
అక్రమ కేసులను నిలువరించండి
శ్రీకాకుళం క్రైం/శ్రీకాకుళం పాతబస్టాండ్, తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అధికార బలంతో పోలీసులను పావుల్లా వాడుకుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వాటిని నిలువరించాలని ఆ పార్టీ నాయకులు జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్, ఇన్‌చార్జి కలెక్టర్ జి.వీరపాండ్యను సోమవారం వేర్వేరుగా కలిసి కోరారు. ఎస్పీని పార్టీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్‌కుమార్, ధర్మాన పద్మప్రియ తదితరులు కలిసి వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, పోలీసులు బనాయిస్తున్న అక్రమ కేసులను గురించి వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెరిగిపోయూయని ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసులను వాడుకుంటూ వైసీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా అక్రమ కేసులను బనాయిస్తున్నారని వాపోయూరు. ఎటువంటి తప్పులు చేయకపోయినా మంత్రి అచ్చెన్నాయుడు మాటలు విని తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో శాంతి భద్రతలకు టీడీపీ నాయకులు విఘాతం కలిగిస్తున్నారని, దీనికి కొంతమంది పోలీసులనే వాడుకుంటున్నారని చెప్పారు. సంతబొమ్మాళి మండలంలోని రామన్నపేటలో సీనియర్ నాయకుడు ఎన్ని చిన్నబాబు ఎటువంటి తప్పు చేయనప్పటికీ ఆతన్ని ఆరెస్టు చేసి నానాబెయిల్‌బుల్ వారెంటును జారీ చేశారని ఎస్పీకి వివరించారు.
సంతబొమ్మాళి మండలం ఆర్.హెచ్.పురం మాజీ సర్పంచ్ మన్మథరావు, కొటబోమ్మాళి మండలం హరిశ్చంద్రపురానికి చెందిన చింతాడ ధర్మారావుపైనా కూడా అక్రమ కేసులు పెట్టి ఆరెస్టులు చేశారని వివరించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలిచ్చిన ఫిర్యాదులను పోలీసులు స్వీకరించటం లేదని ఫిర్యాదు చేశారు. గడిచిన మూడు నెలలుగా జిల్లాలో ఆరాచకం చోటు చేసుకుంటుందని వివరించారు. టెక్కలి డీఎల్‌పీవో కూడా వైఎస్‌ఆర్‌సీపీ సర్పంచ్‌ల నుంచి రికార్డులు తెప్పించుకొని, కార్యదర్శులను బయపెట్టి వారిపై కేసులు పెడుతున్నారని, చెక్కు పవర్ లేకుండా అక్రమంగా వ్యవహరిస్తున్నారని ఇన్‌చార్జి కలెక్టర్ వీరపాండ్యన్‌కు వివరించారు. ఎస్పీ, ఇన్‌చార్జి కలెక్టర్‌ను కలిసిన వారిలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు రొక్కం సూర్యప్రకాశరావు, చింతడ ధర్మరావు, కె.వి.వి.సత్యనారాయణ, కింజరాపు గణపతి, మురళీధర్‌బాబా, కె.రామారావు, కె.చిన్నబాబు, జగన్నాయకులు ఉన్నారు.