పెత్తనం కోసం టీడీపీ నేతలు డిష్యూం డిష్యూం
అధికారంలోకి వస్తున్న టీడీపీలో అధికార కేంద్రీకరణ దిశగా వర్గ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా జిల్లాలో ఆ పార్టీ ఓడిపోయిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై పట్టు కోసం ఇరువర్గాలు పావులు కదుపుతున్నాయి. టీడీపీ ఓడిపోయిన మూడు నియోజకవర్గాలు పాలకొండ డివిజన్‌లోనే ఉండటం గమనార్హం. దాంతో ఆ డివిజన్‌కే చెందిన సీనియర్ నేత కళా వెంక ట్రావు సహజంగానే ఆ స్థానాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావిస్తున్నారు.
పాలకొండ నియోజకవర్గం విషయంలో ప్రస్తుతానికి హడావుడి లేనప్పటికీ రాజాం, పాతపట్నం నియోజకవర్గాలపై ఆధిపత్యం కోసం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజాంలో ఓటమిపాలైన సీనియర్ నేత ప్రతిభా భారతి నైరాశ్యంలో కూరుకుపోవడం కళాకు కలసివస్తోంది. మరోవైపు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పాతపట్నం స్థానంపై పట్టు సాధించాలని కింజరాపు వర్గం భావిస్తోంది. అలాగే పాలకొండ డివిజన్‌లో కళాకు పోటీగా మరో అధికార కేంద్రాన్ని తయారు చేయడానికి వ్యూహాన్ని రచిస్తోంది.
తనదే పెత్తనం అంటున్న కళా
రాజాం నియోజకవర్గ టీడీపీ రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. పార్టీ అభ్యర్థి ప్రతిభా భారతి ఓటమిపాలవడంతో పార్టీకి పెద్దదిక్కు ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. ఓడిపోయిన అభ్యర్థే ఇన్‌చార్జ్‌గా ఉండటం సంప్రదాయంగా వస్తోంది. కానీ తనకు ఎన్నికల్లో స్థానిక నేతలు సహకరించలేదని ప్రతిభా భారతి కినుక వహించారు. ఏ పదవీ లేకుండా ఐదేళ్లపాటు నియోజకవర్గ బాధ్యతలు మోయలేనని ఆమె పరోక్షంగా సంకేతాలు పంపించినట్లు తెలుస్తోంది.
మరోవైపు మహానాడులో చంద్రబాబునాయుడు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని లేవనెత్తడాన్ని ఆమె తన ఆంతరంగికుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. 2019 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియనప్పుడు ఈ ఐదేళ్లు పార్టీ బాధ్యతలు తానెలా మోస్తానని వ్యాఖ్యానించడం ద్వారా పరోక్షంగా నియోజకవర్గంలోని నేతలే పార్టీ వ్యవహారాలు చూసుకోవాలని తేల్చిచెప్పేశారు. సహజంగానే ఈ పరిణామాలను కళా వెంకట్రావు తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు.
కళా సొంత నియోజకవర్గమైనందున రాజాంలో ఆయన కుటుంబ సభ్యులు ఆధిపత్యం చెలాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ దిశగా ఇప్పటికే వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీనిపై నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నేతలకు సంకేతాలు అందుతున్నాయి కూడా. నైరాశ్యంలో ఉన్న ప్రతిభా భారతి వీటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. దాంతో కళా వర్గీయుల ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. కళా వర్గం ఆధిపత్యం కిందకు రాజాం నియోజకవర్గం చేరినట్లేనని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
పాతపట్నంపై కొత్త పితలాటకం
టీడీపీ ఓటమి పాలైన పాతపట్నం నియోజకవర్గం సరికొత్త వర్గపోరుకు వేదికగా నిలుస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలైన శత్రుచర్ల విజయరామరాజు మళ్లీ నియోజకవర్గానికి వచ్చే పరిస్థితులు దాదాపుగా లేవనే చెప్పొచ్చు. వయోభారం, ఇతరత్రా కారణాలతో ఆయన నియోజకవర్గంపై ద ృష్టి సారించే అవకాశాలు లేవు. దాంతో పార్టీ ఇన్‌చార్జి ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది.
పాలకొండ డివిజన్‌లో కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంపై కూడా పట్టు సాధించాలని కళా భావిస్తున్నారు. అందుకు వీలుగా తన సన్నిహితుల్లో ఒకర్ని ఇన్‌చార్జిగా నియమించాలన్నది ఆయన వ్యూహం. కానీ ఇందుకు కింజరాపు అచ్చెన్నాయుడు ససేమిరా అంటున్నారు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పాతపట్నంపై తమకే ఆధిపత్యం ఉండాలన్నది కింజరాపు కుటుంబ ఉద్దేశం. అందుకోసం తమ సన్నిహిత నేతను ఇన్‌చార్జిగా నియమించాలని పట్టుపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా టీడీపీలో కళా, కింజరాపు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారింది.