆల్’ అంటూ జేబులు నింపుకోవడమే పరమావధిగా పనిచేశారు. రాష్ట్రంలోనే పేదవాడి ఉపాధికి స్వర్గధామంగా పేరొందిన మదనపల్లె నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల అవినీతిపై సాక్షి స్పెషల్ ఫోకస్.!
సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్: మదనపల్లె పట్టణం శివారు ప్రాంతాలు కొండలు, గుట్టలతో నిండి ఉండటం, ప్రభుత్వ భూములు అధికంగా ఉండటం ఇక్కడి తెలుగుదేశం పార్టీ నాయకుల పాలిట వరంగా మారింది. రెవెన్యూ చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి వందల ఎకరాల భూఆక్రమణలకు పాల్పడ్డారు. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపించినా రాబందుల్లా వాలిపోయి తప్పుడు రికార్డులు సృష్టించి చుట్టూ కంచె వేసి రియల్ వ్యాపారం మొదలు పెట్టేశారు. అక్రమార్కుల్లో ముందు వరుసలో ఉన్న నాయకుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్. ఈయన ఆక్రమించుకున్న వాటిలో వెలుగుచూసిన భూములు మొత్తం రూ.137.6 ఎకరాలు. వాటి విలువ సుమారు రూ.200 కోట్లకుపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రైతు రథంలో టీడీపీ చేతివాటం
వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు, ఆధునిక సేద్యంను పరిచయం చేసేందుకు ప్రవేశపెట్టిన రైతు రథం టీడీపీ నాయకులకు ఆదాయ వనరుగా మారింది. మదనపల్లె నియోజకవర్గంలో రూ.2.50 లక్షల రాయితీతో 83 ట్రాక్టర్లు మంజూరు చేశారు. అయితే ఆయా మండల టీడీపీ నాయకులు రైతుల పేరుతో మంజూరైన ట్రాక్టర్‌లను వారికి అందజేయకుండా బినామీల పేర్లతో స్వాహా చేశారు. తమ పేర్లతోనే ట్రాక్టర్‌లు తీసుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు. రామసముద్రం టీడీపీ మండల అధ్యక్షులు కొండూరు నారాయణ రెడ్డి, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఎం.వి.రమణ, కాపు సంఘం మండల అధ్యక్షులు సీతప్ప, మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీప్రసాద్, నిమ్మనపల్లె మండలానికి చెందిన జెడ్పీటీసీ సుజాత, ఎంపీపీ భర్త మల్లికార్జున, ఆర్‌జే వెంకటేష్, రెడ్డివారిపల్లె ఎంపీటీసీ నాగరాజ నాయుడు, మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భర్త మునిరత్నం ట్రాక్టర్‌లను తీసుకున్నారు.
కార్పొరేషన్ రుణాల్లోనూ కక్కుర్తి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ రుణాల్లో లబ్ధి్దదారుల నుంచి తెలుగు తమ్ముళ్లు భారీ స్థాయిలో వసూళ్లు మొదలుపెట్టారు. ఎవరికి వారు తమ తమ స్థాయిలో సంతకాలు చేసేందుకు ఓ వైపు రుణం మంజూరు కాకుండానే లబ్ధిదారుల నుంచి డబ్బులు రాబట్టుకున్నారు. నియోజకవర్గ పరిధిలో నాలుగేళ్ల కాలంలో మొత్తం 2,901 మందికి రుణాలు మంజూరు చేసి ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.2.50 లక్షల వరకు రుణాలు పొంది ఉన్నారు. నిమ్మనపల్లె మండలంలో ఎంపీపీ భర్త మల్లికార్జున, జన్మభూమి కమిటీ సభ్యులు రమణ, నిమ్మనపల్లె మాజీ సర్పంచ్ శ్రీరాములు కార్పొరేషన్ రుణాల మంజూరులో ఒక్కొక్కరి వద్ద రూ.5,000 నుంచి 20,000 వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లెక్కన నియోజక వర్గంలో టీడీపీ నాయకులు రుణాల మంజూరుకు లబ్ధిదారుల నుంచి మామూళ్లు పుచ్చుకున్నారు. కేవలం కార్పొరేషన్ రుణాల్లోనే సుమారు రూ.3 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణాల మంజూరులో జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందటంతో విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
చేయి తడిపితేనే పక్కా ఇల్లు
పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తున్నామంటూ టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. మదనపల్లె్ల నియోజక వర్గ పరిధిలో ఇప్పటి వరకు 1401 పక్కాగృహాలు మంజూరయ్యాయి. అయితే పక్కాగృహం మంజూరు కావాలంటే టీడీపీ నాయకుల చేయి తడపాలి. ఆన్‌లైన్ చేసి పక్కాగృహం మంజూరు కోసం ప్రతి లబ్ధి్దదారుడు రూ.15వేల నుంచి రూ.30వేలు టీడీపీ నేతలకు సమర్పించుకున్నారు. ఇదిలా ఉంటే... మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన గృహ నిర్మాణ పథకంలో జీప్లస్ 3 అపార్ట్‌మెంట్లు నిర్మించారు. అందులో తొలి విడతలో 3,773 గృహాలు మంజూరైతే వాటిలో 2999 గృహాలకు డీడీలు చెల్లించారు. 774 గృహాలకు డబ్బులు చెల్లించలేదు. ఈ ప్లాట్ల మం జూరులోనూ టీడీపీ నేతలు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తుండడం గమనార్హం.
ఆక్రమించుకున్నవాటిలో కొన్ని...
♦ తంబళ్లపల్లె్ల పరిధిలోని కురబలకోట మండలం అంగళ్లు వద్ద సర్వే నంబర్ 160లోని 6.5 ఎకరాల భూమిని అనుచరులతో కలిసి ఆక్రమించుకున్నారు. అడ్డుకున్న ఎంపీడీఓపై దాడికి యత్నించారు.
♦ చెంబకూరు సమీపంలోని ఆవులపల్లె వద్ద భార్య, తండ్రి పేరుతో సుమారు 40 ఎకరాలు, గజ్జెలవారిపల్లె వద్ద ఎస్సీలకు పంపిణీ చేసిన గ్రామనత్తం 2 ఎకరాలు చింతచెట్లు, భూమిని ఆక్రమించారు.
♦ మదనపల్లె పట్టణం కోమటివానిచెరువు సమీపంలో విలువైన 20 గుంట్ల స్థలాన్ని ఆక్రమించి కార్పొరేట్ కళాశాలకు అద్దెకు ఇచ్చారు. మరో వైపు నర్సింగ్ కాలేజి ఏర్పాటుచేశారు.
♦ మదనపల్లె బైపాస్‌రోడ్‌లో జర్నలిస్టులకు కేటాయించిన సర్వేనెం. 536/3లో 3.5 ఎకరాలు తప్పుడు పత్రాలతో ఆక్రమించారు.
♦ చంద్రాకాలనీ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అనుచరుడితో కలిసి భారీ వెంచర్ వేశారు. అందుకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నట్లు ప్లాట్లు కావాల్సిన వారు సంప్రదించాలని బోర్డులు పెట్టారు.
♦ బీకేపల్లెలోని సర్వేనెంబర్ 8లో ఉన్న చెరువు పొరంబోకు భూమి, మాజీ సైనికులకు కేటాయించిన సర్వే నంబర్ 8/1లోని 2.07 ఎకరాల భూమిని ఆక్రమించి అందులో ఏకంగా టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందులో నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
♦ నిమ్మనపల్లె మండలం గారబురుజు గ్రామ సమీపంలో మైనారిటీలకు చెందిన సుమారు 30ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.
♦ వలసపల్లె నవోదయ కాలనీ సమీపంలో సుమారు 2 ఎకరాల భూమిని ఆక్రమించారు. కోళ్లబైలు ఇందిరమ్మ కాలనీలో చేనేత కార్మికుల మధ్య వివాదం నడుస్తున్న సర్వేనెం.529, 617/2, 617/4లో సుమారు 10 ప్లాట్ల వరకు సొంతం చేసుకున్నారు.
మదనపల్లె నియోజకవర్గంలో నాలుగేళ్ల టీడీపీ పాలనలో నీరు–చెట్టు పథకం కింద రూ.35 కోట్లతో 425 పనులు జరిగాయి. వీటిలో దాదాపు 340 పనులు పూర్తయ్యాయి. 60 పనులు ఇంకా కొనసాగుతున్నాయి. 25 పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇవి కాకుండా స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీలో భాగంగా చెక్‌డ్యాంల నిర్మాణానికి కలెక్టర్ నిధుల నుంచి మరో రూ. 8కోట్లు నిధులు మంజూరయ్యాయి. మూడు మండలాల్లోనూ జరిగిన పనుల్లో ఎక్కడా ఇసుమంతైనా నాణ్యత కనిపించలేదు. పది లక్షలు దాటిన పనులను టెండర్ ద్వారా ఇవ్వాల్సి ఉండటంతో అన్ని పనులను రూ.10 లక్షల్లోపు తగ్గించి జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ మండల అధ్యక్షులు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు పంచుకున్నారు. రామసముద్రం మండలంలో కౌండిన్య నదిలో పూడికతీత, కట్ట పనులు, చెక్‌డ్యాంల నిర్మాణ పనుల్లో మండల టీడీపీ నాయకులందరూ తలా పాపం తిలా పిడికెడన్నట్లుగా నిధులను స్వాహా చేశారు. కొన్ని చోట్ల పనులు చేయకుండానే నిధులు మింగేశారు. మరి కొందరు అక్కడి మట్టిని అక్కడే చెల్లాచెదురు చేసి, ఉపాధిహామీ పనుల్లో భాగంగా చెరువుల్లో తీసిన పూడికతీత పనులను తమ ఖాతాలోకి వేసుకున్నారు. చెరువు కట్టలకు రివిట్‌మెంట్లు నిర్మించకుండా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఇరిగేషన్‌శాఖలోని కొందరు అధికారులు సహకరించడంతో రూ.20 ఖర్చుకు రూ.100 బిల్లు పెట్టుకుని నిధులు స్వాహా చేశారు. బాహుదా కాలువలో మదనపల్లె మండలం నుంచి నిమ్మనపల్లె మండలం వరకు సుమారు 58 చెక్‌డ్యాంలు నిర్మిస్తే అన్నింటిలోనూ చేతివాటం ప్రదర్శించారు. మదనపల్లె మండలంలో బొమ్మనచెరువు, కొత్తపల్లె, వేంపల్లె, చీకలబైలు, పోతబోలు, సీటీఎం పంచాయతీలలో జరిగిన నీరు–చెట్టు పథకంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. చేసిన పనుల్లో ధనార్జనే ధ్యేయంగా తూతూ మంత్రంగా చేసి వదిలేశారు.
అవినీతి అడ్డాగా మున్సిపాలిటీ
మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్‌ను 2014 ఎన్నికల్లో అనైతికంగా టీడీపీ చేజిక్కించుకుంది. సంఖ్యాబలం వైఎస్సార్ సీపీకే ఉన్నప్పటికీ దౌర్జన్యంగా మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. టీడీపీ పాలనలో మున్సిపాలిటీ అవినీతిమయంగా మారింది. ఈ నాలుగేళ్ల పాలనలో అమృత్ పథకం, 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ సబ్‌ప్లాన్, బీపీఎస్, సాధారణ నిధులు, నీటి సరఫరా కోసం కరువు నిధులు కలిపి మొత్తం రూ.73.06 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధుల ద్వారా ఇప్పటి వరకు 107 పనులు పూర్తి చేశారు. మరో 420 పనులు జరుగుతున్నాయి. ఇంకా 313 పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం చేస్తున్న పనులు, పూర్తయిన పనుల్లో టీడీపీ నాయకులు చేతివాటం ప్రదర్శించారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పుచ్చుకుని జేబులు నింపుకున్నారు. టీడీపీ నాయకులకు అధికారులు కొందరు సహకారం అందించటంతో మదనపల్లె్ల మున్సిపాలిటీలో కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అయ్యిందని టీడీపీ కౌన్సిలర్లే విమర్శలు చేస్తుండటం గమనార్హం.
రాటకొండ ఆక్రమణలు
మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ తమ్ముడు నందకుమార్ భార్య ప్రభుత్వ ఉద్యోగి. అయినా అధికార బలంతో ప్రభుత్వ స్థలాన్ని సొంతం చేసుకున్నారు. అంకిశెట్టిపల్లె పంచాయతీలోని సర్వేనెం.79, 79/2, 79/3, 80/2, 80/3, 82/5, 82/6, 83, 84/13, 84/14, 84/1, 85/2, 86/9, 87/1, 87/2, 87/3, 87/4 లోని 30 ఎకరాల ప్రభుత్వ భూమిని నందకుమార్, ఆయన అన్న శ్రీనాథ్ పేరుతో కట్టబెట్టారు. దీంతో పాటుగా వేంపల్లె రెవెన్యూ గ్రామపరిధిలో 2035/1 సర్వేనెంబరులో 3.89 ఎకరాలు నందకుమార్ భార్య, ప్రభుత్వ టీచర్ భరణి పేరుతో ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నారు.
డీకేటీ భూమిని మాజీ సైనికుడి పట్టాగా మార్చి...
ఇదిలా ఉంటే... మరి కొందరు టీడీపీ నాయకులు తామేమీ తక్కువ కాదన్నట్లు భూములపై పంజా విసిరారు. బసినికొండకు చెందిన సామిశెట్టి వెంకటరమణకు సర్వేనెం.691/2లో 1.90 ఎకరాల డీకేటీ భూమిని రెవెన్యూ అధికారులు ఇచ్చారు. 2010లో వీఆర్వో రెడ్డిశేఖర్ సహకారంతో గంగన్నగారిపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు గంగారపు బాబురెడ్డి, తదితరులు కలిసి డీకేటీ పట్టాను మాజీ సైనికుడి పట్టాగా మార్పుచేశారు. దానికి అనుగుణంగా చనిపోయిన పట్టాదారుడు వెంకటరమణను మాజీ సైనికుడిగా నకిలీ గుర్తింపుకార్డులు, ఎన్‌వోసీ తయారుచేశారు. అదే భూమిని వేరొకరికి రూ.55లక్షలకు విక్రయించినట్లు రికార్డులు సృష్టించారు. ఆ విక్రయ పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి రూ.1.50కోట్లు రుణం పొంది, బ్యాంకును బురిడీ కొట్టించారు. దీనిపై అప్పటి సబ్‌కలెక్టర్ కృతికాబాత్రా పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఆ టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ బాగోతంలో మరికొందరు టీడీపీ నాయకులకు భాగస్వామ్యం ఉన్నట్లు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అదే విధంగా పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద ఉన్న వక్ఫ్‌బోర్డు భూములను టీడీపీ నేతలు వదల్లేదు. స్థలానికి సంబంధించిన యాజమాన్యపు హక్కు పత్రాలు, వక్ఫ్‌బోర్డు వద్ద సక్రమంగా లేకపోవడంతో కొందరు టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ భూముల వివాదంలోనే మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్‌పై దాడి చేయడతో, పోలీసు స్టేషన్ వరకు వెళ్లి ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకునేంతవరకు వెళ్లింది.
మాజీ సైనికులకూ ఎసరు పెడతారా..
ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశ సేవ చేసిన మాజీ సైని కుల భూములను టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆక్రమించారు. వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. కోర్టులో మాజీ సైనికులకు అనుకూలంగా వచ్చినా స్టేటస్ కో ద్వారా అడ్డుకుంటున్నారు. అధికార బలంతో కోర్టులో కేసు జరగకుండా సాగదీస్తున్నారు.– కంచర్ల శ్రీనివాసులు,అధ్యక్షుడు,మాజీ సైనికుల సంక్షేమ సంఘం
Comments
Please login to add a commentAdd a comment