రాష్ట్రంలో రాక్షస పాలన
కనిగిరి: టీడీపీ హయాంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీపై రోజుకో మాటతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను మోసగిస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎందరో వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆసరా కల్పిస్తే చంద్రబాబు కుంటి సాకులు చూపించి వారి కడుపు కొడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ హయాంలో జిల్లాలో 3 లక్షల 25 వేల పింఛన్లు ఉంటే ప్రస్తుతం టీడీపీ పాలనలో 2 లక్షల 50 వేలకు చేరాయన్నారు. దాదాపు 75 వేల మంది పింఛన్లు తొలగించారని చెప్పారు.
అర్హులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం:
పింఛన్ల తొలగింపులో అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు న్యాయం చేసేంత వరకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీకి ఓటే శారనే కక్షతో కావాలని పింఛన్లు తొలగిస్తే ఊరుకునేది లేదని..అర్హులైన పింఛన్‌దారులకు న్యాయం కోసం కోర్టుకు వెళ్తామన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన అంధురాలు ఈశ్వరమ్మ, వృద్ధురాలు కొండమ్మలు తమకు పింఛన్ నగదే జీవనాధారమని నెల రోజులు దాటినా ఇంకా పింఛను ఇవ్వలేదని ఎంపీ దృష్టికి తెచ్చారు. అధికారులను అడిగితే జన్మభూమి జరిగినప్పుడు ఇస్తాంలే తొందరెందుకని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎంపీ పింఛన్‌దారులకు నగదు పంపిణీ చేయకుండా జన్మభూమి సభల కోసం ఆపడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి వారికా పింఛన్ నగదు ఇవ్వకుండా ఆలస్యం చేసేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. జన్మభూమి సభలతో సంబంధం లేకుండా అర్హులైన వారికి వెంటనే పింఛన్లు ఇవ్వాలన్నారు.
చంద్రబాబు మోసాలపై ఆందోళనలు:
ఇచ్చిన హామీలు అమలు చేసేలా చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 5న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించనున్నట్లు వైవీ చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అమలులో చంద్రబాబు తీవ్ర మోసం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి అనేక మంది రైతులు పంటల బీమా కోల్పోయారన్నారు.
మోపాడుకు వెలిగొండ నీటి సరఫరాకు కృషి:
తాగు, సాగు నీటి సమస్య పరిష్కారం కోసం మోపాడు రిజర్వాయర్‌కు వెలిగొండ ప్రాజెక్టు నీరు వచ్చేలా కృషి చేస్తానని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వెలిగొండ నీరు మోపాడు రిజర్వాయర్‌కు మరలిస్తే కనిగిరి నియోజకవర్గంలోని 30 గ్రామాలకు సాగు నీటితో పాటు, భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉన్నందున ఈ విషయాన్ని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. నియోజకవర్గంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని..దానిపై తనకు వందల సంఖ్యలో అర్జీలు వచ్చినట్లు ఎంపీ వైవీ తెలిపారు. కనిగిరి నియోజకవర్గ నీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకె ళ్లనున్నట్లు వెల్లడించారు. సమస్య తీవ్ర ంగా ఉన్నచోట తన నిధుల నుంచి బోర్లు వేయిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. కనిగిరి మున్సిపాలిటీకి తన నిధుల నుంచి రూ.6.5 లక్షలతో నీటి ట్యాంకర్ మంజూరు చేసినట్లు చెప్పారు.
ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం: నూకసాని
ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాటాలు సాగిస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. పింఛన్ల ఏరివేత పేరిట ఎంతో మంది అర్హులకు అన్యాయం చేశారన్నారు. అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని, జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీని మున్సిపల్ కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు. ఎంపీ వైవీ వెంట మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, పార్టీ నియోజక వర్గ నాయకుడు బుర్రా మధుసూదన్ యాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు దంతులూరి ప్రకాశం, పల్లాల నారపరెడ్డి, రామన తిరుపతిరెడ్డి, ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, నాయకుడు వై వెంకటేశ్వరరావు, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.