రోడ్డు మీద రోడ్డు వేసి
► వరదలకు దెబ్బతిన్నాయని అంచనాలు
తయారుచేయించిన టీడీపీ నాయకులు
► తూతూమంత్రంగా పనులు
► నిధులు స్వాహా చేస్తున్నా పట్టించుకోని అధికారులు
అధికారాన్ని అడ్డం పెట్టుకుని మండలంలో టీడీపీ నాయకులు పాల్పడుతున్న అవినీతి అంతులేకుండాపోయింది. వరదలకు పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని అంచనాలు తయారుచేయించి తూతూమంత్రంగా పనులు చేసి నిధులు బొక్కేస్తున్నారు. అధికారులు వారికి అండగా ఉన్నారు.
పెళ్లకూరు(సూళ్లూరుపేట) : 2015 సంవత్సరం నవంబరులో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పెళ్లకూరు, చవటకండ్రిగ, ఎగువతాగేలి రోడ్లు పలుచోట్ల వరద ఉధృతికి కోతకు గురయ్యాయి. ఇదే అదునుగా భావించిన కొందరు టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి మండలంలోని 22 ప్రాంతాల్లో 43.95 కిలోమీటర్ల పంచాయతీరాజ్ శాఖ రోడ్లు దెబ్బతిన్నట్లు అంచనాలు తయారుచేయించారు. అయితే మండలంలో 56 కిలోమీటర్లు పీఆర్ రోడ్లు ఉండగా వాటిలో 12 కిలోమీటర్లు బీటీరోడ్డు, మిగిలిన 44 కిలోమీటర్లు గ్రావెల్‌రోడ్లున్నాయి. మొత్తం 44 కిలోమీటర్ల గ్రావెల్‌రోడ్లలో 43.95 కిలోమీటర్లు వరదలకు దెబ్బతిన్నాయని అంచనాలు రూపొందించారు. కొందరు అధికారులు, నాయకులు కలిసి బాగున్న రోడ్లను బాగోలేనివిగా చూపించి పనులు చేసి నిధులు స్వాహా చేశారు.
దారి తప్పిన నిధులు
రోడ్ల మరమ్మతుల కోసం మంజూరైన రూ.37.60 లక్షల నిధులు దారి మళ్లుతున్నాయి. టీడీపీ నాయకులు తుఫాన్ నిధుల కోసం తూతమంత్రంగా పనులు చేసి అధికారులకు పర్సంటేజ్‌లు అందజేసి బిల్లులు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పనులు చేపట్టకుండానే నిధులు స్వాహా చేయడానికి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఎక్కడ కూడా నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా పనులు చేసి బడా నేతల అండతో ఎంబుక్‌లు చేయించుకొని తుఫాన్ నిధులను జేబుల్లో వేసుకుంటున్నారు. ఇక్కడ పనులన్నీ జన్మభూమి కమిటీ సభ్యులకే అప్పగించారు. దీనిపై పూర్తిగా పర్యవేక్షణ కరువైంది.
నాసిరకంగా ఉంటే బిల్లులు చేయడం లేదు
నిబంధనల మేరకు పనులు చేయిసున్నాం. పనులు నాసిరకంగా జరిగినట్లు గుర్తిస్తే అలాంటి వాటికి బిల్లులు చేయడం లేదు.
– కృష్ణారావు, పంచాయతీరాజ్ ఏఈ