
టీడీపీలో ఫ్లెక్సీల ‘మంట’
దగ్గుబాటిని సొంతగూటికి ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావును తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం పరిధిలో ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిని చూసి టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. ఫ్లెక్సీలను చింపివేసి, తగులబెట్టారు. ఈ బ్యానర్లు పర్చూరులో మూడు, మార్టూరులో మూడు, పెనమదలలో ఒకటి ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు తమకు సంబంధం లేదని టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏవీ కృష్ణారావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని తెలుసుకున్న దగ్గుబాటి, తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
దగ్గుబాటి దొంగచాటు వ్యవహారాలు చేస్తారని, ఆయన సహచరులే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి ఉంటారని మరికొందరు ఆరోపించారు. నారా లోకేష్‌తో కూడా ఇటీవల దగ్గుబాటి మంతనాలు సాగించినట్లు తెలిసిందని, ఆయన పార్టీలోకి వస్తే తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. కాగా, పర్చూరు నియోజకవర్గం ‘దేశం’ ఇన్‌చార్జి ఏలూరు సాంబశివరావు ఈ స్థానానికి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై దగ్గుబాటిని వివరణ కోరడానికి ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.