చెరువు గర్భాలనూ దోచేశారు | TDP Leaders Irregularities In East Godavari | Sakshi
Sakshi News home page

చెరువు గర్భాలనూ దోచేశారు

Published Mon, Dec 2 2019 12:27 PM | Last Updated on Mon, Dec 2 2019 12:27 PM

TDP Leaders Irregularities In East Godavari - Sakshi

బిళ్లవాక గెడ్డ కాలువను మూసివేసి, సాగు చేస్తున్న కొబ్బరి తోట- కొండివారి చెరువును ఆక్రమించి సాగు చేస్తున్న కొబ్బరి తోట

నాడు అధికార బలం ఉండడం.. దానికి అధికారుల అండ తోడవడంతో.. దేన్నయినా దోచుకోవడానికి బరితెగించిన టీడీపీ నాయకులు చెరువు గర్భాలను సహితం వదల్లేదు. రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఓ కీలక మంత్రి అండదండలు ఉండడంతో తుని మండలం టి.తిమ్మాపురంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నాలుగు చెరువులను ఆక్రమించుకున్నారు. నాడు అధికార దర్పంతో ఆక్రమించుకున్న భూముల్లో ఏమాత్రం వెరపు లేకుండా నేటికీ సాగు చేసుకుంటున్నారు. గణేశుల చెరువు, కొండివారి చెరువు, గంగుల చెరువు, గుజ్జవాని చెరువుల్లో ఆరెకరాలకు పైగా భూమిని దర్జాగా ఆక్రమించేసుకున్నారు. గ్రామకంఠాన్ని సహితం ఆక్రమించుకుని, షాపులు నిర్మించి, అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. వారి అధికార మదానికి భయపడో.. వేరే కారణాలో కానీ ఇంత జరిగినా నాటి గ్రామ, మండల స్థాయి రెవెన్యూ అధికారులు ఈ బాగోతాన్ని చూసీచూడనట్టుగా వ్యహరించారు. ఫలితంగా చెరువుల గర్భాలు కుచించుకుపోయి నీటినిల్వ సామర్థ్యాలు తగ్గిపోయాయి.

తుని రూరల్‌: టి.తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి టీడీపీలో తృతీయ శ్రేణి నాయకుడిగా చెలామణీ అవుతున్నారు. గ్రామంలోని గణేశుల చెరువు సమీపంలో ఆయనకు భూములున్నాయి. ఆ భూముల మధ్య నుంచి గణేశుల చెరువుకు బిళ్లవాక గెడ్డ నీరు చేరేందుకు 172/8 సర్వే నంబర్‌లో కాలువ ఉంది. దానిని దారి మళ్లించడంతో రెండున్నర ఎకరాల భూమి ఆ పెద్దమనిషి భూమిలో కలిసిపోయింది. అందులో కొబ్బరి తోట సాగు చేసుకుంటున్నాడు. చెరువును ఆనుకుని ఉన్న టేకు చెట్లను సహితం తన భూభాగంలో కలిపేసుకున్నాడు. చెరువు గట్టును రోడ్డుగా విస్తరించి తన భూముల్లోకి కార్లు రాకపోకలు సాగించేలా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే గ్రామాన్ని ఆనుకుని సర్వే నంబర్‌ 970/3లో 2.88 ఎకరాల్లో గుజ్జవాని చెరువు ఉంది. ఇందులో ఎకరా భూమిని కబ్జా చేసి ఇళ్ల స్థలాలుగా విక్రయించుకున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

దానిని ఆనుకుని 970/3 సర్వే నంబర్‌లో ఉన్న గ్రామకంఠంలో కొంతభాగం ఆక్రమించుకుని, ఎన్‌టీఆర్‌ విగ్రహం, వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. మిగిలిన గ్రామకంఠాన్ని కూడా ఆక్రమించుకుని దర్జాగా దుకాణాలు నిర్మించేశారు. ఇలా కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించుకున్నా అప్పట్లో రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. 
ఈ నాయకుడి అండదండలతో అతడి అనుచరులు సైతం సర్వే నంబరు 706/2లో 3.42 ఎకరాల విస్తీర్ణం ఉన్న కొండివారి చెరువులో రెండు ఎకరాలు ఆక్రమించుకుని కొబ్బరి సాగు చేస్తున్నారు. 954/7 సర్వే నంబర్‌లో 28.74 విస్తీర్ణం గల చెరువు పొర్లుకట్టుకు అడ్డంగా 80 సెంట్ల భూమిని ఆక్రమించి పత్తి సాగు చేస్తూ ధనార్జన సాగిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమార్కుల చెర నుంచి చెరువులను కాపాడాలని, బిళ్లవాక గెడ్డ కాలువను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.

సర్వే చేసి చర్యలు
చెరువుల ఆక్రమణలపై నాకు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ గ్రామ రెవెన్యూ అధికారిని అడిగి తెలుసుకుంటాను. ఆ చెరువులను పరిశీలించి, సర్వే చేస్తాం. చెరువులను ఆక్రమించడం చట్టరీత్యా నేరం. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
– పి.శ్రీపల్లవి, తహసీల్దార్, తుని

ఆక్రమణలు తొలగించాలి
చెరువుల గర్భాల్లో ఆక్రమణలను తొలగించి, రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ఆక్రమణదారులు ఎంతటివారైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్తులకు అధికారులు రక్షణ కల్పించాలి. సమగ్ర సర్వే జరిపించి చెరువులను కాపాడాలి. చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాలి.
– మాణిక్యం, గ్రామస్తుడు, టి.తిమ్మాపురం

కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా..
అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చెరువులు, బిళ్లవాక గెడ్డ కాలువ, గ్రామకంఠం వంటి విలువైన భూములను ఆక్రమించుకున్నారు. ఆక్రమణలు, అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాను. గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడైనా అధికారులు స్పందిస్తే రైతులకు, గ్రామానికి ప్రయోజనం చేకూరుతుంది.
– పోల్నాటి ప్రసాద్, గ్రామస్తుడు, టి.తిమ్మాపురం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement