తహసీల్దార్ కె.రాములు నాయక్
సాక్షి, గుంటూరు: తాము చెప్పినట్లు వినలేదని ఓ గిరిజన తహసీల్దారుపై టీడీపీ నేతలు దాడి చేశారు. చొక్కా పట్టుకుని ఈడ్చారు. కులం పేరుతో దూషించారు. ఈ ఘటనలో తహసీల్దార్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరులో జరిగింది. వట్టి చెరుకూరు మండలం తహసీల్దార్ కె.రాములు నాయక్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నల్లూరి సుబ్బారావు, అతని సోదరుడు శ్యామ్‌బాబు మధ్య పొలానికి సంబంధించిన భూ వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన నల్లూరి సుబ్బారావు ప్రతిరోజూ తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి తన పొలం వివరాలు అడంగల్‌లో ఎక్కించాలంటూ రాములు నాయక్‌ను వేధింపులకు గురిచేసేవాడు.
ఈ క్రమంలోనే ఇటీవల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సుబ్బారావు.. తహసీల్దార్‌ను అసభ్య పదజాలంతో దూషించడంతో ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా శుక్రవారం ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు గుంటూరు నవభారత్‌నగర్‌లోని తన కార్యాలయానికి రావాల్సిందిగా తహసీల్దార్‌ను పిలిపించారు. రాత్రి 7 గంటల సమయంలో తన వద్దకు వచ్చిన తహసీల్దారుకు.. సుబ్బారావుకు సంబంధించిన భూమి వివరాలు అడంగల్‌లో ఎక్కించాలని రావెల సూచించారు. కోర్టులో వివాదం ఉందని రావెల దృష్టికి తీసుకెళ్లిన తహసీల్దార్ తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా సుబ్బారావుతో పాటు, మోతుకూరి వీరయ్యచౌదరి, జాగర్లమూడి ప్రవీణ్, పావులూరి సూర్యప్రకాష్‌రావు అలియాస్ లేమల్లెబాబుతో పాటు మరో ఇద్దరు టీడీపీకి చెందిన వారు ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. అధికారి అని కూడా చూడకుండా దౌర్జన్యం చేశారు. ఈ ఘటనపై తహసీల్దార్ పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగులు, గిరిజన సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో రాములునాయక్‌కు మద్దతుగా స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment