ఫోన్ ట్యాప్ అవుతున్నా మీకు తెలియలేదా?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశానికి డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్ చీఫ్ అనూరాధ తదితరులు కూడా హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ఓటుకు నోటు వ్యవహారం మీదే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ అవుతున్నా కూడా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు దాన్ని గుర్తించడంలో విఫలం అయ్యారంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటెలిజెన్స్ విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని,అందులో తన అనుంగు అనుయాయులను నియమించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అలాగే.. తన ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని, ఇది చట్టరీత్యా చెల్లదని కేబినెట్లో తీర్మానం చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మంగళవారం సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ఆయన బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్లతో భేటీ అయ్యే అవకాశం ఉంది. గవర్నర్ నరసింహన్ బుధవారం బయల్దేరి ఢిల్లీ వెళ్తుండటంతో, ముందే వెళ్లాలని.. గవర్నర్ అధికారాలపై కేంద్రంతో చర్చించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.