అవినీతిలో మేటి ప్రత్తిపాటి | Ex minister Prattipatis list of irregularities | Sakshi
Sakshi News home page

అవినీతిలో మేటి ప్రత్తిపాటి

Published Wed, Apr 17 2024 6:10 AM | Last Updated on Wed, Apr 17 2024 4:35 PM

Ex minister Prattipatis list of irregularities - Sakshi

సీసీఐలో పత్తి కొనుగోలు పేరిట రూ.650 కోట్లు హాంఫట్‌

మాజీ మంత్రి ప్రత్తిపాటి అక్రమాల చిట్టా

యడవల్లిలో దళితుల భూముల కాజేతకు కుట్ర 

రేషన్‌ బియ్యం మాఫియా కింగ్‌గానూ పేరు  

తక్కువ ధరకు అగ్రిగోల్డ్‌ భూముల స్వాదీనం 

భార్య వెంకాయమ్మ పేరుతో రిజిస్ట్రేషన్

ఆయన అవినీతిలో ఘనాపాఠి. పదవిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు తెరలేపారు.కుంభకోణాలకు కేంద్రబిందువుగా నిలిచారు. భూ ఆక్రమణల నుంచి గ్రావెల్‌ తవ్వకాల వరకు అంతా దోపిడీ పర్వమే. రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన సీసీఐ స్కామ్‌కు సూత్రధారుడు. అగ్రిగోల్డ్‌ భూముల అక్రమ కొనుగోళ్ల వ్యవహారాల్లో అడ్డంగా దోచేశాడు. బడుగుల భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ఘనుడు. ఇదీ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు అవినీతి బాగోతం. 

చిలకలూరిపేట: గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన  ప్రత్తిపాటి పుల్లారావు   2014–15 కాలంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలో సీసీఐ కుంభకోణం జరిగింది.  దాదాపు రూ.650 కోట్లు అక్రమాలు జరిగినట్లు సీబీఐ విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో మంత్రి పాత్ర ఉన్నట్టు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.

 ఈ కుంభకోణం అప్పటి ప్రభుత్వాన్ని కుదిపేసింది. దీంతో విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన అప్పటి ప్రభుత్వం అనంతరం 2016 నవంబర్‌లో చిలకలూరిపేట మార్కెట్‌ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి కె.నాగవేణి సహా మొత్తం 26 మంది మార్కెటింగ్‌ శాఖ అధికారులు, సిబ్బందిని సస్పెండ్‌ చేసి చేతులు దులుపేసుకుంది.   
అగ్రిగోల్డ్‌ భూముల కొనుగోలు 
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో అగ్రిగోల్డ్‌ వెంచర్లలో 14.81 ఎకరాల భూమిని విడతలవారీగా ప్రత్తిపాటి పుల్లారావు తన సతీమణి ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మ(ప్రత్తిపాటి వెంకట కుమారి) పేరుతో కారుచౌకగా కొన్నారు. అప్పటికే అగ్రిగోల్డ్‌ సంస్థ వివాదాల్లో ఇరుక్కోవడంతో ఆ సంస్థ భాగస్వాములను అధికారం అడ్డంపెట్టుకుని బెదిరించి ఈ భూములను చౌకగా కొట్టేశారనే ఆరోపణలు పుల్లారావుపై వెల్లువెత్తాయి.

ఈ  మొత్తం భూమిని ఆ తర్వాత  గుంటూరుకు చెందిన కామేపల్లి  వెంకటేశ్వరరావుకు, పెదకాకాని మండలం, ఉప్పలపాడుకు చెందిన  చెరుకూరి నరసింహారావులకు దాదా పు 30 లక్షలు ఎక్కువకు విక్ర యించారు. ఈ భూమిని ఎకరా రూ. 20 లక్షలలోపు ధరకు కొన్న ప్రత్తిపాటి ఆ తర్వాత ఎకరా రూ.52 లక్షలకు  విక్రయించినట్లు సమాచారం.   

గ్రావెల్, రేషన్‌ మాఫియా  
యడ్లపాడు మండలంలోని అసైన్డ్‌ భూముల్లో యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వి ప్రత్తిపాటి, ఆయన అనుచరులు రూ.కోట్లాది రూపాయలు గడించారు.  చారిత్రాత్మక కొండవీడు కొండలనూ పిండి చేశారు. ప్రత్తిపాటిపై అప్పట్లో అదే పార్టీకి చెందిన  మాజీ  మంత్రి రావెల కిషోర్‌బాబు బహిరంగ విమర్శలు చేశారు.  పౌరసరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన  ప్రత్తిపాటి పుల్లారావు రేషన్‌ మాఫియాను ప్రోత్సహించి రూ.కోట్లు వెనుకేశారు. అప్పట్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడుల్లో ఈయన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నీరు–చెట్టు పథకంలోనూ ప్రత్తిపాటి అనుచరులు రూ.కోట్లు కొల్లగొట్టారు.  

యడవల్లి దళిత భూములు కాజేసే కుట్ర 
చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో 1975లో  సర్వే నెంబర్‌ 381లో ఉన్న  416.5 ఎకరాల  భూమిని 250 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఏకపట్టాగా అందజేశారు. 1976లో యడవల్లి వీకర్స్‌ సెక్షన్‌ ల్యాండ్‌ కమిటీ పేరుతో లబ్దిదారులైన ఎస్సీ, ఎస్టీలు ఓ సొసైటీగా ఏర్పడి సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూముల్లో విలువైన  బ్లాక్‌ పెరల్‌ గ్రానైట్‌ ఉన్నట్టు తెలుసుకున్న ప్రత్తిపాటి సొసైటీనే రద్దు చేయించారు.

 ప్రభుత్వ భూములుగా ప్రకటింపజేశారు. బినామీలతో అక్రమ మైనింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో వైఎస్సార్‌ సీపీ, దళిత సంఘాల పోరాటానికి దిగాయి. దళితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వెళ్లారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక యడవల్లి దళితులకు న్యాయం జరిగింది.   

జర్నలిస్టులపై కక్ష  
చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎంవీఎన్‌ శంకర్‌ 2014 నవంబర్‌ 25వ తేదీ విధులు ముగించుకుని  రాత్రి వేళ ఇంటి బయట బైక్‌ పార్క్‌ చేస్తుండగా ఇద్దరు దాడి చేశారు. అతను గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ కేసులో ప్రత్తిపాటి పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.

తనకు వ్యతిరేకంగా వార్తలు రాశారన్న అక్కసుతో యడ్లపాడుకు చెందిన మాజీ విలేకరి మానుకొండ సురేంద్రనాథ్‌కు సంబంధించిన భూమిలో మంత్రి అనుచరులు భారీగా గ్రావెల్‌ తవ్వకాలు జరిపి విక్రయించారు. అదే భూమిని గతంలో ఇతరులకు అమ్మేందుకు సురేంద్ర అడ్వాన్సులు తీసుకున్నాడు. ఆ భూమి వివాదంలోకి వెళ్లడంతో తీసుకున్న అడ్వాన్సులు ఇవ్వలేక సురేంద్ర 2017 డిసెంబర్‌ 18న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

పుల్లా రావు సతీమణి పెత్తనం
పుల్లారావు తన అధికారాన్ని రాష్ట్ర స్థాయిలో విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తే ఆయన సతీమణి వెంకాయమ్మ నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇంటికి వచ్చి తనకు సలాం కొట్టలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.జ్యోతిర్మయితోపాటు ముగ్గురు వైద్యులు, ఓ హెడ్‌నర్సు, నలుగురు స్టాఫ్‌ నర్సులు, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ను బదిలీ చేయించారు. ఏ కార్యాలయంలోనైనా ఫైల్‌ కదలాలంటే ముందు మేడమ్‌కు కప్పం కట్టాల్సిందే అన్నంతగా అవినీతికి పాల్పడ్డారు.   

పుల్లారావుపై కేసులివే..
ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్త పిల్లి కోటిని అరెస్టు చేసినప్పుడు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు  ప్రత్తిపాటి పుల్లారావుపై  చిలకలూరిపేట టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో క్రైమ్‌ నంబర్‌ 45/2020 యూ/ ఎస్‌ 341.18855/ కింద కేసు నమోదు చేశారు.  

♦ మంచినీటి చెరువువద్ద ఎన్టీఆర్‌ సుజల వాటర్‌ ప్లాంట్‌ అనుమతులు లేకుండా ప్రారంభించేందుకు యత్నించి విధుల్లో ఉన్న మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ కోడిరెక్క సునీతపై దాడి చేసినందుకు  క్రైమ్‌ నంబర్‌ 136/2022 యూ/ఎస్‌ 353, 509, 506,323 ఆర్‌/డబ్ల్యూ, 34 ఐపీసీ – సెక్షన్‌ 3(1)(ఆర్‌)(ఎస్‌),3(2)(వీఏ) ఆఫ్‌ ఎస్సీ/ఎస్టీ పీఓఏ యాక్ట్‌ కింద ప్రత్తిపాటిపై కేసు నమోదైంది.   

 చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌లో అరెస్టయినప్పుడు చిలకలూరిపేట జాతీయ రహదారి దిగ్బంధనం చేసి పోలీసు విధులకు ఆటంకపరిచినందుకు  క్రైమ్‌ నంబర్‌ 238/2023 యూ/ఎస్‌ 341, 353, 120(బి), 144, 148 ఆర్‌/డబ్ల్యూ 143 ఐపీసీ – సెక్షన్‌ 129–149, క్రైమ్‌ నంబర్‌ 240/2023 యూ/ఎస్‌ 435, 353, 120–బి ఆర్‌/డబ్ల్యూ 149 ఐపీసీ కింద, క్రైమ్‌ నంబర్‌ 125/2023 యూ/ఎస్‌ 353, 341, 147, 143, 120–బి. ఆర్‌/డబ్ల్యూ 149 కింద మూడు కేసులు నమోదయ్యాయి.

♦ చట్టప్రకారం జరుగుతున్న ఇసుక  రవాణాను అడ్డు కుని పోలీసు విధులను అడ్డుకోవడంతో  అమరా వతి పోలీస్‌ స్టేషన్లో  క్రైమ్‌ నంబర్‌ 93/2023 యూ/ఎస్‌ 143, 341, 230 ఆర్‌/డబ్ల్యూ 149 ఐపీసీ కి ంద కేసు నమోదైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement