
సీఎం కేసీఆర్ పై టీడీపీ నేతల ఫిర్యాదు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారును అస్థిర పరచడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగానే సోమవారం టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు , వర్ల రామయ్యలు గవర్నరు పేట, భవానీపురం పీఎస్ లలో కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో కలిసి కేసీఆర్ కుట్ర పన్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు ఏపీ సీఎం చేసిన కుట్ర తేటతెల్లమైన సంగతి తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబే అన్నది స్పష్టంగా తేలిపోయింది. ‘బాస్’ పంపితే వచ్చానన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాటల్లోని ‘బాస్’ చంద్రబాబే అని మీడియాకు అందిన ఆడియో రికార్డుల్లో స్పష్టంగా వెల్లడైంది. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని స్వయంగా భరోసా ఇచ్చారు. అన్ని విషయాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సంభాషణ రికార్డులు మీడియాకు విడుదల కావడంతో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అయితే దీనిపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఆ సంభాషణలు చంద్రబాబువి కావని ఇప్పటికే ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేయగా.. ఇది ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కేసీఆర్ పన్నిన కుట్ర మాత్రమేనని మరికొందరు టీడీపీ నేతలు మండిపడుతున్నారు.