రైతుబజార్ టీడీపీ నేతజాగీర్ | tdp leader Vegetable Wholesale Business in tuni market yard | Sakshi
Sakshi News home page

రైతు బజార్ టీడీపీ నేతజాగీర్

Published Thu, Sep 11 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

రైతుబజార్ టీడీపీ నేతజాగీర్

రైతుబజార్ టీడీపీ నేతజాగీర్

తుని : దళారుల దందా లేకుండా అటు  కూరలు పండించే రైతులకు, ఇటు వినియోగదారులకు ప్రయోజనం కలిగిం చాలన్న ధ్యేయంతో ఏర్పాటు చేసిన రైతుబజారు.. తునిలో అధికారపార్టీ నాయకుడి జాగీరుగా మారింది. టీడీపీ నేత, మున్సిపల్ కౌన్సిల్ కో ఆప్షన్ సభ్యుడు రాపేటి సూరిబాబు తుని మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన రైతుబజార్లో ఒకటి కాదు, రెండు కాదు.. ఆరుషాపుల జాగా లో కూరగాయల హోల్‌సేల్ వ్యాపారం నడుపుతున్నారు. ఆయన బరితెగింపు అంతటితోనూ ఆగలేదు.‘రాపేటి సూరి బాబు రైతు బజార్’ అని బోర్డూ పెట్టుకున్నారు. ‘అదేమి’టన్న వారి అంతు చూస్తాన న్నారు. గురువారం ‘సాక్షి’ చానల్ ప్రతినిధి కె.అప్పారావుపై దౌర్జన్యంగా వ్యవహరించడమే అందుకు సాక్ష్యం.
 
మార్కెట్ యార్డులో  గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లో.. నిజమైన రైతులకు జాగా కరువు కాగా, రైతులు కాని వారికి దుకాణాలు కట్టబెట్టారు. ఈ బజార్లో ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ నేత రాపేటి సూరిబాబు ఆరు షాపుల స్ధలంలో హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ‘రైతు బజార్’కు ముందు తన పేరు తగిలించి బోర్డు కూడా ఏర్పాటు చేశారు. వినియోగదారులకు, రైతులకు మధ్య దళారీ వ్యవస్థ ఉండకూడదన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రైతుబజార్లో రైతులు కాని వారు, బినామీలు షాపులను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని పలువురు రైతులు ‘సాక్షి’ చానల్ ప్రతినిధి అప్పారావు దృష్టికి తీసుకువచ్చారు.
 
దీంతో ఆయన గురువారం రైతు బజార్‌కు వెళ్లి అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు. రైతులు కాని వారికి దుకాణాలు ఉన్నాయని, ఒకే వ్యక్తి అనేక దుకాణాలు నిర్వహిస్తున్నారని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కేఆర్‌ఆర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకు వెళ్లారు. నిబంధనల మేరకు ఎవరికైనా ఒక్క షాపు మాత్రమే కేటాయిస్తారని, ఒకే వ్యక్తికి ఎక్కువ షాపులు ఉండకూడదని కార్యదర్శి చెప్పారు. రైతు బజార్‌కు తన పేరు పెట్టుకోవడం చట్ట విరుద్ధమనీ స్పష్టం చేశారు. అనధికారికంగా నిర్వహిస్తున్న షాపుల యజమానులకు నోటీసులు ఇచ్చి, తొలగిస్తామన్నారు.
 
సాయంత్రానికి అంతు చూస్తా..
కాగా ‘సాక్షి’ చానల్ ప్రతినిధి అప్పారావు రైతుబజార్లో దృశ్యాలను చిత్రీకరించిన సంగతి తెలుసుకున్న సూరిబాబు.. అక్కడి నుంచి ఇంటికి వెళుతున్న అప్పారావును పాత రైతు బజార్ సమీపంలో అడ్డగించారు. నానా దుర్భాషలు ఆడారు. తన షాపులను చిత్రీకరించినందుకు సాయంత్రానికి అంతు చూస్తానని బెదిరించారు. దీంతో అప్పారావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. మరోపక్క అప్పారావు తనను సొమ్ముల కోసం డిమాండ్ చేశాడంటూ సూరిబాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదుకు టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. కాగాప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే మీడియా ప్రతినిధులపై టీడీపీ నేత సూరిబాబు దౌర్జన్యానికి పాల్పడడాన్ని పలువురు నిరసిస్తున్నారు. ఇది తెలుగుతమ్ముళ్ల నిరంకుశ వైఖరికి నిదర్శనమంటున్నారు.
 
భారీ వ్యాపారంతో బడా వ్యాపారుల కన్ను
తుని, తొండంగి, కోటనందూరు మండలాలకు చెందిన 25 గ్రామాలకు వినియోగపడేలా ఈ రైతుబజార్‌ను నాలుగేళ్ల క్రితం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేశారు. వివిధ రకాల కూరగాయలను రైతులు రోజూ మార్కెట్‌కు తీసుకు వస్తారు. రోజుకు రూ.ఐదు లక్షల మేర వ్యాపారం జరుగుతుంది. కేవలం రిటైల్ వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన బజారుపై బడా వ్యాపారుల కన్ను పడింది. ఇక ప్రస్తుతం అధికారం ఉండడంతో పలువురు తెలుగు తమ్ముళ్లు దీనిని సొంత జాగీరుగా ఉపయోగించుకుంటున్నారు. రైతుబజార్లో గుత్తాధిపత్యానికి తెరదించి, రైతులకు, చిరు వ్యాపారులకు అవకాశం కల్పించినప్పుడే వాటి ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement