అవునంటే.. కాదంటారు!!
అధికారుల బదిలీల విషయంలో తెలుగుదేశం నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఒకరు అవునంటే.. మరొకరు కాదంటున్నారు. లోపాయికారీ ఒప్పందాలతో ఎటూ తేలని పరిస్థితి నెలకొంది. దీంతో అందరిలో ఒకటే చర్చ మొదలైంది. నాడు అంత హడావుడి చేసిన నాయకులంతా ఇప్పుడెందుకు మాట్లాడటం లేదన్న విషయం చర్చనీయూంశమైంది. అయితేనేం తమకు ఇబ్బంది ఉండదని అధికారులు ఆనందంగా ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అధికారంలోకి రాగానే మండల స్థాయి అధికారు ల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మార్చేయాలని, కాంగ్రెస్ నేతలకు వంతపాడిన అధికారులను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని టీడీపీ నేతలు కొద్ది నెలల కిందట నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే సమావేశాల్లో అధికారులపై అంతెత్తుకు లేచేవా రు. కాస్త గట్టిగానే మాట్లాడేవారు. ఇంకేముంది తామం టే ఇష్టం లేకనే అధికార పార్టీ నేతలు అసహనంగా చూస్తున్నారని అధికారులు కూడా ఆలోచనకొచ్చారు. బదిలీ ఖాయమని భావించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా బదిలీల జీఓ ఇచ్చింది. తమకనుకూలంగా బదిలీలు చేసుకునేలా అవకాశాన్ని కల్పించింది. దీంతో దాదాపు బదిలీలు తప్పవని అధికారులంతా అనుకున్నారు. ఇంతలోనే పలువురు టీడీపీ నేతల బలహీనతలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. వారు చెప్పినట్టు
నడుచుకుంటే, వారి ఆశించినట్టు చేతులు కలిపి వెళ్లిపోతే ఇబ్బందేముండదనే విషయం ప్రచారంలోకి వచ్చింది. దీంతో సంపాదనే యావగా పని చేస్తున్న నేతలను అధికారులు కలుస్తున్నారు. లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. బదిలీలు జరగకుండా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఉన్నచోటే కొనసాగించాలని సిఫార్సు, అంగీకార లేఖలిస్తున్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా అధికారులు తమ ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు.మరోవైపు ఈ విషయం తెలియని కొందరు నేతలు తమకు అనుకూల అధికారులను తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. అందుకు తగ్గట్టుగా వారు కూడా లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి.
కొంతమంది నేతలైతే ఇతర జిల్లాల్లో పని చేస్తున్న తమ బంధువులను కూడా తీసుకురావాలని తెగ ప్రయత్నిస్తున్నారు. వారే అధికారులైతే పనులు సులువుగా చేసుకోవచ్చని ఆశిస్తున్నారు. ఈ విధమైన పరిస్థితుల మధ్య సంబంధిత అధికారులకు పోస్టింగ్ వచ్చేలా అంతా తామే చూసుకుంటామని భరోసా ఇవ్వడమే కాకుండా సిఫార్సుల లేఖలు ఇస్తున్నారు. దీంతో ఇక్కడికొద్దామనుకున్న అధికారులంతా మూటాముళ్లు సర్దుకుని సిద్ధమవుతున్నారు. ఈ విధంగా అటు ఆసక్తి ఉన్న అధికారులు, ఇటు తిష్ట వేద్దామనుకున్న అధికారులు చెరో వైపు ప్రయత్నిస్తున్నారు. డబ్బులు భారీగా ముట్టజెప్పుతున్నారు. చెప్పాలంటే ఒకరి ప్రయత్నానికి మరొకరు చెక్ పెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
ఇలా రెండు వైపులా నుంచి చెరో అభిప్రాయంతో సిఫార్సుల లేఖలు రావడంతో ఉన్నతాధికారులు తేల్చుకోలేకపోతున్నారు. సంబంధిత మంత్రులు కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. రెవెన్యూ, డీఆర్‌డీఏ, డ్వామా, జిల్లా పరిషత్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖల్లో పలు కీలక పోస్టులపై ఈ రకమైన సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వమిచ్చిన బదిలీల జీఓతో దాదాపు బదిలీ ఖాయమనుకున్న సందర్భంలో టీడీపీ నేతలు అనుసరిస్తున్న తీరుతో అధికారులకు కాసింత ఉపశమనం కలుగుతోంది.
పార్టీ వర్గాల్లో విసృ్తత చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు అంతా ఇంతా అని... అంతు చూస్తామని గాంభీర్యం ప్రదర్శించిన నేతల్లో ఒక్కసారిగా స్వరం మారడంతో బదిలీల తంతులో వేలి పెట్టని నేతలంతా గుసగుసలాడుకుంటున్నారు. మనోళ్లని మేనేజ్ చేయగలిగితే నిన్న తప్పు అనుకున్న వారంతా నేడు ఒప్పు అయిపోతారని చర్చించుకుంటున్నారు. చెప్పాలంటే బదిలీల సీజన్ మన నేతలకు పండుగలా వచ్చిందని, అధికారుల తాపత్రయం వరంగా మారిందని చెవులు కొరుక్కొం టున్నారు. వాళ్లు అనుకుంటున్నారని కాదుగాని ప్రస్తుత పరి స్థితులు కూడా అందుకు తగ్గట్టుగానే కన్పిస్తున్నాయి.