టీడీపీ నేతల చలోహైదరాబాద్ !
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్లు నామినేటెడ్ పదవుల కోసం హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను ఆశ్రయిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నామని, కష్టకాలంలోనూ అండగా ఉన్నామని చెబుతూ ఆధారాలు చూపిస్తున్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలను ఫైల్‌గా రూపొందించి లోకేష్ ముందు పెడుతున్నారు. జిల్లాలోని ఆలయాల్లో 18 ఎండోమెంట్ కమిషనర్ పరిధిలో, 32 డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో, 222 సహాయ
కమిషనర్ పర్యవేక్షణలో ఉన్నాయి. 11 వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాలను కూడా నియమించాల్సి ఉంది. దాదాపు రెండు వేలకుపైగా పదవులు ఉండడంతో వీటిని పొందేందుకు పార్టీలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు అధిష్టానాన్ని ఆశ్రయిస్తున్నారు. రంగనాయకులస్వామి, వేణుగోపాలస్వామి, పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల చైర్మన్ పదవుల కోసం జిల్లా స్థాయి నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తాళ్లపాక రమేష్ రెడ్డి, పరసా రత్నం, బీద రవిచంద్ర, అంచెలవాణి తదితరులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో కొందరు లోకేష్‌ను ఆశ్రయిస్తున్నారు. లోకేష్ వద్దకు వెళ్లడానికి ముందుగా మంత్రి నారాయణ ఆశీస్సులు తీసుకుంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి నారాయణకు మాత్రమే చంద్రబాబునాయుడు, లోకేష్‌ల వద్ద మంచి పలుకుబడి ఉందంటూ ఆయన వద్దకు వెళుతున్నారు. మరోవైపు సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనవద్ద ఉన్న ఆశావహుల జాబితాను చంద్రబాబు నాయుడు ముందుంచినట్లు తెలిసింది. దీనికి చంద్రబాబు నాయుడు స్పందించలేదని సమాచారం. జాబితాను ముందుగా లోకేష్ వద్దకు తీసుకుని వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల వ్యవహారాన్ని లోకేష్ చూస్తున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. ఇది సోమిరెడ్డిని షాక్‌కు గురి చేసినట్లు సమాచారం. సీఎంతో త్వరలో మాట్లాడుతానని సోమిరెడ్డి తన సహచరులను శాంతపరిచినట్లు తెలిసింది. తన అనుచరుల్లో కొందరికైనా పదవులు ఇప్పించుకోలేని పక్షంలో వర్గం దూరమవుతుందని సోమిరెడ్డి ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కురుకొండ్ల రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కూడా ఆశావహుల జాబితాతో సీఎం చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. రెండురోజుల క్రితం తెలుగుయువత జిల్లా కార్యదర్శి జలదంకి సుధాకర్ నేరుగా లోకేష్‌ను కలుసుకుని, తాను 30 ఏళ్లుగా పని చేస్తున్నా, ఏ అవకాశం ఇవ్వలేదని, ఈసారి తనకు సింహపురి గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి ఆలయ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. మరికొంత మంది నాయకులు జిల్లాయేతర ఆలయాల్లోనూ తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నారు. ఏకంగా టీటీడీ, కాణిపాకం, విజయవాడ కనకదుర్గ ఆలయం లాంటి పెద్ద గుడుల చైర్మన్ పదవులు కోరుతూ చంద్రబాబు నివాసం ముందు క్యూ కడుతున్నారు. పార్టీ నాయకుడొకరు మాట్లాడుతూ పదవులు ఆశించడంలో తప్పులేదని, పార్టీలో కష్టపడిన వాళ్లే పదవులు ఆశిస్తున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లా నుంచే కాదని, అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు నామినేటెడ్ పదవులు కోరుతున్నారని చెప్పారు. కాగా త్వరలో శాసనమండలి సభ్యుల సంఖ్య పెరగడంతోపాటు ఖాళీలు ఏర్పడనున్నాయి. దీంతో ఎమ్మెల్సీ పదవులపై కూడా నేతలు కన్నేసి తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నేడు రెవెన్యూ ఉద్యోగుల కౌన్సెలింగ్
నెల్లూరు(పొగతోట): రెవెన్యూ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ మంగళవారం నిర్వహించనున్నారు. జాయింట్ కలెక్టర్ రేఖారాణి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించునున్నారు. సీఎస్‌డీటీలు, డీటీలు, ఆర్‌ఐల బదిలీ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. మూడు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో పనిచేసిన ఉద్యోగులను తప్పకుండా బదిలీ చేయాల్సి ఉంది. ఉద్యోగుల బదిలీల కోసం సిఫార్స్ లెటర్లు సిద్ధం చేసుకున్నారు. సిఫార్స్ చేస్తే ఉద్యోగులకు కౌన్సెలింగ్‌లో చివరి అవకాశం కల్పిస్తామని జేసీ హెచ్చరించారు.
సీనియర్ అసిస్టెంట్ మృతికి సంతాపం: చిట్టమూరు తహశీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఎల్లయ్య విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో సోమవారం మరణించాడు. ఆయన మృతికి రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కాయల సతీష్‌కుమార్, షఫిమాలిక్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.