తహశీల్దార్ రమణ చేత బలవంతంగా క్షమాపణ చెప్పించుకుంటున్న టీడీపీ నేత కందికుంట
అనంతపురం జిల్లా: అధికారం అండ చూసుకుని రాష్ట్రంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అధికారులపై తమ ప్రతాపం కొనసాగిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కదిరిలో దళిత వర్గానికి చెందిన తహసీల్దార్‌పై నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నోరు తెరిచావో.. చెయ్యి చేసుకోవాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మండల మేజిస్ట్రేట్ అని కూడా చూడకుండా తహసీల్దార్‌పై బండబూతులకు దిగారు. ఈ తతంగమంతా సీఐ సమక్షంలోనే కొనసాగడం గమనార్హం.
నాపైన డెకాయిట్ కేసుంది.. నీకు తెలీదేమో..
తన వర్గీయులకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు జాప్యం చేయడమేగాక ఎమ్మెల్యే చాంద్‌బాషాను కలవమంటున్నారనే ఆగ్రహంతో కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కందికుంట తన వర్గీయులతో కలసి శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కందికుంటతోపాటు ఆయన వర్గీయులు దళిత వర్గానికి చెందిన తహసీల్దార్ పీవీ రమణను నోటికొచ్చినట్లు మాట్లాడారు. ‘‘నువ్వు నా కన్నా తక్కువ చదువుకున్నావు. నిన్ను ఏసీబీకి పట్టించడం నాకు రెండు నిమిషాలు పట్టదు. ఇంటిపట్టాలు ఇవ్వమంటే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లమంటావా? నాకు అనుకూలంగా ఉన్నాడని ఇక్కడున్న ఓ వీఆర్‌ఓను బదిలీ చేసి బ్రోకర్‌ను తెచ్చుకుంటావా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాపైన డెకాయిట్ కేసు నమోదైంది.. నీకు తెలీదేమో..’’ అంటూ కందికుంట తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
తహసీల్దార్ అది కాదు సార్ అనబోగా.. ‘‘ఏందివయ్యా.. మళ్లీ అది కాదంటావు.. ఇంగ నేను బూతులే మాట్లాడతా.. నువ్వు నోరు తెరిచావనుకో.. నేను చెయ్యి చేసుకోవాల్సి ఉంటుంది’’ అని బెదిరింపులకు దిగారు. ‘‘ఇక్కడి రాజకీయాల్ని అనుకూలంగా మార్చుకుని మమ్మల్ని ఇబ్బంది పెడతావా? నా మనుషులొస్తే ఎమ్మెల్యే దగ్గరకు పొమ్మంటావా? వాడెవడు?’’ అని రెచ్చిపోయారు. ఇదే అదనుగా కందికుంట అనుచరుడు హరి మాట్లాడుతూ తాను వీఆర్వో అఖిలేష్‌కు రూ.70 వేలు, మీకు రూ.50 వేలు లంచమిచ్చానని అనగా.. తహసీల్దార్ అబద్ధాలు చెప్పొద్దని బదులిచ్చారు. ఇంతలో మున్సిపల్ చైర్‌పర్సన్ సురయాభాను అందుకుంటూ.. నీ దగ్గరకొస్తే ఎమ్మెల్యే దగ్గరకు పొమ్మంటావా? నువ్వు ఎమ్మార్వోనా లేక రాజకీయ బ్రోకర్‌వా? అంటూ రెట్టించారు. బలవంతంగా ఆయనతో కందికుంటకు క్షమాపణలు చెప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment