
ఆస్పత్రి భవనం వద్ద కొబ్బరికాయ కొడుతున్న మాజీ ఎమ్మెల్సీ బొడ్డు
తూర్పుగోదావరి , పెదపూడి (అనపర్తి): మండంలోని పెద్దాడ గ్రామంలో నిర్మించిన పీహెచ్‌సీ భవనం ప్రారం భం విషయంలో టీడీపీలో వర్గపోరు రోడ్డెక్కింది. ఆ గ్రామంలోని వారెవ్వరికీ చెప్పకుండా ఈ భవనం శుక్రవారం ప్రారంభించేందుకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. తమకు చెప్పకుండా భవనాన్ని ప్రారంభించడమేమిటని.. ఆ గ్రామ పెద్దలు, పలు వర్గాలు, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ఆగ్రహించారు. వారందరూ దగ్గరుండి మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావుతో ఒకరోజు ముందుగా కొబ్బరికాయ కొట్టించుకుని భవనాన్ని ప్రారంభింపజేసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు గ్రామానికి చేరుకుని పికెట్ ఏర్పాటు చేశారు.
రేపు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే ఏర్పాట్లు
ఈ గ్రామంలో ఎన్‌ఎచ్‌ఎం నిధులతో నిర్మించిన పీహెచ్‌సీ కేంద్రాన్ని శుక్రవారం అధికారికంగా ప్రారంభించడానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏర్పాట్లు చేశారు. ఆ గ్రామంలోనే ఉండే మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావుకు, గ్రామ రైతు కమిటీ, పెద్దలకు తెలియజేయలేదంటూ వారు అంటున్నారు. గ్రామంలో ఎమ్మెల్యే ఏకపక్షంగా కార్యక్రమాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. చివరికి గ్రామపెద్దలు, రైతు కమిటీ, అన్ని వర్గాలు, మతాల వారు పండితులతో మాట్లాడి మధ్యాహ్నం 3.40 గంటలకు ముహూర్తం పెట్టుకున్నారు. వారు బొడ్డు వద్దకు వెళ్లి, గ్రామ సంప్రదాయం ప్రకారం కొబ్బరికాయ కొట్టి ఆస్పత్రి ప్రారంభించాలని కోరారు. దీంతో ఆయన కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ఆస్పత్రిని ప్రారంభించారు.
పోలీసులు వచ్చేసరికి..
కాకినాడ రూరల్ సీఐ ఈశ్వరుడు, ఇంద్రపాలెం, కరప ఎస్సైలు, పెదపూడి ఏఎస్సై సిబ్బంది హడావుడిగా అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆస్పత్రిని ప్రారంభించిన బొడ్డు బయటకు వచ్చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే ఇదే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందున గ్రామంలో పికెట్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
శంకస్థాపనలోనూ ఇంతే..
ఈ ఆస్పత్రిని 2016 నవంబర్ 3న అప్పటి ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే నల్లమిల్లి, బొడ్డు మధ్య, వారి వర్గీయులు మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం విదితమే. ఇప్పుడు ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమం విషయంలో కూడా ఈ పరిస్థితి పునరావృతం కావడంతో గ్రామంలో టీడీపీలో వర్గ పోరు ఎక్కడికి దారి తీస్తుందో అన్న విషయం గ్రామంలో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment