పంట సంజీవని ‘పచ్చ’ తమ్ముళ్లకు వరాలిచ్చింది. కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసిన పరికరాలు నేతల ఇళ్లలో సిరుల వర్షం కురిపించాయి. రైతుల ప్రయోజనాలను గాలికొదిలి ఏకంగా సొంత ఆస్తిలా అమ్ముకున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అప్పట్లో టీడీపీ అధికార పార్టీ కావడంతో అధికారులు కూడా నోరు తెరవలేని పరిస్థితి. ఇప్పుడు డొంక కదులుతోంది. ఖరీఫ్ సీజన్ కావడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రెయిన్‌గన్లు ఎక్కడని వ్యవసాయాధికారులను ప్రశ్నిస్తే.. మౌనమే సమాధానమవుతోంది.
సాక్షి, అనంతపురం : వరుణదేవుడు కరుణించకపోయినా పంటలను కాపాడుతామని గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెయిన్‌గన్‌లను తెరపైకి తీసుకొచ్చారు. 2016లో వీటిని ప్రారంభించారు. ఆ ఏడాది దాదాపు 15.15లక్షల ఎకరాల్లో పంటసాగైతే మొత్తం పంట ఎండిపోయింది. ఆ సందర్భంగా బాబు నాలుగురోజులు జిల్లాలోనే తిష్టవేసి పంటను కాపాడినట్లు మసిపూసి మారేడుకాయ చేశారు. ఏకంగా సీఎం తరలిరావడంతో బెంబేలెత్తిన అధికారులు రెయిన్‌గన్లను ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు. అయినప్పటికీ ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారు. దీంతో వీటివల్ల ఉపయోగం లేదని తేల్చారు. ఇది ఓ విఫలప్రయత్నం అని, రెయిన్‌గన్‌లతో చెడ్డపేరు తప్ప మరొకటి లేదని గ్రహించిన ప్రభుత్వం వాటి ఊసెత్తడమే మరిచింది.
ఇక అధికారులు కూడా ఆ తంతు ముగిసనట్లేనని భావించి పరికరాల రికవరీని పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మంత్రి శంకరనారాయణ ఇటీవల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి రెయిన్‌గన్ల ప్రస్తావన తీసుకొచ్చారు. పరికరాలు ఎక్కడని జేడీని ప్రశ్నించారు. అందుకాయన రైతుల వద్దే ఉన్నాయని చెప్పలేక చెప్పారు. అవి ప్రభుత్వానివా? ప్రయివేటువా? కార్యాలయాల్లో ఎందుకు లేవు? అని తిరిగి ఎమ్మెల్యే ప్రశ్నించడంతో జేడీఏ నుంచి సమాధానం కరువైంది. ఈ నేపథ్యంలో రెయిన్‌గన్లు ఎక్కడనే విషయమై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే 30 శాతం కూడా అధికారుల వద్ద లేవని తేలింది. 70 శాతం పైగా పరికరాలను రైతుల పేరుతో టీడీపీ నేతలు విక్రయించి సొమ్ము చేసుకోవడం గమనార్హం.
అధికారుల ఉరుకులు పరుగులు
అధికారపార్టీ ఎమ్మెల్యేలు వీటి ప్రస్తావన తేవడంతో వ్యవసాయాధికారులు రికవరీపై దృష్టి సారించారు. నాలుగురోజుల్లో రెయిన్‌గన్‌లపై పూర్తి వివరాలు కావాలని ఏఓలు, ఏడీలను జేడీ హబీబ్‌బాషా ఆదేశించారు. అయితే అధికారులంతా బదిలీల్లో తలమునకలై ఉన్నారు. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకునే పరిస్థితి కరువైంది. రికవరీ కాకపోతే కొత్త ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు. దీంతో బాధ్యులైన టీడీపీ నేతలను తేల్చి, అవసరమైతే వారిపై కేసులు నమోదు చేసి రికవరీ చేసే యోచనలో వ్యవసాయాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ రెయిన్‌గన్ల పరిస్థితి
జిల్లా వ్యాప్తంగా 6,426 రెయిన్‌గన్లు, 5,894 స్ప్రింక్లర్లు, 4,17,000 పైపులు, 4478 ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేశారు. వీటిని రూ.69.79కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే వీటిలో ఏడాదికే 20శాతం రెయిన్‌గన్లు ఆచూకీ లేకుండా పోయాయి. 2019 ఖరీఫ్ వచ్చే సమయానికి వీటిలో 30శాతం కూడా లేని పరిస్థితి. రెయిన్‌గన్‌లు రైతులు తీసుకున్న తర్వాత పనిముగించుకుని మరో రైతుకు ఇచ్చారు. ఆ రైతు ఇంకో రైతుకు ఇచ్చారు. ఇలా రెయిన్‌గన్లు చేతులు మారాయి. ఈ ప్రక్రియ ఆయా గ్రామాల్లోని స్థానిక అధికారపార్టీ నేతల కనుసన్నల్లో సాగింది. వారివద్దకు వెళ్లిన వారికే రెయిన్‌గన్‌లు ఇచ్చారు. ఆ తర్వాత రైతులు తిరిగి అధికారపార్టీ నేతలకు అప్పగించారు. టీడీపీ నేతల వద్ద రెయిన్‌గన్‌లు ఉన్నట్లు వ్యవసాయాధికారుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు.
దీంతో వీటిని అధికారపార్టీ నేతలు కర్ణాటక రైతులకు విక్రయించారు. ఈ విషయం అప్పట్లో పత్రికల్లో ప్రచురితమైంది. అప్పటికి మేల్కొన్న అధికారులు రికవరీపై దృష్టి సారించారు. ఏఓలు, ఎంపీఈఓలను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపగా.. మెజార్టీ పరికరాలు రైతుల వద్ద లేవని, అధికారపార్టీ నేతల ఇళ్లలోనే ఉన్నాయనే విషయం వెల్లడైంది. కొందరు నేతలు పరికరాలు ఇచ్చేయగా.. ఇంకొందరు అతిబలవంతంగా పగిలిపోయిన పైపులు, ప్రభుత్వం పంపిణీ చేసిన పైపులు కాకుండా వేరే పైపులు, పనిచేయకుండా తుక్కుగా మారిన ఆయిల్ ఇంజన్లను చేతుల్లో పెట్టి పంపారు. ఆ మేరకు అతికష్టం మీద కొన్ని రికవరీ అయ్యాయి. తర్వాత ఏడాది కూడా ప్రణాళిక లేకుండా పంపిణీ జరిగింది. అంతే ఇక రెయిన్‌గన్లు జాడ లేకుండాపోయాయి. రాప్తాడు, తాడిపత్రి, కదిరి, కళ్యాణదుర్గం, ధర్మవరం, మడకశిర, రాయదుర్గం నియోజకవర్గాల్లో అధికంగా రికవరీ కావల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment