
వైఎస్సార్‌సీపీలోకి అరకు టీడీపీ నాయకురాలు
అరకులోయ: నియోజకవర్గ కేంద్రం అరకులోయ మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు పొద్దు కాసులమ్మ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అరకు నియోజకవర్గ త్రిసభ్యకమిటీ సభ్యురాలు కె. అరుణకుమారి, పెదలబుడు పంచాయతీ సర్పంచ్ సమర్ది గులాబి ఆమెకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాసులమ్మ మాట్లాడుతూ 1999 నుంచి టీడీపీలో కొనసాగుతూ పలు పదవులు అలంకరించానన్నారు. అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం పనిచేశానన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని కొందరు నాయకులు స్వార్థంతో వ్యవహరిస్తూ సీనియర్‌లను విస్మరిస్తున్నారన్నారు. కనీసం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారన్నారు.
ఈ పరిస్థితుల్లో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ గెలుపునకు కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇక టీడీపీ నాయకుల ఆగడాలు సాగవన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు, మాజీ సర్పంచ్ సమర్ది రఘునాధ్, నాయకులు బూర్జ సుందరరావు, కిల్లో దొన్ను, గాశి పాల్గొన్నారు.