పచ్చ తమ్ముళ్ల పైరవీలు షురూ!
విజయనగరం క్రైమ్/బొబ్బిలి:జిల్లాలో విజయనగరం, గజపతినగరం, పార్వతీపురం, బొబ్బిలి, కురుపాం, చీపురుపల్లి, కొత్తవలస, పూసపాటిరేగ, సాలూరులలో వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. ఇందులో కురుపాం, కొత్తవలస మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు లేవు. మిగిలిన ఏడు కమిటీలకూ పాలక వర్గాలు ఉన్నాయి. వీటన్నింటిని రద్దు చేశారు. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురాలకు మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ పి.వి.సుధాకర్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. గజపతినగరం, కురుపాం, కొత్తవలస, పూసపాటిరేగ, సాలూరు, చీపురుపల్లిలను మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ బి.శ్రీనివాసరావును ఇన్‌చార్జిగా నియమించారు.
అధికార దాహంతోనే...
గత సంప్రదాయాలకు విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పాలకవర్గాల పదవీకాలం ముగియకుండానే హడావుడిగా ర ద్దు చేయడం తగదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2004 సంవత్సరానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన పాలకవర్గాలను అదే ఏడాదిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించింది. అయితే పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నాయకులు అధికారం కోసం అర్రులు చాచుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మార్కెట్ కమిటీలను రద్దు చేయడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమ పార్టీ వారికి నామినేటెడ్ పదవులను కట్టబె ట్టాలన్న ఆత్రుతతో ఈ చర్యకు పాల్పడినట్లు ప్రస్తుత పాలక మండలి సభ్యులు విమర్శిస్తున్నారు.
ఇబ్బందులు తలెత్తే అవవకాశం...
వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండళ్లను రద్దు చేసిన ప్రభుత్వం రాత్రికి రాత్రే ఇన్‌చార్జిలను కూడా నియమించింది. అసలే ఖరీఫ్ సీజన్ కావడం రైతులకు సంబంధించిన సేవలు వీటి ద్వారా అందించాల్సిన ఉంటుంది. ఇలాంటి సమయాల్లో పాలక మండళ్లను రద్దు చేసి అధికారులను నియమించడం సరైన చర్య కాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలనపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పాలక మండలి ఉంటే రైతులకు అవసరమైన నిర్ణయాలు సత్వరమే తీసుకునే అవకాశం ఉండేది. అయితే అధికారుల పాలనలో అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కష్టసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది
బొబ్బిలిలో....
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బొబ్బిబిలో కౌన్సిలర్లు, చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ మంది పోటీపడ్డారు. నామినేటెడ్ పదవులను తాయిలంగా చూపించి అప్పట్లో వారిని మెత్తబరిచారు. ఇప్పుడు వారం తా తమకే పదవులు కట్టబెట్టాలని నాయకులపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ పోస్టు కోసం తూముల అచ్యుతవల్లితో పాటు చోడిగంజి రమేష్‌నాయుడు, పువ్వల శ్రీనివాసరావు, రెడ్డి లక్ష్మీప్రసాద్ పోటీ పడ్డారు. అయితే అధిష్టానం ఆ పీఠాన్ని అచ్యుతవల్లికి ఖరారు చేస్తూ మిగిలిన వారికి నామినేటెడ్ పోస్టులున్నాయంటూ ఆశ చూపింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు ను ఒకటో వార్డు కౌన్సిలరు చోడిగంజి రమేష్‌నాయుడుకు ఇస్తామని మాట ఇవ్వడంతో చైర్‌పర్సన్ స్థానంకు పోటీ నుంచి పక్కకు తప్పుకొన్నారు.
అయితే నామినేటెడ్ పోస్టులు భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియకపోవడం అంతవరకూ మున్సిపల్ వైస్ చైర్మన్ పోస్టు ఇవ్వాలని పట్టుబట్టి గత నెల 3న జరిగిన ఎన్నికల్లో ఆ పీఠంపై చోడిగంజి కూర్చున్నారు. కమిటీ చైర్మన్ల నోటిఫికేషన్ వస్తే వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు పార్టీ పెద్దలు వద్ద ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. అలాగే ఏఎంసీలోని డెరైక్టర్ పోస్టులకు పట్టణంతో పాటు బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల్లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోటీ పడుతున్నారు. బొబ్బిలిలోని ఆంజనేయస్వామి దేవాలయం లో కమిటీ కూడా రద్దు అవుతుంది. దానికి చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులుంటారు. సరిగ్గా ఏడాది కిందటే కాంగ్రెస్ పెద్దలు ఈ కమిటీని వేశారు.
ఇక వేణుగోపాలస్వామి దేవాలయానికి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు అనువంశిక ధర్మకర్తగా ఉంటున్నారు. అక్కడ కూడా ఇద్దరు సభ్యుల ను నియమించడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం టీడీపీతో పాటు బీజేపీ నాయకులు కూడా ఈ నామినేటెడ్ పోస్టులపై దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ర్టంలో టీడీపీ అధికారంలోనికి రావడానికి బీజేపీ పాత్ర, భాగస్వామ్యం చాలా ఉందని, అందు కు నామినేటెడ్ పోస్టుల్లో తమకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ పెద్దల వద్దకు వెళ్లి అభ్యర్థిస్తున్నట్లు స మాచారం. మరి వీటికి సమాన న్యా యం ఎలా జరుగుతుందో చూడాలి.