గుర్తించండి బాబూ!
* పదవుల కోసం టీడీపీ నేతల ఆరాటం
* అంతకంతకూ ఆలస్యం చేస్తున్న అధినేత
* వేసవి వరకూ పదవుల పందేరం లేనట్టేనా?
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘తప్పు చేసుంటే మన్నించు. లేదంటే శిక్షించు. కానీ.. మేమున్నామని గుర్తించు’ ఓ తెలుగు సినిమాలోని పాపులర్ డైలాగ్ ఇది. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని ఇలానే వేడుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు ఆ పదవులు ఎప్పటికి వస్తాయో తెలియక నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా జిల్లాలోని ఒక్క నాయకుడికీ నామినేటెడ్ పదవి దక్కలేదు.
వివిధ కార్పొరేషన్ల చైర్మన్ గిరీలు,ఆలయాలు, మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులు, మైనర్ ఇరిగేషన్ బోర్డు చైర్మన్ పదవులు పార్టీ నేతలను ఊరిన్నాయి. జిల్లాలో మొత్తం 18 మార్కెట్ కమిటీలు ఉండగా, ద్వారకాతిరుమల, భీమవరం మావుళ్లమ్మ దేవస్థానాలు మొదలు చిన్నాచితకా ఆలయాలు కలిపి 410 వరకు ఉన్నాయి. గత సర్కారు హయూంలో కొలువుదీరిన ఆయా పాలకవర్గాలకు కాలం చెల్లేలా ఉత్తర్వులు ఇచ్చి చాలా కాలమైనప్పటికీ కొత్త కొలువులకు మాత్రం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మొన్నామధ్య గతంలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా వ్యవహరించిన ఓ సీనియర్ నేత తాను చంద్రబాబును కలిశానని ఫొటోలు పంపించి ఇదిగో ఆ పోస్టు వచ్చేస్తోందంటూ మీడియాకు లీకులిచ్చారు. ఆ తర్వాత ఆ ఊసే లేకుండాపోయింది. రెండు వారాల కిందట చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ నామినేటెడ్ పోస్టుల విషయమై కనీస ప్రస్తావన కూడా చేయలేదు.
మహానాడు అయ్యేవరకు పదవులు రానట్టేనా?
అధికార పార్టీ అంతర్గత వ్యవహారాలు పరిశీలిస్తే.. వచ్చే ఏడాది మే వరకు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించిన టీడీపీ అధిష్టానం వచ్చే నెల 3వరకు ఆ పనిలోనే నిమగ్నమవ్వాల్సిందిగా పార్టీ శ్రేణులను ఆదేశించింది. పార్టీ వ్యవహారాల్లో అంతా తానై చూస్తున్న నారా లోకేష్ ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నారు. డిసెంబరు నెలాఖరులోగా ఆయన వచ్చినా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో తలమునకలయ్యే అవకాశముంది.
డిసెంబర్‌లో మొదలయ్యే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ దాదాపు రెండు నెలలకు పైగా సాగుతుందని అంటున్నారు. ముందుగా గ్రామ కమిటీలు, ఆ తర్వాత మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల ఎంపిక ప్రక్రియ, అనంతరం జిల్లా మహానాడు, రాష్ర్ట మహానాడు నిర్వహించి నామినేటెడ్ పదవుల పందేరం మొదలుపెడతారని పార్టీకి చెందిన సీనియర్లు అంటున్నారు. ఈలోగా పదవుల పంపకం చేస్తే సభ్యత్వ నమోదుపై ప్రభావం చూపుతుందని చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే మహానాడు తర్వాతే పదవుల పందేరానికి ముహూర్తం పెట్టనున్నారని అంటున్నారు.
మొత్తంగా చూస్తే 2015 వేసవి నాటికి గాని నామినేటెడ్ పోస్టులు వరించే అవకాశం లేదని తెలుస్తోంది. అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదికి గాని పదవులు చేజిక్కుంచుకోలేమని, ఈ లోగా పుణ్యకాలం గడిచిపోతుందని తెలుగు తమ్ముల్లు మదనపడుతున్నారు. వారి వ్యధను చంద్రబాబు పట్టించుకుని మహానాడు లోగానే పంపకాలు చేపడతారేమో చూడాలి.