మృణాళిని ఇలాకాలో తమ్ముళ్ల రణం
చీపురుపల్లి: అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే అధికార తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ముసలం మొదలయ్యింది. మండలంపై ఆధిపత్యం కోసం నువ్వా నేనా అంటూ ఎంపీపీ, జెడ్‌పీటీసీలు కా లు దువ్వుతుండడంతో ఏం చేయాలో అ ర్థం కాక దిగువ శ్రేణి నాయకులు ముక్కు న వేలేసుకుంటున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గం కావడంతో వీరిలోఎవరి మాట వినాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక మండలం లో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ది కాలంగా ఆధిపత్యం కోసం ఎంపీపీ, జెడ్‌పీటీసీల మధ్య అంతర్గతంగా జరుగుతున్న అలజడి తా జాగా బహిర్గతమయ్యింది.
ఈవిషయా న్ని సాక్షాత్తూ ఎంపీపీ రౌతు కాంతమ్మ, ఆమె భర్త ఎంపీటీసీ రౌతు కామునాయుడులే బాహాటంగా పత్రికలు ముందు వా రి అక్కసు వెళ్లగక్కారు. దీంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. అంతా ఒక్కటిగా ఉండి కార్యకర్తలను ముందుకు నడిపించాల్సిన ఎంపీపీ, జెడ్‌పీటీసీలే ఇలా ఆధిపత్యం కోసం కుమ్ములాడుకోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం వేదికగా వీరి మధ్య ప్రారంభమైన విభేధాలు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ వరకు పాకి ప్రస్తుతానికి తారస్థాయికి చేరాయి. దీంతో జెడ్‌పీటీసీ మీసాల వరహాలునాయుడు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఎంపీపీ రౌతు కాంతమ్మ భర్త ఎంపీటీసీ, మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటు రౌతు కామునాయుడు మాత్రం తమ ఆవేదనను ఎక్కడికక్కడే బాహాటంగా వెళ్లగక్కు తున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలకు హాజరైన ఎంపీపీ రౌతు కాంతమ్మ, జెడ్‌పీటీసీ భార్య, మేజర్ పంచాయతీ సర్పంచ్ మీసాల సరోజినిలు ఇద్దరిలో సర్పంచ్ మీసాల సరోజినితో పాఠశాలల్లో జెండా వందనం చేయించడాన్ని ఎంపీపీ దంపతులు జీర్ణించుకోలేకపోయారు. ఇదే విషయంపై అదే రోజు చాలా మంది ఉపాధ్యాయులపై తమ కోపాన్ని ప్రదర్శించారు. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు పెరిగాయి. ఇటీవల స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు స్వచ్ఛందంగా తప్పుకున్నారు. వారి స్థానంలో ప్రస్తుతం జెడ్‌పీటీసీ మీసాల వరహాలునాయుడుకు చెందిన వర్గీయులు మధ్యాహ్న భోజన నిర్వహణ వ్యవహారాన్ని చూస్తున్నారు. దీంతో అదే పాఠశాలలో తమ మనుషులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ అప్పగించాలంటూ గత కొద్ది కాలంగా ఎంపీపీ దంపతులు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
దీనికి జెడ్‌పీటీసీ మీసాల వరహాలునాయుడు ససేమిరా అన్నారు. కొద్ది కాలంగా ఈ వ్యవహారం నలుగుతున్న సమయంలో శని వారం బాలుర ఉన్నత పాఠశాలకు వెళ్లిన ఎంపీపీ దంపతులు..ఉపాధ్యాయులు, మండల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓ వైపు వీరు పాఠశాలలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికే జెడ్‌పీటీసీ వర్గీయులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించి ఉత్తర్వులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎంపీపీ దంపతులు ఓ వైపు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరోవైపు జెడ్‌పీటీసీ తెలివిగా వ్యవహరిస్తూ ఆయన పనులు చక్కబెట్టుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది. దీని ప్రకారం ఆధిపత్యం విషయంలో జెడ్‌పీటీసీ ముందంజలో ఉన్నట్లు పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.