తెలుగు తమ్ముళ్ల  అవినీతి కంపు... | TDP Leaders Corruption In Ramajogi Palem In Visakha District | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల  అవినీతి కంపు...

Published Fri, Aug 23 2019 6:35 AM | Last Updated on Fri, Aug 23 2019 6:37 AM

TDP Leaders Corruption In Ramajogi Palem In Visakha District - Sakshi

విచారణ చేస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రవికుమార్, స్వచ్ఛభారత్‌ మిషన్‌ జిల్లా అధికారులు

దోచుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగిన ‘పచ్చ’ తమ్ముళ్లు ఆఖరికి మరుగుదొడ్లను కూడా వదల్లేదు. బాబు సర్కారు హయంలో జరిగిన అవినీతిలో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోంది. తాజాగా చోడవరం మండలం చాకిపల్లి పంచాయతీలోని రామజోగిపాలెం గ్రామంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ్‌ పథకంలో భాగంగా నిర్మించిన  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో సుమారు రూ.10 లక్షల మేర అవినీతి జరిగినట్టు అధికారుల విచారణలో వెల్లడైంది.

సాక్షి, చోడవరం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు చేసిన అవినీతి బాగోతాలు ఒకొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎన్టీఆర్‌ హౌసింగ్‌ నిర్మాణంలో మోసాలు వెలుగు చూసి రెండు రోజులు కాకముందే అదే పంచాయతీలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ అవినీతి బాగోతం బయటపడింది. చోడవరం మండలం రామజోగిపాలెంలో తాజాగా స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ్‌ పథకంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో సుమారు రూ.10 లక్షల మేర అవినీతి జరిగి నట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మించినట్టు, అసంపూర్తిగా నిర్మాణాలు చేసి పూర్తిగా బిల్లులు చేసుకున్నట్టు తెలుస్తోంది.  ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రూ.లక్షలు దోచుకున్నట్టు అరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  చాకిపల్లి పంచాయతీకి గత టీడీపీ హయాంలో 268 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రూ.38 లక్షల 40వేలు నగుదును లబ్ధిదారులకు పేమెంట్స్‌ ఇచ్చేశారు. ఈ పంచాయతీ శివారు గ్రామమైన రామజోగిపాలేనికి వీటిలో 145 మరుగుదొడ్లు మంజూరయ్యాయి.

వీటిలో రూ.18 లక్షల రూ.80 వేలు  చెల్లించారు. రామజోగిపాలెంకు మంజూరైన వాటిలో సుమారు 100 మరుగుదొడ్లలో భారీగా అవినీతి జరిగినట్టు తెలు స్తోంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు అప్పటి అధికారులు సహకరించడంతో వీటి నిర్మాణంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో మొత్తం సుమారు 190 ఇళ్లు ఉండగా వీటిలో సగానికిపైగా తమ సొంత నిధులతో ఇళ్లు, మరుగుదొడ్లు కట్టుకున్నారు. మరికొన్ని ఇందిరమ్మ, ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పథకంలో ఇళ్లతో పాటు మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. ఇవి కాకుండా స్వచ్ఛభారత్‌ మిషన్‌ పథకంలో ఏకంగా మరో 145 మరుగుదొడ్ల మంజూరు చేసి అందులో భారీగా అవినీతికి పాల్పడ్డారు.   దీనిపై గతంలోనే స్థాని కులు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకే చెందిన వారు కావడంతో స్థానిక టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వివిధ పథకాల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అప్పట్లో ఎటువంటి విచారణ జరగలేదు.

కదిలిన అవినీతి డొంక..
ఇటీవల గ్రామానికి చెందిన కొందరు ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆర్‌డబ్ల్యూఎస్, స్వచ్ఛభారత్‌ మిషన్‌ అధికారులు విచారణకు రావడంతో అవినీతి డొంక కదిలింది. మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణంలో ఒకొక్క విషయం బయటపడుతుంటే అధికారులు సైతం అవాక్కవుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ సూపరింటెండెంట్‌ వి. రవికుమార్, చోడవరం డీఈఈ జి.శివకృష్ణ, జేఈ కనకమ్మ, స్వచ్ఛభారత్‌ మిషన్‌ జిల్లా కో–ఆర్డినేటర్, శ్రీనివాస్, మండల కో–ఆర్డినేటర్‌ ప్రకాష్‌ , గ్రామ వలంటీర్లు కలిసి ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. లబ్ధిదారుల జాబి తాతో ప్రత్యక్ష విచారణకు వచ్చిన అధికారులకు ఇక్కడ వెలుగు చూస్తున్న విషయాలు ఆశ్చర్యపరిచాయి.  నందికోళ్ల ప్రసాద్‌ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతోపాటు బంధువుల పేరున ఎనిమిది మరుగుదొడ్లు మంజూరు చేయించుకుని ఒక్కటి కూడా కట్టకుండానే బిల్లులు తీసుకున్నట్టు తేలింది.

కిల్లి రమణ, వెన్నెల పైడమ్మ, నందికోళ్ల మన్మథరావు, పోతల నాగరాజుతోపాటు అనేక మంది లబ్ధిదారుల పేరున ఉన్న మరుగుదొడ్ల నిర్మాణానికి గోతులు తవ్వకుండా, పైకప్పులులేనివి , బేసిన్లు, తలుపులు లేనినివి ఇలా అసంపూర్తిగా నిరుపయోగంగా ఉన్నాయి. అయినప్పటికీ వీటికి పూర్తిగా బిల్లులు ఇచ్చేసినట్టు తేలింది. సగానికి పైగా నిర్మాణాలు చేయకుం డానే బిల్లులు చేసినట్టు తెలుస్తోంది. ఒకొక్క మరుగుదొడ్డికి రూ.12నుంచి 15వేలు వరకు బిల్లులు చేశారు. సుమారు 100కు పైగా మరుగుదొడ్లలో రూ.10 లక్షలకు మించే అవినీతి జరిగినట్టు అంచనా వేస్తున్నారు. అయితే విచారణకు జిల్లా స్థాయి అధికారులు వచ్చినప్పటికీ గ్రామ కార్యదర్శి మాత్రం వీరితో పరిశీలనకు రాలేదు. అప్పటి ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల సహకారంతోనే టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని గ్రామస్తులు పోతల అప్పరావు, పోతల ప్రసాద్‌ , రమణబాబు ఆరోపించారు. ఇదిలావుండగా గ్రామ కార్యదర్శి విచారణ సమయంలో రాకపోవడంతో విచారణ ప్రాథమికంగా జరిగిందని, ఆయన వచ్చాక పూర్తిస్థాయి విచారణ పూర్తవుతుందని ఆర్‌డబ్ల్యూఎస్‌  డీఈఈ శివకుమార్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement