పైపుల్లో నుంచి నది మధ్యలోకి ఇసుక చేరవేసిన దృశ్యం
తుళ్లూరు: ఒక ప్లాన్ విఫలమైతే మరొకటి..! పథకం ఏదైనా అంతిమ లక్ష్యం అందినకాడికి కాజేయడమే. రాజధాని ప్రాంతంలో టీడీపీ పెద్దల అనుచరుడైన ఓ బడాబాబు గతేడాది ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెంలో రూ.500 కోట్ల విలువ చేసే లంక భూములను ఆక్రమించుకునేందుకు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టడంతో కొన్నాళ్లు వెనక్కి తగ్గినా ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. కృష్ణా నదిలో ఆక్రమించుకున్న ప్రాంతంలో కృత్రిమ ఇసుక దిబ్బలను సృష్టించి అందులో ఓ దీవి, రిసార్టులు నిర్మించి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
ముఖ్యమంత్రి మద్దతుతోనే ఆక్రమణలు
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామం రెవెన్యూ పరిధి 1/ఏ సర్వే నంబరుతోపాటు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గుంటుపల్లి పరిధిలో 395 సర్వే నంబరులో నది మధ్యలో ఉన్న 70 ఎకరాల భూమిని అధికార పార్టీ నేతలు దర్జాగా ఆక్రమించారు. కృష్ణా పరీవాహక ప్రాంతమైన తాళ్లాయిపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తుమ్మలపాలెం, గుంటుపల్లి మధ్య కృష్ణా నదిలో 2017లోనే కబ్జాదారులు కంచె వేశారు. ఈ ప్రాంతం రాజధాని స్టార్టప్ ఏరియాకు సమీపంలో ఉండడంతో రానున్న రోజుల్లో దీని విలువ ఆకాశాన్నంటే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఎకరా భూమి రూ.2 కోట్లు వరకు ఉండగా భవిష్యత్తులో సుమారు రూ.25 కోట్లు పలుకుతుందని అంచనా. ఇందులో రిసార్టులు, మల్టీఫ్లెక్స్‌లు, పబ్బులు, క్లబ్బులు నిర్మించి సొమ్ము చేసుకోవాలనేది టీడీపీ నేతల లక్ష్యం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మద్దతుతోనే ఈ ఆక్రమణలు జరిగినట్టు తెలుస్తోంది. సుమారు 40 అడుగుల లోతు ఉన్న నదిలో ఇసుకను నింపి దిబ్బగా సృష్టించడానికి రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆక్రమణ వ్యూహం అమలు చేయడానికి గజ ఈతగాళ్లను రంగంలోకి దించి ఇనుముతో తయారు చేసిన రోప్‌ను నీటిలో వదిలారు. రోప్‌లకు ప్లాస్టిక్‌తో తయారు చేసిన డబ్బాలను అమర్చి ఆ ప్రాంతం తమదేనంటూ జెండాలు పాతారు. మత్స్యకారులను అటువైపు వేటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
పైపులైన్లతో ఆక్రమిత ప్రాంతంలోకి ఇసుక తరలింపు..
ఆక్రమించుకున్న 70 ఎకరాల్లో దాదాపు 40 అడుగుల లోతులో ఉన్న నదీ ప్రాంతాన్ని ఇసుక దిబ్బగా మార్చడానికి టీడీపీ నేతలు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. పెద్దపెద్ద డ్రెడ్జర్ల ద్వారా పైపు లైన్లు ఏర్పాటు చేసి ఇసుక నేరుగా ఆక్రమిత నదీ ప్రాంతంలోకి చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆక్రమిత ప్రాంతంలోకి పైపుల ద్వారా చేరవేసిన ఇసుకను ప్రొక్లెయిన్ల ద్వారా సరి చేస్తున్నారు. అక్కడ నీటిని నదిలోకి మళ్లిస్తున్నారు. 40 అడుగుల లోతులో ఉన్న నదీ ప్రవాహాన్ని తట్టుకునేలా కృత్రిమ ఇసుక దిబ్బలను సృష్టించారంటే కృష్ణమ్మ గర్భంలో పాగా వేయడానికి ఎంత బరితెగించారో ఊహించవచ్చు. ఈ ప్రాంతం సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నివాసానికి, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా నివాసానికి మధ్యలో ఉండడం గమనార్హం. నదీ ప్రవాహాన్ని మళ్లించడం వల్ల వరదలు వస్తే ఒత్తిడి పెరిగి కరకట్టలు తెగి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమిత నదీ ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, తుళ్లూరు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు.
అధికారులు ఏం చేస్తున్నట్టు?
టీడీపీకి చెందిన దొంగల ముఠా ఏకంగా కృష్ణా నదినే ఆక్రమించేస్తే అధికారులు ఏం చేస్తున్నారు? రెండేళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తోందంటే ఇదంతా వారి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా కూడా విధించింది. నదీ ప్రవాహాన్ని మళ్లించడం, పూడ్చడం, డ్రెడ్జింగ్ చట్ట రీత్యా నేరం. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి.
– ఉండవల్లి శ్రీదేవి (వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి)
సుమోటోగా విచారణ చేపట్టాలి...
భూములు, కొండలను కబ్జా చేసిన టీడీపీ నేతలు నదులను కూడా అక్రమించేశారు. రాజధాని పేరుతో బంగారు పంటలు పండే భూములను ఇప్పటికే నాశనం చేశారు. ఇప్పుడు రిసార్టులు, ఐలాండ్‌ల కోసమని నదినే పూడ్చేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టారంటే దీని వెనుక సీఎం చంద్రబాబు హస్తం కచ్చితంగా ఉంటుంది. దీనిపై సుమోటోగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. మా పార్టీ తరపున కోర్టులో కూడా పోరాడతాం.
– నందిగం సురేష్ (వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి)
Comments
Please login to add a commentAdd a comment