టీడీపీలో రెవెన్యూ బదిలీల చిచ్చు
విశాఖపట్నంపై పట్టు సాధించాలన్న టీడీపీ పెద్దల వ్యూహం అధికార పార్టీలో ఆధిపత్య పోరుకు దారితీస్తోంది. భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న ఇతర జిల్లాల మంత్రులు, సీఎం చంద్రబాబు పేషీ పెద్దలు వ్యూహరచన బెడిసికొట్టింది. జిల్లాలో ఆర్డీవోల బదిలీ అధికార టీడీపీలో చిచ్చు రాజేసింది. ఇతర జిల్లాల మంత్రులు, సీఎం పేషీలోచక్రం తిప్పుతున్న పెద్దల అభిమతానికి అనుగుణంగా జరిగిన ఈ బదిలీలపై విశాఖ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆర్డీవోల బదిలీల్లో తమ జిల్లాపై ఇతర జిల్లాల మంత్రులు, సీఎంపేషీలోని షాడో నేతలు పెత్తనమేమిటని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన అనుకూల ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. ప్రధానంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమ, రావెల కిషోర్‌బాబు, యనమల రామకృష్ణుడుల తీరుపై మండిపడినట్లు తెలుస్తోంది. ఇక పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి ఏకంగా రాజీనామాకు సిద్ధపడటంతో పరిస్థితి తీవ్రరూపు సంతరించుకుంది. పరిస్థితి చేయిదాటేట్లు కనిపించడంతో ఆర్డీవోల బదిలీలపై ప్రభుత్వం వెనక్కితగ్గాలని నిర్ణయించుకుంది. కొత్త ఆర్డీవోలను జాయిన్ చేసుకోవద్దని కలెక్టర్‌ను మౌఖికంగా ఆదేశించింది.
పట్టు కోసం...
నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా భావిస్తున్న జిల్లాపై పట్టుకోసం టీడీపీ పెద్దలు సిగపట్లు పడుతున్నారు. జిల్లాలో పెట్రోకారిడార్, సెజ్‌లు, ఇతర ప్రాజెక్టులకు భారీస్థాయిలో భూసేకరణ చేపట్టనున్నారు. భూకేటాయింపులపై టీడీపీ పెద్దల సన్నిహితులు కన్నేశారు. అందుకే కీలకమైన రెవెన్యూ పోస్టుల్లో తమ సన్నిహితులు ఉండాలని ఆర్డీవో బదిలీలను మార్గంగా చేసుకుంటున్నారు. అందుకోసం ఇతర జిల్లాల మంత్రులు, సీఎంపేషీ పెద్దలు ఓవర్గంగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు మరోవర్గంగా ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు.
ఆర్డీవోల నియామకానికి సంబంధించి జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు కొందరి పేర్లను సూచించారు. బుధవారం రాత్రి ఆర్డీవోల బదిలీ జాబితాతో వారు కంగుతిన్నారు. విశాఖ ఆర్డీవోగా ఉన్న వెంకట మురళి, అనకాపల్లి ఆర్డీవో ఎస్.ఎన్.వి.బి. వాసుదేవరాయుడులను ప్రభుత్వం బదిలీ చేసింది. వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా హైదరాబాద్‌లో రిపోర్టు చేయమన్నారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న వై. రామచంద్రారెడ్డిని విశాఖ ఆర్డీవోగా బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న బి.పద్మావతిని అనకాపల్లి ఆర్డీవోగా నియమించింది. మంత్రి గంటా, టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయానికి విరుద్ధంగా ఆర్డీవోలను బదిలీ చేసింది. మరోవైపు నర్సీపట్నం ఆర్డీవో విషయంలో మంత్రి అయ్యన్నపాత్రుడి మాట చెల్లుబాటైంది. ఆయన సూచనలమేరకు ప్రస్తుత ఆర్డీవో సూర్యారావును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇతర జిల్లా మంత్రుల పెత్తనం
ఆర్డీవోల బదిలీ వెనుక ఇతర జిల్లాల మంత్రులు చక్రం తిప్పారు. ఆర్డీవో నియామకంలో మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని నెహ్రూ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్‌బాబు అభీష్టం మేరకు అనకాపల్లి కొత్త ఆర్డీవోను నియమించారని సమాచారం. సీఎం పేషీలోనే చక్రం తిప్పి ఆ నలుగురు మంత్రులు తాము కోరుకున్నవారికి జిల్లాలో పోస్టింగులు వేయించుకున్నారు. దీనికి నారా లోకేష్ సన్నిహితుల ఆశీస్సులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అందుకే జిల్లా మంత్రులు సూచించినవారిని కాకుండా కనీసం వారికి సమాచారం లేకుండానే ఆర్డీవోలను నియమించారు.
భగ్గుమన్న విశాఖ నేతలు...
ఆర్డీవోల బదిలీల వ్యవహారం బెడిసికొట్టింది. గంటా శ్రీనివాసరావు, ఆయన వర్గీయులైన అనకాపల్లి ఎంపీ అవంతీ శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి తీవ్రస్థాయిలో స్పందించారు. జిల్లాపై ఇతర జిల్లాల మంత్రుల పెత్తనమేమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి తాను రాజీనామాకు వెనుకాడేది లేదని చెప్పడం గమనార్హం. ఆర్డీవో పోస్టింగే కాదు కనీసం తహశీల్దార్ పోస్టింగులను కూడా ఇతర జిల్లాల మంత్రులే నిర్ణయిస్తే ఇక తామెందుకు పదవుల్లో కొనసాగడమని ఆయన ప్రశ్నించారు. ఆయన్ని మంత్రి గంటా అనునయించారు. పరిస్థితి చేయిదాటేట్లుగా ఉండటంతో సీఎం కార్యాలయ అధికారులు సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు సమాచారం అందించారు.
దాంతో ప్రస్తుతానికి ఆర్డీవోల బదిలీలను నిలుపుదల చేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఆర్డీవోగా నియమితులైన వై.రామచంద్రారెడ్డిని బాధ్యతలు స్వీకరించవద్దని చెప్పారు. ఆయన బాధ్యతలు స్వీకరించేందుకు కలెక్టర్ యువరాజ్‌ను గురువారం ఉదయం కలిశారు. ఆయన్ను జాయిన్ చేసుకోవాలని తమకు ఆదేశాలు రాలేదని కలెక్టర్ ఆయనతో చెప్పడం గమనార్హం. మరోవైపు హైదరాబాద్‌లో రిపోర్టు చేయమని ఆదేశాలు వచ్చినప్పటికీ వెంకటమురళి విశాఖ ఆర్డీవోగా గురువారం విధులకు హాజరయ్యారు. అనకాపల్లి ఆర్డీవోగా ఉంటూ బదిలీ అయిన వసంతరాయుడు కూడా విధుల నుంచి రిలీవ్ కాలేదు. ఆయన గురువారం విధులు నిర్వర్తించారు. మంత్రి గంటా, ఎమ్మెల్యేల ఒత్తిడికి ప్రభుత్వం వెనక్కితగ్గినట్లే కనిపిస్తోంది. ఈ బదిలీలపై తుది నిర్ణయం ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది.