అందినంత దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు అధికార పార్టీ నేతలు. వీరు ఏ అవకాశాన్ని వదలడం లేదు.
ఇళ్లు, స్థలాలు మంజూరు చేస్తామంటూ టీడీపీ నేతల వసూళ్ల దందా
నేతల జేబుల్లోకి రూ. 60 కోట్లు సర్కార్‌కు ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక
ఇళ్ల కోసం 63,470 మంది దరఖాస్తు
విశాఖపట్నం: అందినంత దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు అధికార పార్టీ నేతలు. వీరు ఏ అవకాశాన్ని వదలడం లేదు. పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా పెట్టుకుని ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకుని నిలువు దోపిడీ సాగిస్తున్నారు. ఇప్పటికే రూ.60 కోట్ల వరకూ జేబుల్లోకి వెళ్లినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు సర్కార్‌కు నివేదిక ఇచ్చినట్టు సమాచారం.
హౌసింగ్ ఫర్ ఆల్‌తో కాసుల పంట
హౌసింగ్ ఫర్ ఆల్ పథకం అధికార పార్టీ నేతలకు కాసుల పంట కురిపిస్తోంది. జీవీఎంసీ పరిధిలో మంజూరు చేసిన 20,030 ఇళ్లలో సగానికిపైగా ఇళ్లను గ్రూప్ హౌసింగ్‌గా, మిగిలినవి సొంతస్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఆసక్తిచూపే అర్హులకు మంజూరుచేయనున్నారు. ఈ నెల 12 నుంచి ప్రారంభించిన దరఖాస్తుల స్వీకరణను 31 వరకు పొడిగించారు. ఇప్పటి వరకు 75,000 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 59,485 మంది ఆధార్, రేషన్ కార్డులు సమర్పించగా, మిగిలిన వారు ఆధార్ కార్డులు మాత్రమే సమర్పించారు. అత్యధికంగా ఐదో డివిజన్ పరిధిలో 2,978 మంది దరఖాస్తు చేయగా, అత్యల్పంగా 54వ డివిజన్ పరిధిలో కేవలం 14మంది మాత్రమే దరఖాస్తు చేశారు. అనకాపల్లి పట్టణంలో 1950 మంది, భీమిలి పట్టణంలో 1635 మంది దరఖాస్తు చేశారు. వీటిలో 20 శాతం వరకు ఇళ్ల స్థలాలుండి గృహ రుణం కోసం అందినవి కాగా, మిగిలినవి వ్యక్తిగత, గ్రూప్ హౌసింగ్ దరఖాస్తులు ఉన్నాయి.
చురుగ్గా వడపోత...
2004 నుంచి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్ల స్థలం, ఇంటిరుణం మంజూరైన వారి జాబితాలతో పాటు జీవీఎంసీ, ఇతర మున్సిపాల్టీల పరిధిలో గ్రూప్‌హౌసింగ్ లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే యూసీడీకి అందజేశారు. నగర పరిధిలోని రెవెన్యూ, కొండవాలు ప్రాంతాలతో పాటు సింహాచలం దేవస్థానం, గాజువాకలో ప్రభుత్వ, ఇనాం భూముల్లో ఆక్రమణదారుల జాబితాలను కూడా యూసీడీకి అందజేశారు. ఈ జాబితాలకు వచ్చిన ప్రతీ దరఖాస్తుదారుల ఆధార్, రేషన్ కార్డు నంబర్లతో సరిపోల్చుతున్నారు. మరొక పక్క జీవీఎంసీ, వుడా, హౌసింగ్ శాఖల్లో ఉన్న హౌసింగ్ లబ్ధిదారులతో పాటు ఏపీఈపీడీసీఎల్‌ల్లో ఇళ్ల కనెక్షన్లతో బేరీజు వేస్తున్నారు.
పూర్తిస్థాయిలో పరిశీలన
గతంలో ఎప్పుడైనా సరే కుటుంబంలో ఎవరిపేరిటైనా సరే ఇంటి స్థలం, ఇంటిరుణం, గ్రూప్ హౌసింగ్ పొంది ఉంటే అటువంటి వారు హౌసింగ్ ఫర్ ఆల్‌కు అనర్హులే. ఈ లెక్కన దరఖాస్తు చేసున్న వారిలో సగానికి పైగా అనర్హుల జాబితాలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని అధికార టీడీపీ నేతలు వసూళ్లు సాగిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు రూ.100 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. మరొక పక్క డబుల్ బెడ్‌రూమ్ హౌస్,గ్రూప్‌హౌస్..ఇళ్ల రుణం మంజూరు చేయిస్తామంటూ కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు..నేతలు తమ అనుచరుల ద్వారా రూ.10వేల నుంచి పాతిక వేల చొప్పున 30 శాతం మంది దరఖాస్తుదారుల నుంచి వసూలు చేసినట్టు తెలుస్తోంది.
వసూళ్లపై నివేదిక?
ఇప్పటికే వసూళ్ల దందా రూ.60 కోట్లు దాటి నట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు లెక్కతేల్చినట్టు సమాచారం. ఈ మేరకు సర్కార్‌కు నివేదిక కూడా ఇచ్చినట్టు ఓ అధికారి సాక్షికి వివరించారు. ఇటీవలే అంగన్ వాడీ పోస్టుల అమ్మకాల విషయంలో కూడా ఇదే రీతిలో ఇంటిలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఎంపిక కమిటీలో ఎమ్మెల్యేలను పక్కనపెట్టడం తెలిసిందే. మరో 10 రోజులు గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య లక్షన్నర దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. వడపోత నంతరం జనవరి మొదటి వారంలో అర్హుల జాబితాలను ప్రకటించనున్నారు.