ఫిరంగిపురం కూడలిలో ధర్నా చేసిన అనంతరం పోలీసులకు వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు
సాక్షి, గుంటూరు(తుళ్లూరు) : రాజధాని ప్రాంతం గత రెండు రోజులుగా వరుస ధర్నాలతో అట్టడుకిపోతోంది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీకి చెందిన అగ్రవర్ణ నేతలు దుర్భాషలాడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోమవారం తుళ్లూరు మండలంలోని అనంతవరంలో వినాయకుని విగ్రహం వద్ద పూజ చేస్తుండగా టీడీపీ నేతలు దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైలు పడతాడంటూ దూషించాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వెలగపూడి జంక్షన్‌లో, మంగళవారం సాయంత్రం తుళ్లూరు జంక్షన్‌లో రాజధాని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శృంగారపాటి సందీప్ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఒక దళిత మహిళను అవమానించడం దారుణమన్నారు. సీఎం జగన్ దళిత మహిళకు హోం శాఖ అప్పగించి దళితుల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తుళ్లూరు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు బత్తుల కిషోర్, యువజన విభాగం అధ్యక్షుడు బెజ్జం రాంబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలపర్తి రామారావు, కొయ్యగూర వినోద్, ఆరేపల్లి జోజి, మేడికొండూరు మండల అధ్యక్షుడు కందుల సిద్ధయ్య, తుమ్మూరు రమాణారెడ్డి, పుల్లా ప్రభాకరరావు, ధర్మారావు, తమనంపల్లి శాంతయ్య, దాసరి రాజు, మరియదాసు, ఎడ్లూరి వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ కిషోర్, సుంకర శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పేరేచర్ల, ఫిరంగిపురం కూడళ్లలో మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి. టీడీపీ నాయకులకు ఇంకా అధికార అహంకారం దిగలేదన్నారు. వినాయకుడికి పూజలు చేస్తే దేవుడు మైల పడతాడని చెప్పడం వారి వారి నీచ ప్రవర్తనకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. పేరేచర్ల కూడలిలో కందుల సిద్ధయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రాస్తారాకో చేసిన అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. ఫిరంగిపురం కూడలిలో నాయకులు గుంటూరు కర్నూలు ప్రధాన రహదారిని దిగ్భందించి, నిరసన తెలిపి పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు.
ఎమ్మెల్యే శ్రీదేవిని అవమానించడం దారుణం
గుంటూరు: వినాయక చవితి వేడుకల్లో దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని అవమానపరచడమే కాకుండా కులం పేరుతో దూషించిన వారిని వెంటనే ఆరెస్టు చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న మాదిగ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని రూరల్ ఎస్పీ ఆర్ జయలక్ష్మిని మంగళవారం కలసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యేకు అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని ఎమ్మెల్యేకు ఇలా జరగడం చూస్తే ఆమెను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని విమర్శించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నామని వివరించారు.
దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
గుంటూరు(నెహ్రూనగర్): ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాదిగ మహాసేన రాష్ట్ర అధ్యక్షుడు కొరిటెపాటి ప్రేమ్‌కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో అభి, ప్రభాకర్, కూచిపూడి గోపి, సుబ్బారావు, కవిత తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు
గుంటూరు(పట్నంబజారు): తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని దుర్భాషలాడటం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అత్తోట జోసఫ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏటుకూరి విజయసారథి, ఎస్సీ విభాగం నేతలు పచ్చల ఆనంద్, కే రమేష్ మండిపడ్డారు. పట్టాభిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ కుల అహంకారానికి పెట్టింది పేరన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. దళితులు.. మీకెందుకు రా రాజకీయాలని చింతమనేని చేసిన వ్యాఖ్యలు, మురికివాడల్లో పుట్టిన వారికి మురికి ఆలోచనలే వస్తాయని జేసీ వంటి టీడీపీ నేతలు మాట్లాడారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment