మహిళలకు ఉచిత టిక్కెట్లు పంపిణీ చేస్తున్న టీడీపీ నేత
సాక్షి, గుంటూరు: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'మహా నాయకుడు' సినిమాను ప్రమోట్ చేసేందుకు టీడీపీ నాయకులు తంటాలు పడుతున్నారు. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని సాక్షాత్తూ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో అధికార పార్టీ నాయకులకు తిప్పలు తప్పడం లేదు. అధినేత ఆదేశాలను శిరసావహించేందుకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వారిని ధియేటర్లకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జుల ద్వారా ఉచితంగా టికెట్లు పంపిణీ చేసి ప్రేక్షకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉచితంగా టిక్కెట్లు ఇచ్చినా సినిమా చూడటానికి ఆసక్తి చూపకపోవడంతో బతిమాలి జనాన్ని ధియేటర్లకు పంపుతున్నారు. అంతేకాదు జనాన్ని తరలించేందుకు వాహనాలు కూడా సమకూర్చారు.
ప్రేక్షకులకు టిక్కెట్లు పంపిణీ చేస్తూ గుంటూరు ఆరండల్‌పేటలో గురువారం కొందరు టీడీపీ నాయకులు ‘సాక్షి’ కెమెరా కంటపడ్డారు. ఎన్టీఆర్ జీవిత కథను రెండు భాగాలు తెరకెక్కించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయినట్టు వార్తలు వస్తున్నాయి. గతవారం విడుదలైన 'మహా నాయకుడు' కూడా బాక్సాఫీస్ వద్ద నిరసపడటంతో దీన్ని ప్రమోట్ చేసే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు. తన పాత్రను సానుకూలంగా చూపించి, నాదెండ్ల భాస్కరరావు క్యారెక్టర్‌ను ప్రతికూలంగా చూపించడంతో ఈ సినిమాను ప్రమోట్ చేయాలని టీడీపీ నాయకులను చంద్రబాబు స్వయంగా ఆదేశించారు.
టీడీపీ డబ్బులిస్తుంది: బచ్చుల అర్జునుడు
చంద్రబాబు ఆదేశానుసారం ఎన్టీఆర్ మహనాయకుడు సినిమాకు సంబంధించి ప్రతి నియోజకవర్గ పరిధిలోని ధియోటర్లలో 50 శాతం టికెట్లు కేటాయించే విధంగా డిస్ట్రిబ్యూటర్లతో పార్టీ అధినాయకత్వం మాట్లాడటం జరిగిందని టీడీపీ నేత బచ్చుల అర్జునుడు వెల్లడించారు. పార్టీలో అన్ని విభాగాల నాయకులకు, కార్యకర్తలకు సినిమాను చూపించాలని కోరారు. 50 శాతం టిక్కెట్లకు పార్టీ డబ్బులు చెల్లిస్తుందని టీడీపీ కార్యకర్తలకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. టిక్కెట్లు సరిగా పంచుతున్నారా, లేదా అనే దానిపై విజిలెన్స్ పర్యవేక్షణ కూడా ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment