మద్దూరుపాడులో నిర్మించిన అపార్ట్‌మెంట్లు
సరైన కార్యాచరణ ప్రణాళిక లేకుండా గత ప్రభుత్వ నేతలు ఆడిన హౌసింగ్ డ్రామా ఇప్పుడు బట్టబయలైంది. ఎన్నికలకు ముందు పక్కాగృహాల పందేరానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. ఉచితం అని చెబుతూనే లబ్ధిదారులపై 20 నుంచి 30 ఏళ్ల పాటు రుణ భారం పెట్టేలా అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికలు సమీపించడంతో నిర్మాణం పూర్తి కాకుండానే ఫ్లాట్లలో గృహ ప్రవేశాలు చేపట్టింది. అయితే రుణభారాన్ని గ్రహించిన లబ్ధిదారులు ప్లాట్లు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పంపిణీ ఆగిపోయింది.
కావలి: పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామంటూ టీడీపీ నేతలు ఆడిన డ్రామాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కావలి పట్టణంలోని పేదలకు గూడు కల్పించేందుకు మద్దూరుపాడు ప్రాంతంలో గత ప్రభుత్వం అపార్ట్‌మెంట్ తరహాలో 2,112 ఫ్లాట్లు నిర్మించింది. వీటిలో అర్హులైన వారి కంటే అనర్హులకే కట్టబెట్టేందుకు టీడీపీ నాయకులు లబి్ధ దారులను ఎంపిక చేశారు. స్థానికేతరులు, బీపీఎల్‌కు ఎగువ ఉండే వారితో జాబితాలను సిద్ధం చేశారు. వీరి నుంచి 300 చ.అ. ఫ్లాట్‌కు రూ.500, 360 చ.అ. ప్లాట్‌కు రూ.12,500, 430 చ.అ. ఫ్లాట్‌కు రూ.25,000 వంతున డిపాజిట్లు కట్టించుకున్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రూ.3 లక్షల ఆర్థిక సాయం పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా మంజూరు చేయిస్తామని, ఈ అప్పును 360 నెలలపాటు ప్రతి నెలా వడ్డీతో సహా చెల్లించాలని తిరకాసు పెట్టారు.
ఎన్నికలు సమీపించడంతో..
ఇంతలో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హడావుడిగా చేసింది. ఫ్లాట్ల కేటాయింపు అంటూ తాళాలు ఇచ్చినట్లుగా అప్పట్లో టీడీపీ మంత్రులు, నాయకులు హంగామా సృష్టించారు. అయితే తీసుకున్న ప్లాట్లకు 20 నుంచి 30 ఏళ్లపాటు అసలు వడ్డీతో కలిపి బ్యాంక్‌లకు చెల్లించాలనే షరతు పెట్టడడంతో ఈ ప్లాట్లు తీసుకునేందుకు లబ్ధిదారులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది.
ఇల్లు లేని మహిళల పేరుతోనే..
ఈ అపార్ట్‌మెంట్ ఫ్లాట్లలో మూడు కేటగిరీల్లోనూ ఇల్లు లేని మహిళల పేర్లతో ప్రభుత్వం మంజూరు చేయాలని నిర్ధిష్టమైన నిబంధనలు పొందుపరిచింది. దీంతో జాబితాలో భర్తల పేర్ల స్థానంలో భార్యల పేర్లు చేర్చడానికి, కుటుంబంలో భార్య లేదా భర్తకు ఇప్పటివరకు ఇల్లు లేదనే అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.
టీడీపీ నేతల మోసంపై మండిపాటు
తొలుత ఉచితంగా ఇళ్లు ఇస్తామని డిపాజిట్లు కట్టించుకుని, ఆ తర్వాత బ్యాంక్ రుణాలంటూ మోసం చేశారని దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది లబి్ధదారులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇళ్ల స్థలం, ఇల్లు నిర్మించి ఇస్తారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడెక్కడో..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించేందుకు ఉప్రకమించింది. గత ప్రభుత్వ హయాంలో మద్దూరుపాడులో నిర్మించిన 2,112 ఫ్లాట్లను లబ్ధిదారులపై ఎటువంటి భారం లేకుండా ఇవ్వాలని భావించింది.
►ఇందులో రూ.500 చెల్లించిన లబ్ధిదారులకు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.
►ఈ కేటగిరీలో 704 మంది ఉన్నారు. వీరి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, కరెంట్ బిల్లు తదితర వాటిని సేకరించి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిగా గుర్తించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
►కావలి మున్సిపల్ కమిషనర్ బి.శివారెడ్డి లబ్ధిదారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
►మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారి దశయ్య సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
►రూ.12,500 చెల్లించిన వారికి 360 చ.అ., రూ.25,000 చెల్లించిన వారికి 430 చ.అ. విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది.
►మిగిలిన వారు రూ.3.65 లక్షలు, రూ.4.65 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, అందుకు అవసరమైన బ్యాంక్ రుణాలు మంజూరు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు.
►ఈ మూడు రకాల విస్తీర్ణంలోని అపార్ట్‌మెంట్ ఫ్లాట్లను లబ్ధిదారులకు మంజూరు చేయాలంటే, వ్యక్తిగతంగా వారు అంగీకార పత్రంపై సంతకాలు చేయాల్సి ఉంది.
►సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఫ్లాట్ల కోసం నగదు చెల్లించిన వారి చిరునామాలకు వెళ్లి సంప్రదిస్తుంటే, తమకెందుకు బ్యాంక్ రుణాలు, టీడీపీ నాయకులు ఉచితంగా ప్లాట్లు ఇస్తామంటే కట్టామని, వారు మోసం చేశారంటూ మండిపడుతున్నారు.
►అయితే డిపాజిట్లు చెల్లించిన వారి చిరునామాలకు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు వెళ్తే అసలు ఆ పేర్లు కలిగిన వ్యక్తులు కావలి పట్టణాన్ని వదిలి ఏళ్లు అయిందని ఇరుగుపొరుగువారు చెబుతుండటం విస్తుగొలుపుతోంది.
►ఇచ్చిన ఫోన్ నంబర్‌లో సంప్రదిస్తే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కోసం తాము దరఖాస్తు పెట్టలేదని, కావలి విడిచి ఏళ్లు అవుతుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment