వెలగపూడి బ్యాచ్‌ ఓవర్‌ యాక్షన్‌ | TDP Leaders Over Action At Inauguration Of Hudhud Houses | Sakshi
Sakshi News home page

వెలగపూడి బ్యాచ్‌ ఓవర్‌ యాక్షన్‌

Published Sat, Aug 24 2019 6:49 AM | Last Updated on Sat, Aug 24 2019 7:48 PM

TDP Leaders Over Action At Inauguration Of Hudhud Houses - Sakshi

ఇళ్ల ప్రారంభోత్సవ సమయంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట

ఎప్పుడో హుద్‌ హుద్‌ బాధితులకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణంలో.. లబ్ధిదారుల ఎంపికలో.. కాలనీ ప్రారంభోత్సవంలో ఐదేళ్లు సాచివేత ధోరణి అనుసరించిన తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి.. ఆయన అనుచరగణం పట్టాభిరామ్‌ తదితరులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రారంభోత్సవాన్ని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎంవీపీ కాలనీలో శుక్రవారం జరిగిన ఈ ప్రభుత్వ కార్యక్రమానికి ఎమ్మెల్యేగా వెలగపూడి ఫ్లెక్సీ పెట్టడం వరకు తప్పులేదు.. కానీ అక్కడి టీడీపీ బ్యాచ్‌ పార్టీ నాయకుడు పట్టాభిరామ్‌తోపాటు టీడీపీ ఫ్లెక్సీలు పెట్టి వివాదానికి తెర తీశారు.

అభ్యంతరం చెప్పిన వైఎస్సార్‌సీపీ నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దుర్భాషలాడారు. పైగా ఎమ్మెల్యేను హౌసింగ్‌ బోర్డు అధికారులు ఆహ్వానిచినా.. పిలవలేదని తప్పుడు ఆరోపణలతో ప్రొటోకాల్‌ వివాదం రేపడానికి ప్రయత్నించారు. మంత్రి ముత్తంశెట్టి తదితరులు పాల్గొన్న ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు.

సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): ఎంతో ఆర్భాటంగా జరగాల్సిన హుద్‌హుద్‌ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గ్యాంగ్‌ రగడ చేసింది. గత ఐదేళ్లలో పట్టించుకోని వెలగపూడి.. ఇప్పుడు లబ్ధి పొందాలని హడావుడి చేశారు. హుద్‌హుద్‌ తుపాను బాధితులకు ఎంవీపీ కాలనీలో కట్టిన ఇళ్లను ప్రారంభించకుండా ఐదేళ్ల పాటు తాత్సారం చేశారు. ఈ కేటాయింపుల్లోనూ పక్షపాతంగా వ్యవహరించారనే ఆరోపణలు ఆది నుంచి ఉన్నాయి. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు వీటిని త్వరితగతిన కేటాయించాలనే లక్ష్యంతో ముందుకు సాగింది. హౌసింగ్‌ బోర్డుపై ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు ఇళ్ల ప్రారంభోత్సవానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎంవీపీ కాలనీ సెక్టార్‌–7లో నిర్మించిన హుద్‌హుద్‌ ఇళ్లను ప్రారంభించేందుకు హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే వెలగపూడితో పాటు టీడీపీ నగర కార్యదర్శి పట్టాభిరామ్‌ తదితరులు వచ్చి దౌర్జన్యానికి దిగారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెలగపూడి త్రయం ఫ్లెక్సీల లొల్లి..
హుద్‌హుద్‌ ఇళ్లు ప్రారంభం సందర్భంగా మంత్రి అవంతితో పాటు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుల ఫ్లెక్సీలు ఎంవీపీ కాలనీ సెక్టార్‌–7లో ప్రదర్శించారు. అక్కడికి వచ్చిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వెలగపూడి ఫ్లెక్సీతో పాటు ఆ పార్టీ నగర కార్యదర్శి పట్టాభిరామ్‌ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టాభి ఫ్లెక్సీ ఎలా పెడతారని ప్రశ్నించారు. దీంతో అధికారులు పట్టాభిరామ్‌ ఫ్లెక్సీని తొలగించారు. అనంతరం మంత్రి ఇళ్లను ప్రారంభించేందుకు ప్రయత్నించగా మరోసారి పట్టాభిరామ్‌ వాగ్వాదానికి దిగారు. పక్కకు వెళ్లిపోవాలంటూ వైఎస్సార్‌సీపీ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల భర్త వెంకటరావు కలుగజేసుకొని దురుసు ప్రవర్తన మానుకోవాలని పట్టాభికి సూచించినా ఆయన వినలేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తోపులాట చోటుచేసుకుంది. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను వారించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఆహ్వానం అందలేదంటూ హల్‌చల్‌..
ఎమ్మెల్యే వెలగపూడికి ఆహ్వానం అందలేదంటూ టీడీపీ శ్రేణులు వెల్లడించడాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు తప్పుపట్టారు. గత ఐదేళ్లలో ఇళ్ల ప్రారంభోత్సవాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడెందుకు హల్‌చల్‌ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్‌ వంశీకృష్ణ మండిపడ్డారు. టీడీపీ హయాంలో చేసిన దౌర్జన్యాలు, అరచకాలు తమ ప్రభుత్వంలో కొనసాగించాలని చూస్తూ తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. హుద్‌ హుద్‌ ఇళ్ల కేటాయింపుల్లో వెలగపూడి నిబంధనలకు పాతర వేశారని వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విజయనిర్మల దుయ్యబట్టారు. ఆ అక్రమ కేటాయింపులను బయటకు తీస్తామని హెచ్చరించారు. అనంతరం మంత్రి అవంతి కార్యకర్తలు, అధికారుల సమక్షంలో హుద్‌హుద్‌ ఇళ్లును ప్రారంభించారు. 

ప్రొటోకాల్‌ పాటించాం..
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రొటోకాల్‌ పాటించాం. ముందుగానే హౌసింగ్‌ బోర్డు తరఫున ఎమ్మెల్యే వెలగపూడిని ఆహ్వానించాం. నేను స్వయంగా ఫోన్‌ చేసి కూడా ఆహ్వానించాను. ఆహ్వానించలేదని చెప్పడం అవాస్తవం. మంత్రి, ఎంపీల అనంతరం ఎమ్మెల్యే పేరు శిలాఫలకంపై వేయించాం. అయితే ఆయన సభాధ్యక్షుడిగా తన పేరు ముందుండాలని అన్నారు. అయితే అక్కడ ఎలాంటి సభ తాము నిర్వహించలేదు. ఎంవీపీలో మొత్తం 96 హుద్‌హుద్‌ ఇళ్లు నిర్మించాం. ఇందులో 75 కేటాయింపులు మాత్రమే ఇప్పటి వరకు జరిగాయి. మిగిలిన కేటాయింపులపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో నిలిపివేశాం. జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు మిగతా ఇళ్ల కేటాయింపులు చేపడతాం. – చిన్మయ్యాచారి, పీడీ, హౌసింగ్‌ బోర్డు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement