
వినుకొండ వీధిలో ఆందోళన చేస్తున్న మహిళను అడ్డుకుంటున్న పోలీసులు
‘గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న’ చందంగా తయారైంది తెలుగుదేశం పార్టీలో కొందరు నేతల పరిస్థితి. తెలుగు తమ్ముళ్ల ప్రోద్బలంతో జరుగుతున్న భూ కబ్జాలపై వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ లక్ష్యంగా కొందరిని ఉసిగొల్పి శుక్రవారం ఆందోళనకు దిగారు. కాకినాడ రాజీవ్‌గృహకల్ప-దుమ్ములుపేట మధ్య కోట్లాది రూపాయల విలువైన 8 ఎకరాల రెవెన్యూ భూమి కబ్జాచేసే ప్రయత్నాన్ని ‘తెలుగు తమ్ముళ్ల భూ బాగోతం’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ఆ పార్టీ నాయకులకు గిట్టలేదు. వాస్తవాలు రుచించక ఆ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి, అతని ముఖ్య అనుచరుల ప్రోద్బలంతో కొందరితో ‘సాక్షి’ కాకినాడ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా కార్యాలయం వద్ద మోహరించడంతో వచ్చిన మహిళలు కొద్దిసేపు ఆందోళన చేసి వెళ్లిపోయారు. వివాద నేపథ్యాన్ని పరి శీలిస్తే.. కాకినాడ దుమ్ములుపేట ప్రాంతంలో సుమారు 8 ఎకరాల రెవెన్యూ స్థలంపై తెలుగు తమ్ముళ్లు కన్నేశారు. దాదాపు 15 ఏళ్ల క్రితం మాజీ మంత్రి దివంగత మల్లాడి స్వామి ఇక్కడి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు ఆ ప్రాంతాన్ని లేఅవుట్ చేయించారు. అది కార్యరూపం దాల్చలేదు. అనంతరం ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిపోయారు. సదుద్దేశంతో ఇళ్ల స్థలాల కోసం మల్లాడి చేసిన ప్రతిపాదనలను సాకుగా, కొంతమంది స్థానికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రెండు దశాబ్దాలు గడిచిపోయాక తెలుగు తమ్ముళ్లు ఆ భూమిని కాజేసే ప్రయత్నంలో ఉన్నారు.
దీనిలో భాగంగా ఆ భూమిని చదును చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి రికార్డుల్లో ఆ భూమి రెవెన్యూ శాఖదిగానే ఉంది. ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని, తమ భూమి కబ్జాకు గురవుతోందని కాకినాడ అర్బన్ రెవెన్యూ అధికారులు కాకినాడ పోర్టు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఫలితంగా పోలీసులు ఆ పనులను నిలుపుదల చేయిం చారు. ఇవే విషయాలను ‘సాక్షి’ ప్రచురించింది. వాస్తవ పరిస్థితిని వెలుగులోకి తేవడంతో ఆ భూమిపై కన్నేసిన తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఆ భూమి విలువ రూ.20 కోట్లపైగా ఉండడంతో ప్లాట్లుగా విడదీసి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించడం, ఇందుకు అడ్డుపడ్డ ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కడంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా భూ కబ్జాలు ఇటీవల ఒకొక్కటిగా వెలుగులోకి వస్తుం డడంతో ఎన్నికల సమయంలో పార్టీ పరువు మసకబారిపోతుండడం స్థానిక మాజీ ప్రజాప్రతినిధిని ఆందోళనలో పడేసింది. వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ లక్ష్యంగా దాడికి ప్రయత్నించడంపై కాకినాడ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
అడ్డుకున్న పోలీసులు
వాస్తవం ఇలా ఉండగా, ఒక విద్యా సంస్థకు చెందిన తెలుగుయువత నాయకుడి ప్రోద్బలంతో దుమ్ములపేటకు చెందిన వారమంటూ కొందరు ‘సాక్షి’ కార్యాలయం సమీపాన వినుకొండవారి వీధిలో ఆందోళనకు దిగారు. టీడీపీ హయాంలో తమకు పట్టాలు ఇచ్చారని, పల్లపు ప్రాంతం కావడంతో ఇళ్లు నిర్మించుకోలేకపోయామని చెప్పుకొచ్చారు. తమ స్థలాలను తామే చదును చేసుకుంటున్నామని ఆందోళన చేశారు. పోలీసులు వెంటనే ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించడంతో వారు వెళ్లిపోయారు.
కాగా, ఈ ఆందోళన చేస్తున్న ప్రాంతానికి సమీపాన తమకు రూ.500 ఇచ్చారని కొందరు, తమకు రూ.300 మాత్రమే ఇచ్చారని మరికొందరు మహిళలు గొడవపడడం కనిపించింది. డీఎస్పీ విజయభాస్కరరెడ్డి ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ అద్దంకి శ్రీనివాస్, ఎస్సై రవికుమార్, సీఆర్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.