జీ.. హుజూర్
సాక్షి ప్రతినిధి, కడప:ప్రభుత్వ అధికారులమనే భావనను వారు మరచిపోతున్నారు. పచ్చ కండువా కప్పుకోకుండానే అధికార పార్టీ నేతలకు జీ.. హుజూర్ అంటున్నారు. రాజభక్తి ప్రదర్శించడంలో పోటీలు పడుతున్నారు. నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులను గాలికి వదిలేస్తున్నారు. జమ్మలమడుగు ఆర్డీఓ మొదలు జెడ్పీ సీఈఓ వరకూ వారి పరిధిలో సరికొత్త నాటకాలకు తెరలేపుతున్నారు. ప్రజాప్రతినిధులను విస్మరిస్తూ వింతపోకడలు ప్రదర్శిస్తున్నారు.వైఎస్సార్ జిల్లాలో అధికార యంత్రాంగం ఏకపక్ష ధోరణిలో పయనిస్తోంది. కాదు...కాదు... ఏకపక్షంగా పనిచేసి తీరాలంటూ తెలుగుతమ్ముళ్లు ఆదేశిస్తున్నారు. వారి ఆదేశాలను యంత్రాంగం తుచ తప్పకుండా పాటిస్తోంది.
ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు ఇందుకు తాత్కారంగా నిలుస్తున్నాయి. జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన ఆర్డీఓ రఘునాథరెడ్డి డ్రామా ఆర్టిస్ట్‌ను మరిపించారు.ఎన్నికలు నిర్వహిస్తే చైర్మన్‌గిరీ వైఎస్సార్‌సీపీ వశమవుతుందని గ్రహించిన తెలుగుతమ్ముళ్లు తెరవెనుక ఆదేశాలు అందజేయడంతో తెరముందు అనారోగ్య సమస్యను ఆర్డీఓ ఆవిష్కరించారు. కొద్దిసేపటి క్రితం వరకూ చలాకీగా ఉన్న ఆయన తెలుగుతమ్ముళ్ల మెప్పు కోసం అనారోగ్య డ్రామాను రక్తి కట్టించారు. జెడ్పీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా అధికారుల నాటకం మారోమారు బహిర్గతం అయింది. టీడీపీ సభ్యులు, వారి మద్దతుదారులు పత్రాలు చింపేయడం, వెంటనే అక్కడి నుంచి సీఈఓ మాల్యాద్రి జారుకోవడం టీడీపీ నేతల స్క్రిప్ట్ ప్రకారమే జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
క్రమం తప్పకుండా...
జమ్మలమడుగు ఉద ంతం తర్వాత అధికారులు అధికార పార్టీ మెప్పుపొందడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల మేరకు వేదికపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు సీటు కేటాయించకుండా కమిషనర్ వెంకటకృష్ణ టీడీపీ నేతల మెప్పు కోసం తాపత్రయపడ్డారు. టీడీపీ నేతల ఆదేశాలకు అనుగుణంగా జెడ్పీ సీఈఓ మాల్యాద్రి చెప్పాపెట్టకుండా జారుకోవడంతో డీప్యూటీ సీఈఓ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఎక్కడా పనిచేయలేవంటూ డిప్యూటీ సీఈఓ బాలసరస్వతీదేవిని అధికార పార్టీ నేత ఒకరు బెదిరించినట్లు సమాచారం. అధికారులు అంతా చూస్తుండటానే టీడీపీ నేత ఫోన్‌లో డీప్యూటీ సీఈఓపై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది.
తలాడించకుంటే బదిలే ...
అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా లేని అధికారులను బదిలీ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ అశోక్‌కుమార్‌ను అనతికాలంలోనే బదిలీ చేయించారు. దీంతో అధికారులు టీడీపీ నేతలు ఆదేశిస్తే జీ హుజూర్ అనడం అలవాటు చేసుకుంటున్నారు. నిబంధనలు అడ్డువస్తున్నాయని కొంతమంది అధికారులు వివరిస్తే వారిని దూషించడం మొదలు పెడుతున్నారు. జిల్లాలో సోదరులైన టీడీపీ నేతలు ఇష్టానుసారంగా అధికారులను దూషిస్తున్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. దీంతో టీడీపీ నేతల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడాన్ని యంత్రాంగం అలవాటుగా చేసుకుంటోంది. కిందిస్థాయి యంత్రాంగం అయితే అధికార పార్టీ నేతల ఆదేశాలను తక్షణమే ఆచరిస్తున్నారు. ఇందుకు ఒంటిమిట్ట తహశీల్దారు ఈశ్వరయ్య శైలి నిదర్శనంగా నిలుస్తోంది.