అవినీతిపై పచ్చతమ్ముళ్ల మధ్య రచ్చ..రచ్చ..
♦ టీడీపీ ఎంపీపీ వర్సెస్ టీడీపీ సర్పంచులు
♦ ఎంపీపీ పేరుతో ఉన్న బోర్డు ధ్వంసం
♦ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన
కళ్యాణదుర్గం : అవినీతి విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య రచ్చరచ్చ జరిగింది. టీడీపీ మహిళా ఎంపీపీ మంజులకొల్లప్ప టీడీపీ సర్పంచులు చిక్కన్న, అనీల్, వైస్‌ఎంపీపీ వెంకటేశుల మధ్య వర్గ పోరు మొదలైంది. కొంత కాలంగా ఎంపీపీ మంజుల భర్త కొల్లప్ప విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా తూర్పుకోడిపల్లి పంచాయతీ పరిధిలో మెగావాటర్‌షెడ్ పనుల్లో అవినీతి, డ్రైల్యాండ్ హార్టికల్చర్ పనుల్లో అక్రమాలపై ఎంపీపీ విచారణకు ఆదేశించడంతో వివాదం ముదిరింది.
తూర్పుకోడిపల్లి సర్పంచ్ చిక్కన్న అవినీతి విచారణ విషయంలో ఎంపీపీ మంజుల, ఆమె భర్త కొల్లప్పను మంగళవారం సాయంత్రం నిలదీశారు. ఇరువర్గాల మద్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఇదిలా ఉండగా బుధవారం సర్పంచ్ చిక్కన్న ఆయన వర్గీయులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ధర్నాకు దిగారు. ఎంపీడీఓ డీఎంకేబాషాను చుట్టుముట్టి నిలదీశారు. ఎంపీపీ మంజుల కుర్చీలో ఆమె భర్త కొల్లప్ప కూర్చునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఎంపీపీతో పాటు ఆమె భర్త ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పేదాక కదలకూడదంటూ ఎంపీడీఓను అడ్డుకున్నారు. ఇంతలో అక్కడి చేరుకున్న కొండాపురం సర్పంచ్ అనీల్, వైస్ ఎంపీపీ వెంకటేశులు, జెడ్పీటీసీ కొల్లాపురప్ప, మాజీ సర్పంచ్ రామ్మోహన్ కొల్లప్పకు ఏమిఅధికారముందని అందరిపైనా అజమాయిషి చేస్తున్నాడంటూ నిలదీశారు. సుమారు గంట పాటు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చోటు చేసుకుంది. తూర్పుకోడిపల్లి పంచాయతీకి చెందిన పలువురు చివరి సమయంలో రెచ్చి పోయారు. ఎంపీపీ మంజుల కొల్లప్ప పేరుతో ఉన్న బోర్డును ధ్వంసం చేశారు. ఈసమయంలో జోక్యం చేసుకున్న జెడ్పీటీసీ ఇది మంచిపద్ధతి కాదని హితబోధ చేశారు. అందరూ అక్కడి నుంచి మూకుమ్మడిగా టీడీపీ కార్యాలయానికి చేరుకుని అక్కడ కూడా కొల్లప్ప తీరుపై ఆగ్రహం వెళ్లగక్కి నాయకులను నిలదీశారు.