సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులపై అధికార పార్టీ నేతల ప్రతాపం నానాటికీ శృతి మించుతోంది. టీడీపీ నాయకుల దౌర్జనాలకు నాలుగో సింహం నలిగిపోతోంది. అయ్యా.. బాబూ.. పోలీసోళ్లం కాపాడండి అని వేడుకునే దుస్థితి దాపురించింది. రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు కమిషనర్ నుంచి కానిస్టేబుల్‌పై వరకూ అధికార టీడీపీ నేతల బారిన పడుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతోంది. నిబంధనల ప్రకారం నడుచుకుంటామంటే దౌర్జన్యం.. చట్ట వ్యతిరేక చర్యలు వద్దంటే దాడులు. అసాంఘీక కార్యకలాపాలు ఆపాలని కోరితే ఆగ్రహం.. ఇలా తెలుగుదేశం పార్టీ నాయకలు పోలీసులపై రెచ్చిపోతున్నారు. రక్షక భటులని పిలిపించుకునే తమకే రక్షణ లేని పరిస్థితి నెలకొందని పోలీసులు మదన పడుతున్నారు.
చంద్రబాబు సొంత జిల్లాలో..
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మంగళవారం ఇద్దరు టీడీపీ నేతలు కానిస్టేబుల్‌ను కొట్టడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా టీడీపీ ఆఫీస్ ఆపరేటర్ యుగంధర్ నాయుడు, అతడి తండ్రి చంద్రశేఖర్ నాయుడు మండల కేంద్రమైన పెనుమూరులో ఓ స్థలం వివాదంలో కానిస్టేబుల్ రమేష్‌ను నడిరోడ్డుపైనే కర్రలతో కొట్టారు. పోలీసులైతే ఏం పీకుతార్రా అంటూ దాడికి దిగారు. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగాయి.
- ఈ నెల 18వ తేదీన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ ఆములూరులో కోడి పందేలను అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్సై వీరేంద్రబాబు, కానిస్టేబుళ్లపై పందేల నిర్వాహకులైన స్థానిక టీడీపీ నేతలు కుర్చీలతో కొట్టారు.
- అదేరోజు విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెంలో అశ్లీల నృత్యాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్సై ఆదినారాయణరెడ్డి, పోలీసు సిబ్బందిని టీడీపీ నేతలు కరణం శ్రీనివాసరావు తదితరులు దాడి చేసి కొట్టారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎస్సై ఆదినారాయణరెడ్డి పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. పోలీసు జీపునకు టీడీపీ నాయకులు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి.
- ఇటీవల కొద్ది రోజుల క్రితం అనంతపురంలో మట్కా మాఫియా పోలీసులపై దాడి చేసింది. పోలీసు జీపును కూడా తగలబెట్టడం సంచలనం రేపింది. ఈ మట్కా మాఫియాను నడిపిస్తున్నది తెలుగుదేశం పార్టీ నేతలేనని పోలీసులకు తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి.
- పోలీసులే బాధితులు
- అధికార పార్టీ నేతల దాడుల్లో పోలీసులే బాధితులుగా మారుతున్నారు. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని ప్రధాన సంఘటనలపై ఇప్పటికీ పోలీసు శాఖలో చర్చ సాగుతోంది. తమపై దాడులకు దిగుతున్న అధికారం పక్షం తీరుపై పోలీసు శాఖలో పలువురు మండిపడుతున్నారు.
- తాము చెప్పిన తప్పుడు పనులు చేయలేదనే ఉక్రోషంతో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు సీనియర్ ట్రాన్సుపోర్టు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేశారు. బాలసుబ్రహ్మణ్యం విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ఆయన గన్‌మెన్‌పై దౌర్జన్యం చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఇప్పటిదాకా ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
- పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను వద్ద ట్రాఫిక్ విధుల్లో ఉన్న దేవరపల్లి ఏఎస్‌ఐ జె.పాపారావుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దుర్భాషలాడి దాడిచేసి కొట్టడంతో బాధితుడు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు.
- దెందులూరు నియోజకవర్గంలో ఒక కానిస్టేబుల్‌ను ఇంటికి వెళ్లి మరీ చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా కొట్టారు. కొల్లేరు ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేస్తున్న చింతమనేనిని అడ్డుకున్నందుకు ఫారెస్టు అధికారులపై దాడి చేసి కొట్టారు.అయినా చర్యలు లేవు.
- పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం ఎస్‌ఐ శ్రీనివాస్, రైటర్‌ను నిర్బంధించి దుర్భాషలాడిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మరో ఎనిమిది మందిపై తప్పనిసరి పరిస్థితిలో కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలు మాత్రం తీసుకునే సాహసం చేయలేకపోయారు.
- నెల్లూరులో సీఐని తాట తీస్తానంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దుర్భాషలాడినా చర్యలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment