
కార్పొరేషన్‌లో ఉంచిన వినాయక విగ్రహం
కడప కార్పొరేషన్: ఆక్రమణదారులు తమ ఆటలు సాగనప్పుడు దేవున్ని ఎలా అడ్డుపెట్టుకుంటారనేందుకు ఎర్రముక్కపల్లె వైఎస్‌ఆర్ కాలనీలో జరిగిన సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో వైఎస్‌ఆర్ కాలనీ నుంచి ప్ర«ధాన రహదారిలోకి ఉన్న మార్గాన్ని ఆ పార్టీ నేతలు ఆక్రమించి షాపు రూము నిర్మించారు. ఈ ఆక్రమణను తొలగించాలని స్థానిక ప్రజలు అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. దీనిపై అప్పట్లో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. వారి వినతులపై ఇటీవల సానుకూలంగా స్పందించిన నగరపాలక టౌన్‌ప్లానింగ్ అధికారులు పోలీసుల సాయంతో జనవరి 4న ఆ ఆక్రమణలను తొలగించి వేశారు. ఆక్రమణలు తొలగిపోవడంతో రోడ్డు నిర్మించుకోవాలని స్థానికులు ఇసుక, కంకర తెచ్చి సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఆక్రమణదారులు ఆదివారం అర్థరాత్రి ఆక్రమణలు తొలగించిన ప్రాంతంలో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు. అక్కడ గుడి నిర్మించేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఈ వ్యవహారం చూసినవారంతా ఔరా...ఇదేం విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకున్నారు.
విగ్రహం తొలగింపు
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అ«ధికారులు పోలీసుల ద్వారా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి కార్పొరేషన్ కార్యాలయంలో చెట్టు కింద ఉంచారు. రోడ్డు నిర్మాణంపై ఇకపై ఎలాంటి అక్రమాలు జరక్కుండా వెంటనే నిర్మాణం చేపట్టాలనే యోచనలో స్థానిక ప్రజలు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment