ఆక్రమణల చెరవు | TDP Leaders occupied government land in vizianagaram | Sakshi
Sakshi News home page

ఆక్రమణల చెరవు

Published Sat, Jun 9 2018 7:56 AM | Last Updated on Fri, Aug 10 2018 9:52 PM

TDP Leaders occupied government land in vizianagaram - Sakshi

ఇదే భంజ్‌దేవ్‌ చేపల చెరువు

ఆయన రాజరిక కుటుంబం నుంచి వచ్చారు. అటు తరువాత ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ అర్హతలతోనే గాబోలు... ఏకంగా పాతిక ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి ఎంచక్కా చేపల చెరువు నిర్వహించేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో అది సర్కారు భూమేనని స్పష్టం చేస్తున్నా... అధికారులు సైతం దానిని పట్టించుకోలేదు. నిర్భయంగా చేపల చెరువుగా మార్చుకునేందుకు అనుమతులిచ్చేశారు. ఇదే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది.

సాలూరు, టాస్క్‌ఫోర్స్‌ :  జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో ఒక్కో నాయకుడి తీరు ఒక్కోలా ఉంది. ఎవరికి వారే తమ శక్తి కొలదీ అక్రమాలకు పాల్పడుతూ తమదైన ముద్ర వేసుకుంటున్నారు. వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతున్నా చలించట్లేదు సరికదా... తాము చేసింది తప్పుకాదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. టీడీపీలో సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.పి.భంజ్‌దేవ్‌ వ్యవహా రం ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. నిన్నగాక మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను గిరిజ నుడిగా పేర్కొంటూ జీఓ జారీచేయడంతో గిరిజన సంఘాలు దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎంతో ఇష్టంగా పాచి పెంట మండలంలో సాగుచేస్తున్న చేపల చెరువులో 25 ఎకరాలకు పైగా ప్రభుత్వభూమే ఉండటం ఇప్పుడు మరో వివాదానికి దారితీస్తోంది.

అన్నదమ్ముల పేరున అనుమతి
2013 జూన్‌లో ఆర్‌.పి.భంజ్‌దేవ్‌తో పాటు ఆయన సోదరులు పాచిపెంట మండలంలోని విశ్వనాథపురం, పణుకువలస రెవెన్యూ గ్రామాల పరిధి లోని భూముల్లో చేపల చెరువు నిర్మాణానికి మత్స్యశాఖ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మాజీ ఎమ్మెల్యే ఆర్‌.పి.భంజ్‌దేవ్‌ విశ్వనాథపురం రెవెన్యూ పరిధి లోని సర్వే నంబరు 14–2లో 15ఎకరాల భూమి లో చేపల చెరువు నిర్మాణానికి, ఆయన సోదరుడైన జితేంద్ర ప్రతాప్‌ భంజ్‌దేవ్‌ అదే సర్వే నంబ రు గల భూమిలో మరో 10ఎకరాల 46సెంట్లలో చేపల చెరువు తవ్వించుకునేందుకు దరఖాస్తు చేశారు. జూన్‌ 2015 నుంచి జూన్‌ 2021 వరకు చేపల సాగుకు అనుమతి లభించడంతో దాదాపు 40 ఎకరాల్లో చేపల చెరువు ప్రస్తుతం సాగుచేస్తున్నారు. అయితే వారు దరఖాస్తు చేపలసాగు చేస్తున్న చెరువులో 25 ఎకరాల 46సెంట్ల భూమి ప్రభుత్వానిది(ఇనాం భూమి)గా రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో వుండడం విశేషం.

అన్నింటా ఉల్లంఘనే...
భంజ్‌దేవ్‌ చేపల చెరువు వ్యవహారానికి సంబం ధించి అన్నింటా నిబంధనలు ఉల్లంఘించినట్టు స్పష్టమౌతోంది. సాధారణ భూమిని చేపల చెరువుగా మార్చాలంటే స్థానిక రెవెన్యూ డివిజినల్‌ అధికారి కన్వర్షన్‌కు అనుమతులివ్వాలి. సర్వే నం బరు 14–2లో మొత్తం 25ఎకరాల 46సెంట్ల  ప్రభు త్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా చూపుతుంటే ఎలా అనుమతులిచ్చారన్నది ప్రశ్న. అంతేగాకుండా 2015లో అదే సర్వే నంబరుగల ప్రభుత్వ భూమిలో చేపల చెరువు నిర్మిస్తే రెవెన్యూ అధికారులు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది మరో ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తయితే 2015లో ప్రభుత్వం జరిపిన రైతు రుణమాఫీ ద్వారా ఆ సర్వే నంబరుగల భూమితోపాటు ఇంకొంత భూమిపై రూ. లక్షా 50వేలు రుణమాఫీ జరిగింది. ఆ మొత్తాన్ని బ్యాంకు అధికారులు చెల్లించే సమయంలో రెవెన్యూ అధికారులు ఎందుకు అడ్డుకోలేదన్నది మరో ప్రశ్న. 

రెవెన్యూ రికార్డులు ఆన్‌లైన్‌ చేసినా..?:
భంజ్‌దేవ్‌ 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చేపల చెరువు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకి లేకుండా చేసుకున్నారన్నది రాజకీయ ప్రత్యర్థుల వాదన. రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించిన నేపథ్యంలో 14–2 సర్వే నంబరుగల భూమి, ప్రభుత్వానిదేనని తేటతెల్లం చేస్తోంది. అదే నిజమైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి, చేపలచెరువును నిర్మిస్తే రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాచిపెంట రెవెన్యూ అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూమిలో భంజ్‌దేవ్‌ చేపలసాగు చేపడుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు.

రెవెన్యూ రికార్డుల్లో తప్పుపడి ఉండొచ్చు
మా కుటుంబ సభ్యులం ల్యాండ్‌ సీలింగ్‌ సమయంలో చాలా భూములు కోల్పోవలసి వచ్చింది. అలాంటి మాకు ప్రభుత్వభూమిని ఆక్రమించుకుని చేపలసాగు చేయాల్సిన అవసరం లేదు. ఆ భూమిని మా తాత, తండ్రుల కాలం నుండి సాగుచేస్తున్నాం. రెవెన్యూ రికార్డుల్లో తప్పుపడివుంటే సరిచేయమని రెవెన్యూ అధికారులను కోరతాం.
– ఆర్‌పీ భంజ్‌దేవ్, మాజీ ఎమ్మెల్యే, సాలూరు 

కులాన్నే కాదు, పొలాన్నీ వదలం
మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేపల చెరువును నిర్మించుకున్నారు. వాటికి సంబంధించిన రెవెన్యూ రికార్డులన్నీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సర్వే నంబరు 14–2 ప్రభుత్వభూమి. ఆ భూమి మరలా ప్రభుత్వానికి చెందేవరకు పోరాడుతాం. ఆయన కులం విషయంలో గిరిజనుడు కాకపోయినా ప్రభుత్వం అడ్డగోలుగా జీఓ జారీచేసింది. ఇప్పుడేమో పొలం విషయంలో రెవెన్యూ అధికారులు స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తాం.
– రేగు మహేశ్వరరావు, జనసేన నాయకుడు, న్యాయవాది. 

వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగానే ఉంది
సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌లో అలోక్‌నారాయణ్‌ పురుషోత్తమ్‌ భంజ్‌దేవ్‌ పేరుతో ఆ భూమి నమోదై ఉంది. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం ప్రభుత్వ భూమిగానే చూపిస్తోంది. వెబ్‌ల్యాండ్‌లో తప్పు పడి ఉండవచ్చు.
– కుప్పిలి నాగేశ్వరరావు, పాచిపెంట మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

సర్వే నంబరు 14–2లో చేపలచెరువు నిర్మాణానికి భంజ్‌దేవ్‌ చేసిన దరఖాస్తు సర్వే నంబరు 14–2 ప్రభుత్వభూమిగా చూపుతున్న అడంగల్‌కాపీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement