
దాడిలో గాయపడిన వడ్డే వెంకటరమణ
పుట్టపర్తి అర్బన్(అనంతపురం జిల్లా): మండలంలోని వెంగళమ్మ చెరువు గ్రామంలో టీడీపీ నాయకులు చెలరేగిపోయారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. రూరల్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపిన మేరకు స్కూల్ కమిటీ చైర్మన్ వడ్డే వెంకటరమణ ఇంటి సమీపంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి తన కారును ఆపి ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. రాత్రి పొద్దుపోయాక ఆదినారాయణరెడ్డి తన వర్గీయులతో కలిసి వెంకటరమణ ఇంటిపై దాడికి తెగబడ్డాడు. వాకిలి తీయక పోవడంతో రాళ్లు రువ్వారు. ఇంటి ఎదుట నిలిపిన ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. (వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య)
తలుపులు తోసుకుని లోపలకు ప్రవేశించి, వెంకటరమణపై రాళ్లు, ఇనుప రాడ్‌లతో తీవ్రంగా గాయపరిచారు. ప్రాణభయంతో వెంకటరమణ ఇంటి నుంచి బయటపడి చీకట్లో తప్పించుకున్నాడు. అదే సమయంలో వెంకటరమణ భార్య వనజను జుట్టుపట్టుకుని బజారులోకి ఈడ్చుకొచిచ కాళ్లతో తన్నారు. అడ్డుకోబోయిన తండ్రి వీరన్నపై చేయిచేసుకున్నారు. మిమ్మల్ని చంపితే ఎవరు దిక్కొస్తారంటూ కేకలు వేస్తూ భయాందోళనలు సృష్టించారు. విషయాన్ని చుట్టుపక్కల వారు తమకు సమాచారం అందించడంతో పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ దాదాపీర్, సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు సీఐ వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పాపన్న, వీరాస్వామి, రమేశ్, కేశప్ప మరో 16 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.