raitu bazar
-
భలే కొంటున్నారు సారూ...
-
సామాన్యులకు ధరాఘాతం
సాక్షి, అమరావతి: కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్న వినియోగదారులకు వాటి ధరలు చూసి గుండెల్లో దడ పుడుతోంది. భారీగా పెరిగిన ధరలతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే వణికిపోతున్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, దీనికి తోడు కూరగాయల ధరలపై నియంత్రణ కూడా లేకపోవడంతో వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. మరోవైపు ఏటా వేసవిలో కూరగాయల ధరలు పెరగడం పరిపాటేనంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అయితే, ఆ మేరకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. కూరగాయల రవాణా చార్జీలు, దళారుల కమీషన్లు కలిపి మార్కెట్లో అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తూ సామాన్యుల నడ్డి విరగ్గొడుతున్నారు. రాయితీ ధరలకు అందించాల్సి ఉన్నా.. సాధారణంగా కూరగాయలు వంటి నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం రైతుబజార్లలోప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రాయితీ ధరలకు అందించేలా ఏర్పాట్లు చేయాలి. అయితే, విజయవాడ హైస్కూలు రోడ్డులో ఉన్న రైతుబజార్లో పట్టికలో తక్కువ ధర చూపుతూ ఎక్కువ ధర వసూలు చేస్తుండటం గమనార్హం. రైతుబజార్లలో రైతులకు బదులుగా ఎక్కువ మంది వ్యాపారులే తిష్టవేసి ఉంటున్నారు. టమోట, పచ్చి మిర్చి తదితరాలను రైతుబజార్లో విక్రయించకుండా అక్కడే బయట రోడ్డు పక్కన అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. వినియోగదారులు ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే.. ‘అవసరమైతే తీసుకోండి.. లేకపోతే పోండి’ అంటూ అక్కడి వ్యాపారులు కసిరికొడుతున్నారు. టమోట, పచ్చి మిర్చి, చిక్కుడు, బీన్స్, క్యాప్సికం ఇలా ఒకటేమిటి దాదాపు అన్ని కూరగాయలు వినియోగదారులను హడలెత్తిస్తున్నాయి. 10 రోజుల కిందట విజయవాడ రైతుబజార్లో కిలో రూ.15 ఉన్న టమోట ప్రస్తుతం రూ.32కు, పచ్చి మిర్చి రూ.20 నుంచి రూ.40కు, క్యారెట్ రూ.12 నుంచి రూ.34కు పెరిగింది. ఇలా ఏ కూరగాయలు ముట్టుకున్నా రెట్టింపు ధర పలుకుతూ షాక్ కొడుతున్నాయి. అధికారుల వాదన ఇలా.. అధికారుల వాదన మరోలా ఉంది. స్థానికంగా కాకుండా సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండటం వల్లే ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. రైతుబజార్ ధరల కంటే కనీసంగా కిలోకు రూ.15 నుంచి రూ.20 ఎక్కువగా బయట మార్కెట్లో, చిల్లర దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ వన్‌టౌన్ కూరగాయల మార్కెట్‌కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు టన్నుల్లో కూరగాయలు తెస్తుంటారు. ఇక్కడ రైతుబజార్ లేదు. దీంతో బహిరంగ మార్కెట్లోని ధరలకు కొనుగోలు చేయాల్సి రావడంతో సామాన్యులు కూరగాయలు కొనలేక, పచ్చడి మెతుకులు తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నలుగురు ఉండే కుటుంబం నాలుగు రకాల కూరగాయలను కొనుగోలు చేయాలంటే వారానికి రూ.300పైనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దండుకుంటున్న దళారులు, వ్యాపారులు దళారులు, వ్యాపారులు భారీగా దండుకుంటున్నా పండించిన రైతుకు మాత్రం కనీస ధర కూడా లభించడం లేదు. వేసవి నేపథ్యంలో భూగర్భ జలాలు ఎండిపోయినా ఎన్నో తిప్పలు పడి సాగు చేసిన రైతుకు రిక్తహస్తమే ఎదురవుతోంది. అయితే, సాగునీటి సమస్యతో చాలా మంది రైతులు కూరగాయలను సాగు చేయడం లేదని, దీంతో ఏటా వేసవిలో ధరలు పెరుగుతున్నాయని రైతుబజార్‌లోని కయదారులు అంటున్నారు. కూరగాయల ధరలు పెరగడంతో రోజూ కూలికి పోతేగాని పూట గడవనివారు 15 రోజులుగా మార్కెట్‌కు వెళ్లడమే మానేశారని నారాయణమ్మ అనే మహిళ వెల్లడించింది. రైతుబజార్లలో ఉన్న ధరల పట్టికల్లో చూపుతున్న ధరలకు, విక్రయిస్తున్న ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని పలువురు వినియోగదారులు పేర్కొన్నారు. -
‘ప్రకృతి’ ఉత్పత్తులకు విశేష ఆదరణ
- నంద్యాల రైతు శిక్షణ కేంద్రం డీడీఏ సంధ్యారాణి కర్నూలు(అగ్రికల్చర్): పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకుండా.. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలకు విశేష ఆదరణ లభిస్తోందని నంద్యాల రైతు శిక్షణ కేంద్రం డీడీఏ సంధ్యారాణి, వ్యవసాయశాఖ డీడీఏ మల్లికార్జునరావు అన్నారు. నంద్యాల రైతు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల శిబిరాన్ని సోమవారం.. కర్నూలు సీక్యాంప్ రైతు బజార్లో వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బండి ఆత్మకూరు, నంద్యాల, బనగానపల్లె, బేతంచెర్ల, వెలుగోడు మండలాల్లో 8 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 299 మంది రైతులు 350 హెక్టార్లలో ఈ వ్యవసాయం చేస్తున్నారన్నారు. ప్రదర్శనలో బియ్యం, జొన్నలు, జొన్నపిండి, కందిపప్పు, రాగులు, కొర్ర బియ్యం, నువ్వులు, పసుపుతో పాటు మామిడి కాయలు, పండ్ల, ఇతర కూరగాయలను విక్రయానికి ఉంచారు. వినియోగదారులు పోటీ వీటిని పడి కొనుగోలు చేశారు. మంగళవారం కూడా ప్రదర్శన ఉంటుంది. ఎన్‌పీఎం డీపీఎం నాగరాజు, నంద్యాల రైతు శిక్షణ కేంద్రం ఏడీఏ అరుణకుమారి, వ్యవసాయాధికారులు నాగసరోజ, నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్వైప్ మిషన్.. మాకొద్దు బాబోయ్ !
- రైతు బజార్లో స్వైప్ మిషన్ల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ ప్రయత్నం - నిర్వహించలేమంటున్న రైతులు, పొదుపు మహిళలు - కొనుగోలుదారులకూ కష్టమే - స్వైప్ మిషన్లు ఉంటేనే అమ్మకాలకు అనుమతి అంటూ అధికారుల బెదిరింపు ఒకప్పుడు రైతు బజార్లో ఎలక్ట్రానిక్ కాటా తప్పని సరిగా ఉపయోగించాలంటే మావల్ల కాదన్న గ్రామీణ రైతులు ఇప్పుడు స్వైప్ మిషన్లు తప్పదని అధికారులు ఆదేశించడంతో మాకొద్దు బాబోయ్ అంటున్నారు. రైతు బజార్లో రూ. 1 మొదలు కొని రూ. 70..80.. ధర ఉండే ఉత్పత్తులను కొనుగోలుదారులు ఒక్కో వ్యాపారి వద్ద ఒక్కో రకం తీసుకుని చిల్లర ఇస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ. 500ఽకు మించి వ్యాపారం జరగదు. ఇలాంటి తరుణంలో స్వైప్ మిషన్లు తప్పనిసరి అని మార్కెటింగ్ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో విక్రయదారులు బెంబేలెత్తుతున్నారు. అసలు రైతుబజార్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. - కర్నూలు(అగ్రికల్చర్) మార్కెటింగ్ శాఖ కమిషనర్ అన్ని రైతుబాజర్లలో విధిగా నగదురహిత లావాదేవీలు నిర్వహించాలని మార్కెటింగ్ అధికారులు, ఎస్టేటు ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేయడంతో వీరు రైతులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కర్నూలులో మూడు, నంద్యాల, ఆదోనిలో ఒక్కొక్కటి ప్రకారం మొత్తం ఐదు రైతుబజార్లు ఉన్నాయి. వీటిన్నింటిలో నగదురహిత లావాదేవీల నిర్వహణకు రైతులు స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ తప్పనిసరి అని చెప్పడంతో రైతుల ఆందోళన అంతా..ఇంతా కాదు. అసలు నగదు రహిత లావాదేవీలు అంటే ఏమి? స్వైప్ మిషన్ ఎలా పని చేస్తుంది? డబ్బులు ఖాతాల్లో ఎలా జమ అవుతాయి...వాటిని ఎలా తీసుకోవాలి? ఇలా ఎన్నో అనుమానాలతో రైతులు, పొదుపు మహిళలు స్వైప్‌పై మొగ్గు చూపడం లేదు. రైతు బజార్లో రూ.10, రూ.20 మేర కొనుగోలు చేసే వారు స్వైప్ ఉపయోగించడం ఎలా వీలు అవుతుందని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. నెలసరి నిత్యావసర సరుకులు ఒకే దుకాణంలో రూ.1500 నుంచి రూ2000 వరకు కొనుగోలు చేస్తారు. అక్కడ ఈ మిషన్లు ఉపయోగించడం సులువు కానీ రైతు బజార్లో సాధ్యం కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిరక్ష్యరాస్యతతో నిర్వహణ ఎలా: రైతు బజార్లో కూరగాయలు అమ్ముకునే రైతులు, పొదుపు మహిళలు దాదాపు నిరక్షరాస్యులే. వీరికి నగదు రహితంపై అసలు కనీస అవగాహన లేదు. తూకంలో కూడా కిలో.. అర కిలో రాళ్లనే ఉపయోగిస్తారు. ఎలకా్ట్రనిక్ కాటాను ఉపయోగించలేని వారు సై్వప్ మిషన్‌ను ఎలా నిర్వహిస్తారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మార్కెటింగ్ అధికారులు బలవంతంగా స్వైప్ మిషన్ల ఏర్పాటుకు రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. స్వైప్ మిషన్లు లేకపోతే రైతుబజార్లో కూర్చోనివ్వమని బెదిరిస్తున్నారు. రైతుబజార్లలో దళారీలు తిష్టవేశారు. మార్కెటింగ్ అధికారులు వీరిని వదలి వారంలో కేవలం రెండు, మూడు రోజలు మాత్రమే కూరగాయలు అమ్మకునే రైతులు, పొదుపు మహిళలను స్వైప్ మిషన్ల పేరుతో వేధిస్తున్నారు. మాకెందుకు కరెంట్ ఖాతాలు అంటూ చెబుతున్నా తీసుకోవాల్సిందేనంటూ ఒత్తిడి చేస్తున్నారు. వినియోగదారులు కూడా రైతుబజార్లలో స్వైప్ మిషన్లు వాడటానికి ఆసక్తి చూపటం లేదు. ఒకచోట అయితే వాడుతాము.. కూరగాయలు ఐదారుగురు దగ్గర కొంటే అందరి దగ్గర వాడాలంటే ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. నో క్యాష్ నేపథ్యంలో విత్‌డ్రా ఎలా: రూ.500, 1000 నోట్ల రద్దుతో ఇప్పటికే బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ఖాతాల్లో ఉన్న డబ్బును తీసుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని బ్యాంకుల్లోను నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. నగదు ఉన్నా... రూ.2000 నుంచి 4000 మించి ఇవ్వడం లేదు. స్వైప్మిషన్లను వినియోగించడం ద్వారా నగదు ఖాతాల్లో జమ అయితే తీసుకోవడం ఎలా అని ఆవేదన చెందుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బును పొలం వద్ద కూలీలకు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. స్వైప్ మిషన్లు తప్పనిసరి: సత్యనారాయణ చౌదరి ఏడీఎం అన్ని రైతుబజార్‌ల్లో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల చివరిలోగా ప్రతి ఒక్కరు కరెంట్ ఖాతాలు ప్రారంభించి స్వైప్ మిషన్లు పెట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సిండికేట్ బ్యాంకు, జిల్లా సహకార కేంద్రబ్యాంకు, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకు, ఏపీజీబీల్లో కరెంట్ ఖాతాలు ప్రారంభించాలని చెబుతున్నాం. ప్రస్తుతానికి 25 మంది రైతులు, 24 పొదుపు గ్రూపుల మహిళల చేత స్వైప్ మిషన్లు పెట్టిస్తున్నాం. రైతుబజార్‌ల్లో నగదురహిత లావాదేవీలు నిర్వహించాలనేది లక్ష్యం. స్వైప్ మిషన్ కష్టమే: శ్రీనివాసగౌడు నందనపల్లి కర్నూలు మండలం నేను వారంలో రెండుమూడు రోజులే కూరగాయలు అమ్ముకుంటాను. నాకు చదువు రాదు. మా దగ్గర ఒక్కొక్కరు ఒక్కో రకం కూరగాయలు కొంటారు. వీటికి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని అధికారులు చెబుతున్నారు. కరెంటు ఖాతా ప్రారంభించాలం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే రూ.500 వ్యాపారం జరుగదు. మాకెందుకు స్వైప్ మిషన్లు. డబ్బు పడితే తీసుకునేదెలా: విజయ, పడిదెంపాడు కూరగాయలు కొంటానికి వచ్చిన వారు ఎక్కడ ఏది బాగా ఉంటే అక్కడే కొనుక్కుంటారు. రైతుబజారుకు వచ్చిన వారు కనీసం ఐదారు మంది దగ్గర కూరగాయలు కొంటారు. అందరి దగ్గర మిషన్లను వాడాలంటే సాధ్యం కాదు. మాకు వ్యాపారాలపైనే దృష్టి ఉంటుంది. మిషన్ల ద్వారా ఎలా తీసుకుంటాము. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడితే తీసుకోవడం ఎలా... బ్యాంకుల్లో డబ్బులు లేకపోతే ఎలా ఇస్తారు. ఈ వ్యాపారాలకు మిషన్లు సరిపోవు. ఒత్తిడి చేయడం మంచిది కాదు: మద్దమ్మ, భూపాల్‌నగర్ కరెంటు ఖాతాలు ప్రారంభించాలని, మిషన్లు తెచ్చుకోవాలని అధికారులు మహిళలపై ఒత్తిడి తెస్తున్నారు. మాకు చదువు రాదు. కరెంటు ఖాతాలు... స్వైప్ మిషన్ల పేర్లే వినలేదు. కనీస అవగాహన కూడ లేకపోతే వాటిని ఎలా నిర్వహించాలి. పెద్దపెద్ద వ్యాపారాల దగ్గర వాటిని పెడితే ఉపయోగం ఉంటుంది. ఇప్పటికైన ప్రభుత్వం పునరాలోచన చేయాలి. -
ఖమ్మం రైతు మార్కెట్లో నోట్ల రద్దు ఎఫెక్ట్
-
దళారుల చేతుల్లో చిక్కుకున్న రైతు బజార్లు
-
'మన ఊరు-మన కూరగాయలు' స్టాళ్లు ప్రారంభం
హైదరాబాద్: వినియోగదారులకు తక్కువ ధరకు కూరగాయలు అందించటం కోసం ' మన ఊరు-మన కూరగాయలు' పేరుతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. నగరంలోని మెహదీపట్నం రైతు బజార్ లో బుధవారం తెలంగాణ మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి వాటిని ప్రారంభింబారు. ఈ స్టాళ్ల ద్వారా నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకే పొందవచ్చని వారు తెలిపారు. అనంతరం గుడిమల్కాపూర్ పూల మార్కెట్ ను మంత్రులు సందర్శించారు. -
రైతుబజార్ టీడీపీ నేతజాగీర్
తుని : దళారుల దందా లేకుండా అటు కూరలు పండించే రైతులకు, ఇటు వినియోగదారులకు ప్రయోజనం కలిగిం చాలన్న ధ్యేయంతో ఏర్పాటు చేసిన రైతుబజారు.. తునిలో అధికారపార్టీ నాయకుడి జాగీరుగా మారింది. టీడీపీ నేత, మున్సిపల్ కౌన్సిల్ కో ఆప్షన్ సభ్యుడు రాపేటి సూరిబాబు తుని మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన రైతుబజార్లో ఒకటి కాదు, రెండు కాదు.. ఆరుషాపుల జాగా లో కూరగాయల హోల్‌సేల్ వ్యాపారం నడుపుతున్నారు. ఆయన బరితెగింపు అంతటితోనూ ఆగలేదు.‘రాపేటి సూరి బాబు రైతు బజార్’ అని బోర్డూ పెట్టుకున్నారు. ‘అదేమి’టన్న వారి అంతు చూస్తాన న్నారు. గురువారం ‘సాక్షి’ చానల్ ప్రతినిధి కె.అప్పారావుపై దౌర్జన్యంగా వ్యవహరించడమే అందుకు సాక్ష్యం. మార్కెట్ యార్డులో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లో.. నిజమైన రైతులకు జాగా కరువు కాగా, రైతులు కాని వారికి దుకాణాలు కట్టబెట్టారు. ఈ బజార్లో ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ నేత రాపేటి సూరిబాబు ఆరు షాపుల స్ధలంలో హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ‘రైతు బజార్’కు ముందు తన పేరు తగిలించి బోర్డు కూడా ఏర్పాటు చేశారు. వినియోగదారులకు, రైతులకు మధ్య దళారీ వ్యవస్థ ఉండకూడదన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రైతుబజార్లో రైతులు కాని వారు, బినామీలు షాపులను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని పలువురు రైతులు ‘సాక్షి’ చానల్ ప్రతినిధి అప్పారావు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన గురువారం రైతు బజార్‌కు వెళ్లి అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు. రైతులు కాని వారికి దుకాణాలు ఉన్నాయని, ఒకే వ్యక్తి అనేక దుకాణాలు నిర్వహిస్తున్నారని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కేఆర్ఆర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకు వెళ్లారు. నిబంధనల మేరకు ఎవరికైనా ఒక్క షాపు మాత్రమే కేటాయిస్తారని, ఒకే వ్యక్తికి ఎక్కువ షాపులు ఉండకూడదని కార్యదర్శి చెప్పారు. రైతు బజార్‌కు తన పేరు పెట్టుకోవడం చట్ట విరుద్ధమనీ స్పష్టం చేశారు. అనధికారికంగా నిర్వహిస్తున్న షాపుల యజమానులకు నోటీసులు ఇచ్చి, తొలగిస్తామన్నారు. సాయంత్రానికి అంతు చూస్తా.. కాగా ‘సాక్షి’ చానల్ ప్రతినిధి అప్పారావు రైతుబజార్లో దృశ్యాలను చిత్రీకరించిన సంగతి తెలుసుకున్న సూరిబాబు.. అక్కడి నుంచి ఇంటికి వెళుతున్న అప్పారావును పాత రైతు బజార్ సమీపంలో అడ్డగించారు. నానా దుర్భాషలు ఆడారు. తన షాపులను చిత్రీకరించినందుకు సాయంత్రానికి అంతు చూస్తానని బెదిరించారు. దీంతో అప్పారావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. మరోపక్క అప్పారావు తనను సొమ్ముల కోసం డిమాండ్ చేశాడంటూ సూరిబాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదుకు టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. కాగాప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే మీడియా ప్రతినిధులపై టీడీపీ నేత సూరిబాబు దౌర్జన్యానికి పాల్పడడాన్ని పలువురు నిరసిస్తున్నారు. ఇది తెలుగుతమ్ముళ్ల నిరంకుశ వైఖరికి నిదర్శనమంటున్నారు. భారీ వ్యాపారంతో బడా వ్యాపారుల కన్ను తుని, తొండంగి, కోటనందూరు మండలాలకు చెందిన 25 గ్రామాలకు వినియోగపడేలా ఈ రైతుబజార్‌ను నాలుగేళ్ల క్రితం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేశారు. వివిధ రకాల కూరగాయలను రైతులు రోజూ మార్కెట్‌కు తీసుకు వస్తారు. రోజుకు రూ.ఐదు లక్షల మేర వ్యాపారం జరుగుతుంది. కేవలం రిటైల్ వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన బజారుపై బడా వ్యాపారుల కన్ను పడింది. ఇక ప్రస్తుతం అధికారం ఉండడంతో పలువురు తెలుగు తమ్ముళ్లు దీనిని సొంత జాగీరుగా ఉపయోగించుకుంటున్నారు. రైతుబజార్లో గుత్తాధిపత్యానికి తెరదించి, రైతులకు, చిరు వ్యాపారులకు అవకాశం కల్పించినప్పుడే వాటి ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది.