నారాయణ పరిటాల సునీత
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో అసమ్మతి ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఒంగోలు, బాపట్ల పార్లమెంటు ఇన్‌చార్జిలుగా ఉన్న పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత టీడీపీలో వర్గ విబేధాలను సర్దుబాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అసమ్మతి నేతలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ఇన్‌చార్జి మంత్రుల మాటలు అసమ్మతి నేతలు ఖాతరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వర్గ రాజకీయాల గోడు పడలేక ఇద్దరు మంత్రులు చేతులెత్తేశారు.
ఎవరికి వారే యమునా తీరే
ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కొండపి, మార్కాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు వైఎస్సార్ సీపీ తరఫున గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అజితారావుతోపాటు దొనకొండ జెడ్పీటీసీ సభ్యుడు మన్నే రవీంద్రలు నియోజకవర్గంలో వర్గ రాజకీయాలను కొనసాగించారు. దీంతో యర్రగొండపాలెంలో అధికార పార్టీ మూడు వర్గాలుగా విడిపోయింది. నేతలు ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా మారారు. పార్టీ ఫిరాయించడంతో డేవిడ్ రాజు ప్రజావ్యతిరేకత మూట కట్టుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే సాహసం చేసే పరిస్థితి కనిపించడం లేదు. మూడు గ్రూపులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇన్‌చార్జి మంత్రి పొంగూరు నారాయణ పలుమార్లు సమావేశాలు పెట్టినా అసమ్మతి కొలిక్కి రాలేదు. కొండపిలో వర్గ విబేధాలు రోడ్డున పడ్డాయి. ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన సొదరుడు దామచర్ల సత్య కుటుంబం ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు.
దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. రాబోయే ఎన్నికల్లో స్వామిని తప్పించి కొత్త అభ్యర్థిని టీడీపీ అభ్యర్థిగా నిలపాలంటూ అసమ్మతి నేతలు బహిరంగ విమర్శలకు దిగారు. పలుమార్లు ఇన్‌చార్జి మంత్రి సమావేశాలు పెట్టి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా ఇక్కడ అసమ్మతి సమసి పోలేదు. మార్కాపురం నియోజకవర్గంలో ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు గొడవకు దిగారు. నారాయణరెడ్డిని తప్పించి రాబోయే ఎన్నికల్లో కొత్తవారికి టిక్కెట్ ఇవ్వాలని ఇమ్మడి కాశీనా«థ్‌తో పాటుమరి కొందరు నేతలు పలుమార్లు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది. ఇన్‌చార్జి మంత్రి నారాయణ నేతృత్వంలో అసమ్మతి నేతలతో సమావేశాలు నిర్వహించినా గొడవలు సద్దుమణగలేదు. ఒంగోలులోనూ పలువురు రెండో శ్రేణి నేతలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు వ్యతిరేకంగా మారారు. కొందరు ఆయనకు దూరమయ్యారు. వచ్చే ఎన్నికల్లో దామచర్లకు మద్దతు పలికేది లేదంటూ మరి కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు పుట్టిస్తున్నారు. ఇక్కడ అసమ్మతిని కట్టడి చేయాలని ఇన్‌చార్జి మంత్రి ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దర్శి, గిద్దలూరుల్లోనూ అసంతృప్తులు ఉన్నాయి. కొందరు బహిరంగ విమర్శలకు దిగుతుండగా మరి కొందరు అంతర్గంతగా సిట్టింగ్‌లను వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార టీడీపీలో వర్గ విభేధాలు రోజు రోజుకుపెరుగుతున్నాయి. నారాయణను రెండు సంవత్సరాలుగా ఒంగోలు పార్లమెంటుకు ఇన్‌చార్జిగా నియమించినా అసమ్మతి పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇన్‌చార్జి మంత్రి చేతులెత్తేయడంతో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జిల్లాలో రెండు రోజులు మకాం వేసి యర్రగొండపాలెం, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించి నేతలకు వార్నింగ్‌లు ఇచ్చినా ఎవరూ ఖాతరు పెట్టలేదు. అసమ్మతి సమసి పోలేదు.
పనిచేయని పరిటాల తంత్రం
ఇక బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని నాలుగు నియోజకవర్గాల్లో అసమ్మతి మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. అద్దంకి, చీరాల, పర్చూరు, సంతనూతలపాడులలో వర్గ విభేదాలు రోడ్డున పడ్డాయి. వీటిని సద్దుమణిచేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీతను ఇన్‌చార్జిగా నియమించారు. సంతనూతలపాడులో మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. రాబోయేఎన్నికల్లో విజయ్‌కుమార్‌ను తప్పించి కొత్తవారిని అభ్యర్థిగా నిలపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేష్‌లకు సైతం పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఎమ్మెల్సీ కరణం బలరాం, టీడీపీ జిల్లా అ«ధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రెండు వర్గాల పక్షం నిలిచి ఆధిపత్య పోరు సాగిస్తుండటంతో ఇక్కడ వర్గ విభేదాలు తగ్గడం సంగతి అటుంటి మరింత పెరిగాయి. మంత్రి పరిటాల సునీత పలుమార్లు అసమ్మతి నేతలతో సమావేశం నిర్వహించినా వారు ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇక చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి.
పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇచ్చిన తరువాత కొంత మేర తగ్గినట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం కొనసాగుతున్నాయి. మంత్రి పరిటాల సునీత సర్దుబాటు ప్రయత్నాలు ఫలించలేదు. చీరాలలో అసమ్మతి ఆది నుంచి ఉన్నా తొలుత అంతగా బయటపడలేదు. ఇటీవల కాలంలో నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతలు, ముఖ్యనేతలు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బహిరంగ సమావేశాలు పెట్టి మరీ ఆయన అవినీతి, అక్రమాలను బయట పెడుతున్నారు. ఏలూరిని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ అసంతృప్తులను చల్లార్చడం మంత్రి సునీతకు చేతకావడం లేదు. ఇక కీలకమైన అద్దంకి వర్గ విభేదాలు సద్దుమణచడం మంత్రి సునీతకే కాదు ఏకంగా ముఖ్యమంత్రితోనూ సాధ్యం కావడం లేదు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరడాన్ని ఎమ్మెల్సీ కరణం బలరాం ఆదిలోనే వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇద్దరినీ రాజీ చేయడంలో విఫలమయ్యారు. పేరుకు ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నా వారు కలిసి పనిచేయడం జరిగే పనికాదు. తొలుత ఒకటి రెండు సమావేశాల్లో ఇరు వర్గాల్లో సై అంటే సై అంటూ గొడవలకు సైతం దిగాయి. ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి సునీత సమక్షంలోనే ఘర్షణలు తలెత్తాయి. వారిని సర్దుబాటు చేయడం సాధ్యం కాక మంత్రి సునీత చేతులెత్తేసింది.
Comments
Please login to add a commentAdd a comment