అంతా తానై... అయిన వారికి దూరమై..
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు. కానీ రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తన నియోజకవర్గంలోని పార్టీ నాయకులతోనే ఆమెకు పొసగడం లేదు. ఇక జిల్లా నేతలతో ఎలా నెట్టుకొస్తారో తెలియడం లేదు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆమె తీరుపై నిరసనలు ప్రారంభమయ్యాయి. పార్టీ నేతలనే పట్టించుకో నప్పుడు మిగతా వారికేం చేస్తారని టీడీపీ నేతలు ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెప్పాలంటే ఇంటి పోరుతో మంత్రి సతమత మవుతున్నారు. నియోజకవర్గ నేతలు దాదాపు ఆమెకు దూరమవుతున్నారు. పట్టించుకోని నేత చుట్టూ తిరగడం అనవసరమని అభిప్రాయానికొచ్చేశారు. ఇప్పటికే కొంతమంది నేతలు కలవడం మానేశారు. తమకు విలువ లేకుండా చేశారని ఇంకొంతమంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి కిమిడి మృణాళినికి, అక్కడి టీడీపీ నేతలకు ఏమాత్రం పొసగడం లేదు.
వారి మధ్య స మన్వయం లోపించింది. ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచీ ఇదే పరిస్థితి నెలకొన్నా.. ఇప్పుడు అది ముదిరి పాకాన పడింది. అంతా తానై మంత్రి వ్యవహరిస్తుండడంతో తమనెవరూ పట్టించుకోవడం లేదని స్థానిక నాయకులు వాపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని కనీసం గౌరవించ డం లేదని, అసలు ఆమెను కలిసే అవకాశం లభించ డం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల ముందు వరకు నియోజకవర్గ పెద్ద దిక్కుగా ఉన్న త్రిమూర్తులరాజును పూర్తిగా విస్మరించారని, ఓ మాజీ ఎమ్మెల్యే సూచనల మేరకు నడుచుకుంటున్నారని, తరుచూ పార్టీలు మారిన నేతను నమ్ముతున్నారే తప్ప పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారిని పట్టించుకోవడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే అడుగు ముందుకేసి యూజ్ అండ్ త్రో పాలసీని అమలు చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు.
నియోజకవర్గంలో పర్యటించినప్పుడు స్థానిక ఎంపీపీకి గానీ, జెడ్పీటీసీకి గానీ సమాచారం ఇవ్వరని, వారిని కలుపుకొని పర్యటించరని, తమ సమస్యలను, అభివృద్ధి పనుల విషయమై చెప్పుకోవడానికి ఎంపీపీ, జెడ్పీటీసీ స్థాయి నేతలకు అవకాశమివ్వ డం లేదని మంత్రిపై విమర్శలొస్తున్నాయి. కింది స్థాయి నాయకులకు తాము పనులు ఎలా చేయగలమని, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలతో ఎవరితో చర్చించగలమని మండల స్థాయి ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. అంగన్‌వాడీలు, పాఠశాలలు, వసతి గృహా ల్లో తనే నేరుగా వెళ్లి తనిఖీలు చేస్తున్నారని, తమకెటువంటి సమాచారం ఇవ్వనివ్వడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పరిస్థితులు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమతో ఒక్కసారైనా సంప్రదిస్తే వాస్తవ పరిస్థితులు చెప్పడానికి అవకాశం ఉంటుందని, అదేమీ లేకపోవడంతో ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన చెందుతున్నారు.
అధికారులతో సమీక్షలు నిర్వహించినప్పుడు తమను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారని,కొన్ని సమావేశాలకైతే హాజరు కాని వ్వడం లేదని, సీక్రెట్ అని చెప్పి దగ్గరకు కూడా రాని వ్వడం లేదని ఆ పార్టీ మండల స్థాయి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో సమస్యలు చెప్పుకోవడానికి వేదికే లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చీపురుపల్లి, గరివి డి, మెరకముడిదాం, గుర్ల మండలాల నాయకులు దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇక విసిగి వేశారి పోయిన గుర్ల నేతలు ఏకంగా రచ్చకెక్కారు. ఆమె తీరును బాహాటంగానే దుయ్యబట్టారు. గౌరవం లేని చోటికి వెళ్లడం మంచిది కాదని పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఆమెకెంతసేపు కలెక్టర్‌కు ఆదేశాలి చ్చాం, ఎస్సీకి సూచనలిచ్చాం అనుకోవడమే తప్ప స్థానికులను పట్టించుకోవాలన్న ధ్యాస లేదని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. వీరి బాటలోనే మిగతా మండలాల నాయకులు ఒకటి రెండు రోజుల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని, తమ ఆవేదనకు వెళ్లగక్కే యోచనలో ఉన్నారు. మంత్రిని నమ్ముకుంటే అబాసుపాలైపోతామన్న భావనలో ఉన్నారు.