టీడీపీలో శ్రేణుల్లో అగ్గి రగిలింది | TDP Leaders Angry On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

టీడీపీలో శ్రేణుల్లో అగ్గి రగిలింది

Published Sat, Mar 16 2019 12:32 PM | Last Updated on Sat, Mar 16 2019 12:33 PM

TDP Leaders  Angry On Chandrababu Naidu - Sakshi

పి.గన్నవరంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి

అధినేత చంద్రబాబు టిక్కెట్లు ఖరారు చేసిన తీరుపై జిల్లాలోని టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అత్యధిక నియోజకవర్గాల్లో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. కొన్నిచోట్ల నిరసనలు తెలిపారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనాలు చేశారు. మరికొన్నిచోట్ల సమావేశాలు ఏర్పాటు చేసుకుని, పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల్ని ఓడించి తీరుతామని టీడీపీ శ్రేణులు శపథం చేస్తున్నాయి. తాజా పరిమాణాల నేపథ్యంలో కొందరు పార్టీకి గుడ్‌బై చెప్పేయాలని చూస్తుండగా, మరికొందరు పార్టీలో ఉంటూనే తమ సత్తా చూపించాలని భావిస్తున్నారు. పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తామని అధిష్టానానికి సూటిగా హెచ్చరికలు చేస్తున్నారు.


సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి జిల్లాలోని 16 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో టీడీపీలో ఒక్కసారిగా తీవ్ర అసంతృప్తి రేగింది. పెద్దాపురం టిక్కెట్టు ఆశిస్తున్న బొడ్డు భాస్కర రామారావుకు మొండిచేయి చూపడంతో ఆయనతో పాటు అనుచరవర్గం ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. ఆయన స్వగ్రామం పెద్దాడలో ఏకంగా చంద్రబాబు దిష్టిబొమ్మను బొడ్డు భాస్కర రామారావు అనుచరులు దహనం చేశారు. పార్టీని నమ్ముకుంటే తమను మోసం చేశారని వారందరూ చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. పెద్దాపురం టిక్కెట్టు ఇచ్చిన నిమ్మకాయల చినరాజప్పకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.


కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)కు టిక్కెట్టు ఇవ్వవద్దని, ఇస్తే ఓడిస్తామని 17 మంది కార్పొరేటర్లు, మరికొంతమంది నేతలు ఇప్పటికే సమావేశమై అధిష్టానాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొందరిని ప్రలోభాలతో దారికి తెచ్చుకునే యత్నం కూడా చేశారు. అసంతృప్తులు వెనక్కి తగ్గినట్టే తగ్గి అధిష్టానం పెద్దలకు తమ వ్యతిరేకతను తెలియజేశారు. కానీ చంద్రబాబు పట్టించుకోలేదు. వనమాడికే టిక్కెట్టు ఖరారు చేశారు. దీంతో అసమ్మతి నేతలంతా రగిలిపోతున్నారు. ఒకవైపు కొండబాబుకు బుద్ధి చెబుతామంటూనే మరోవైపు ఈ నెల 17వ తేదీన జిల్లాకొస్తున్న చంద్రబాబు వద్ద తేల్చుకోవాలని చూస్తున్నారు.


ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీలో రాజీనామాల పర్వం పెద్ద ఎత్తున మొదలైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును కాదని డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజాకు టిక్కెట్టు ఖరారు చేశారు. దీంతో సుబ్బారావు వర్గం భగ్గుమంటోంది. ఇప్పటికే ఆయనతో పాటు అనేకమంది టీడీపీకి రాజీనామాలు చేశారు. మరికొంతమంది ఒక్కొక్కరుగా రాజీనామాలు ప్రకటిస్తున్నారు. వరుపుల రాజాను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని హెచ్చరిస్తున్నారు.


రాజోలు టిక్కెట్టు సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకే ఖరారు చేశారు. దీనిపై అక్కడి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతున్నారు. స్థానికేతరుడైన సూర్యారావుకే మళ్లీ టిక్కెట్టు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులకు స్థానికులు పల్లకీ మోయాలా అని విరుచుకుపడుతున్నారు. ఈ టిక్కెట్టు ఆశించిన బత్తుల రాము ఆధ్వర్యాన అసమ్మతి నేతలంతా శుక్రవారం ఉదయం మలికిపురంలో సమావేశమయ్యారు. ఈ నెల 17న జిల్లాకు వస్తున్న చంద్రబాబు వద్ద తేల్చుకుంటామని, స్పందించకపోతే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.


రాజమహేంద్రవరం సిటీలో టీడీపీ సీనియర్‌ నేత, గోదావరి నగరాభివృద్ధి సంస్థ (గుడా) చైర్మన్‌ గన్ని కృష్ణకు అధిష్టానం మొండిచేయి చూపింది. దీంతో ఆయన వర్గం తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఎవరెవరికో టిక్కెట్టు ఇచ్చి, సీనియర్లను విస్మరించడం తగదని, ఆయన అనుచరులందరూ అమరావతి వెళ్లి నిరసన తెలుపుతున్నారు. సీఎం దగ్గరే తేల్చుకుంటామని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి.


జగ్గంపేట టిక్కెట్టును జ్యోతుల నెహ్రూకు ఖరారు చేయడాన్ని టీడీపీలో మొదటినుంచీ ఉన్న నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తమను అణగదొక్కేందుకు వచ్చిన నేతకు మళ్లీ టిక్కెట్టు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తూ, ఏకంగా పార్టీని విడిచి వైఎస్సార్‌ సీపీ బాట పడుతున్నారు. ఇప్పటికే కొందరు చేరిపోయారు. మరికొందరు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.


రాజమహేంద్రవరం రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరిని, రాజానగరంలో పెందుర్తి వెంకటేష్‌ను, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే, రోడ్డెక్కడం కన్నా ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. 

పి.గన్నవరం నియోజకవర్గ టిక్కెట్టును సిట్టింగ్‌ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికి కాకుండా, పార్టీ కోసం కష్టపడని నేలపూడి స్టాలిన్‌బాబుకు కేటాయించారు. దీనిపై ఎమ్మెల్యే వర్గమంతా మండిపడుతోంది. శుక్రవారం సాయంత్రం తన అనుచరులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ తనను నమ్మించి మోసం చేసిందని, కాళ్లరిగేలా తిప్పుకుని మోసగించారని, ఎమ్మెల్యేగా కనీసం గౌరవించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులంతా స్టాలిన్‌బాబును ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement