టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పసుపు, కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. లబ్ధిదారులకు చెక్కులు, పింఛన్లు పంపిణీ చేసే సమయంలో టీడీపీ నేతలు ఈసారి ఓటు ఎవరికి వేస్తావు? అంటూ ప్రశ్నించడం కనిపించింది. టీడీపీకి వేస్తానంటే ఓకే.. తటపటాయిస్తే ఒత్తిడి తేవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జిల్లా ఉన్నతాధికారులు కూడా టీడీపీ కార్యకర్తల్లా పనిచేయడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రచార ఆర్భాటాల కోసం ప్రజాధనానికి తూట్లుపొడవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది.
సాక్షి, తిరుపతి: ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓట్ల కోసం టీడీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. పసుపు, కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు పోస్ట్‌డేటెడ్ చెక్కులు, వృద్ధులు, వికలాంగులకు పెంచిన పింఛన్లను శనివారం పంపిణీ చేసింది. సాధారణంగా పింఛన్లను అధికారులే లబ్ధిదారులకు పంపిణీ చేసేవారు. శనివారం చేపట్టిన కార్యక్రమాన్ని అందుకు భిన్నంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఏర్పాటు చేసిన వేదికలను పూర్తిగా పార్టీ జెండాలు, పసుపు బ్యానర్లు, పార్టీ నాయకుల ఫ్లెక్సీలతో నింపేశారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వారి బంధువులు, లబ్ధిదారులందర్నీ పసుపురంగు దుస్తులతో కార్యక్రమానికి హాజరు కావాలని హుకుం జారీచేశారు. తప్పని పరిస్థితుల్లో అనేకమంది పసుపు రంగు దస్తులతో రావడం కనిపించింది. పెన్షన్‌దారులు, డ్వాక్రా సభ్యులకు చేతిలో డబ్బు, చెక్కులతో పాటు పార్టీ ప్రచార పత్రాన్ని పెట్టి టీడీపీకి ఓటెయ్యండి అని అడగడం కనిపించింది. చంద్రబాబు గురించి చెప్పిందే చెప్పి లబ్ధిదారులను ఉక్కిరిబిక్కిరి చేశారు.
లబ్ధిదారులకు తిప్పలు
వృద్ధులు, వితంతువులు, మహిళలపై టీడీపీ నేతలు దౌర్జన్యం, దబాయింపుల తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. పింఛన్లు, చెక్కుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, వృద్ధులకు టీడీపీ నాయకులు, అధికారులు చుక్కలు చూపించారు. లబ్ధిదారులను ఉదయం 9 గంటలకు రమ్మని చెప్పి టీడీపీ నేతలు ఆలస్యంగా రావడం కనిపించింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన కార్యక్రమాలు అన్నీ ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ నేతలు రాకపోవడంతో సభలను సకాలంలో నిర్వహించలేదు. వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో వృద్ధులకు కుర్చీలు లేకపోవడంతో నిలబడే కనిపించారు.
తిరుపతిలో జరిగిన కార్యక్రమాలు సాయంత్రం వరకు సాగాయి. అనేక చోట్ల లబ్ధిదారులు సాయంత్రం వరకు అక్కడే ఉన్నా పట్టించుకునేవారు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలాఉంటే టీడీపీ నేతలు పోటీపడి ఒకరు డబ్బులు, మరొకరు పెన్షన్ బుక్కు, ఇంకొకరు స్వీటు, ప్రచార పత్రాలను పంచారు. కార్పొరేషన్ ఉద్యోగులను పక్కకు నెట్టి టీడీపీ నేతలు పంపిణీ చేపట్టడంతో చేసేదిలేక ఉద్యోగులు మిన్న కుండిపోయారు. జిల్లాలో అనేక ప్రాం తాల్లో లబ్ధిదారులు ఆకలితో అలమటిం చాల్సి వచ్చింది. కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కావడం, టీడీపీ నేతలు చెప్పిందే చెప్పి సమయాన్ని వృథా చేయడం వచ్చినవారి సహనాన్ని పరీక్షించింది. కార్యక్రమం ఆలస్యం అవుతుందని తెలిసి కూడా లబ్ధిదారులకు కొన్ని ప్రాంతాల్లో భోజనాలు ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఆకలితో అలమటించారు. సాయంత్రం వరకు కడుపు మాడ్చుకుని వేచి ఉన్నా కొందరికి చెక్కులు, పింఛన్లు ఇవ్వకుండా మరుసటి రోజు రండి అని చెప్పి తిప్పి పంపడం గమనార్హం.
పింఛన్ పాట్లు ఎన్నో
- బంగారుపాళ్యం మండలంలో జరిగిన పసుపు, కుంకుమ చెక్కుల పంపిణీలో ఎంపీపీ, ఏపీఎం, సంఘమిత్రలు వివాదాస్పద వాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి గ్రూప్ సభ్యులకు చెక్కులు, పింఛన్లు నిలిపివేయమని ఆదేశించారు.
- చంద్రగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన పసుపు, కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చెవిరెడ్డిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.
- పూతలపట్టు నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరయ్యేవారందరికీ పింఛన్లు, చెక్కులు ఇస్తామని చెప్పి టీడీపీ నాయకులు పిలి పించుకున్నారు. సమావేశం అయ్యాక కొందరికి మాత్రం ఇచ్చి మిగిలిన వారిని తిప్పి పంపేశారు.
- పాలసముద్రం మండలంలో పింఛన్‌దారుల వద్ద వేలిముద్రలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెనక్కు పంపించారు.
- పెనుమూరు, కార్వేటినగరం మండలాల్లో పింఛన్ల కోసం వచ్చిన లబ్ధిదారులకు భోజనాలు లేకపోవడంతో ఆకలితో అలమటించాల్సి వచ్చింది.
- చంద్రగిరి, పీలేరు, చిత్తూరు నియోజకవర్గాల్లో కార్యక్రమానికి హాజరైన వారంతా పస్తులతో అలమటించారు.
- మదనపల్లెలో భోజనాలు వడ్డించేవారు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- పలమనేరు నియోకవర్గంలో మాత్రం లబ్ధిదారులకు బిర్యానీ అన్నం, కోడిగుడ్లు పెట్టారు.
- కుప్పంలో వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిరీక్షించి వెనుదిరిగి వెళ్లారు. మరికొందరు చాలీచాలని భోజనాలతో తిప్పలు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment