అక్రమ రవాణా గుట్టు రట్టు..! | TDP MLA Illegal granite quarrying In Guntur | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణా గుట్టు రట్టు..!

Published Sun, Oct 14 2018 1:48 PM | Last Updated on Sun, Oct 14 2018 1:48 PM

TDP MLA Illegal granite quarrying In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు  :   పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. ప్రకాశం జిల్లా నుంచి బిల్లులు లేకుండా తిరిగే గ్రానైట్‌ లారీలకు అధికార పార్టీ ఎమ్మెల్యే నేతృత్వంలో ఏర్పడిన ఓ బృందం అండగా నిలుస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా  రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా ఒక్కో లారీకి రూ.10వేలకు పైగా వసూలు చేస్తూ అక్రమ దందా నడుపుతున్నారు. అన్ని శాఖల అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టచెబుతూ వీటి జోలికి రాకుండా చేస్తున్నారు. గ్రానైట్‌ అక్రమ రవాణాపై మైనింగ్, పోలీసు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దాఖలాలు లేకుండా పోయాయి. దీంతో బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రెండు గ్రానైట్‌ లారీలను పిడుగురాళ్ళ వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులకు పట్టించారు. ఎటువంటి రాయల్టీ చెల్లించకుండా, జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో గండి పడుతున్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు ఎవరూ వారి జోలికి వెళ్లడం లేదు. గ్రానైట్‌ అక్రమ రవాణాపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించినప్పటికీ అధికారులు మాత్రం కళ్లు తెరవలేదు. అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్‌ లారీలను నిలిపి మైనింగ్, పోలీసు అధికారులకు ఫోన్‌లు చేసినా గంటన్నర వరకు ఎవరూ అక్కడకు రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలం పొందుగల వద్ద రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు ఉండటం, అధికార పార్టీ ఎమ్మెల్యేకు వరంగా మారింది. చెక్‌పోస్టు వద్ద ఉండే అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని  అక్రమ దందాకు పాల్పడుతున్న విషయం బహిరంగ రహస్యమే. ఏకంగా 20 మందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి గ్రానైట్‌ లారీల నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేస్తూ వాటికి ఎటువంటి బిల్లులు లేకపోయినా సరిహద్దు దాటిస్తూ దందా నడుపుతున్నారు. ఈ దందాపై అనేక సార్లు ‘సాక్షి’ కథనాలు ప్రచురించినప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం లేదు. మైనింగ్, పోలీసు అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ మామూళ్ల మత్తులో జోగుతున్నారు. 

రోజుకు రూ.కోటి ప్రభుత్వ ఆదాయానికి గండి
ప్రకాశం జిల్లా నుంచి వచ్చే గ్రానైట్‌ లారీలు ఎటువంటి బిల్లులు లేకుండా చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట మార్గంలో అద్దంకి – నార్కెట్‌పల్లి హైవే నుంచి పొందుగల చెక్‌పోస్టు దాటి తెలంగాణ రాష్ట్రంలోకి వెళతాయి.  ప్రకాశం జిల్లా నుంచి రోజుకు 30 లారీలు, సెలవు రోజుల్లో అయితే 60కు పైగా లారీలు సరిహద్దు చెక్‌పోస్టు దాటిపోతుంటాయి. వీటి ద్వారా ప్రతిరోజూ ప్రభుత్వానికి రూ.కోటికి పైగా ఆదాయం రావాల్సి ఉన్నప్పటికీ టీడీపీ నేత అక్రమ దందాతో ఖజానాకు రావాల్సిన సొమ్ము ఆయన జేబుల్లోకి మళ్లుతోంది. 

లారీలను పట్టిచ్చినా పట్టించుకోరా?
ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా గ్రానైట్‌తో వెళుతున్న రెండు లారీలను తుమ్మల చెరువు టోల్‌ప్లాజా, వీరాపురం వద్ద పిడుగురాళ్ళ జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి శనివారం తెల్లవారుజామున ఆపి అధికారులకు సమాచారం ఇచ్చారు. లారీలను నిలిపివేసిన గంటన్నర వరకు అటు మైనింగ్‌ అధికారులు గానీ, ఇటు పోలీసు అధికారులు గానీ, స్పందించని పరిస్థితి. దీంతో ఆయన ఉన్నతాధికారులకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో చివరకు కానిస్టేబుళ్లు వచ్చి లారీలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. జెడ్పీటీసీ రామిరెడ్డి స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినా శనివారం రాత్రి వరకు కేసు నమోదు చేయడం గానీ, పెనాల్టీ వేయడం గానీ చేయలేదు. అదేమని ప్రశ్నిస్తే ప్రకాశం జిల్లా నుంచి బిల్లులు తెస్తున్నారని, వాటిని పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటామంటూ అధికారులు చెబుతున్నారంటే వీరు ఏస్థాయిలో ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారో అర్ధమవుతోంది. 

వసూళ్ల దందా సాగుతోందిలా...
గ్రానైట్‌ లారీలు పల్నాడు ప్రాంతం దాటి రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లాలంటే తమ అనుమతి తప్పనిసరి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు హుకుం జారీ చేస్తున్నారు. లారీలో ఉన్న గ్రానైట్‌ టన్నేజ్‌ ఆధారంగా ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో 20 మంది యువకులను బృందంగా ఏర్పాటు చేసి  పిడుగురాళ్ళ నుంచి పొందుగల చెక్‌పోస్టు వరకు వారిని అక్కడక్కడ ఉంచి, ఎక్కడా గ్రానైట్‌ లారీలకు ఇబ్బంది కలుగకుండా చూసుకుంటారు. అధికారులు పొరపాటున ఆపితే వెంటనే ముఖ్యనేత నుంచి ఫోన్‌ చేయిస్తారు. వీరికి డబ్బు చెల్లించకుండా వెళ్లే లారీలను మాత్రం మైనింగ్‌ అధికారులకు సమాచారం ఇచ్చి వారిపై కేసులు నమోదు చేయిస్తారు.  

అక్రమ తరలింపులు సరికాదు
అవినీతి, అక్రమ దందా ఎక్కడ జరిగితే అక్కడే ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు  ఉంటాడు. అక్రమ మైనిం గ్, ఇసుక మాఫియా, గంజాయి అక్రమ రవాణా, పేకాటక్లబ్బులు, గ్రానైట్‌ అక్రమ రవాణా...ఇలా ఎందులోనైనా ఆయన ప్రమేయం లేకుండా ఏమీ జరగవనే విషయం అందరికి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పల్నాడు ప్రాంతాన్ని దోచేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ వందల కోట్ల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికారులు సైతం అక్రమ రవాణాకు సహకరించడం సరైన పద్ధతి కాదు. నేను లారీలను అడ్డుకుని అధికారులకు సమాచారం ఇచ్చినా సిబ్బంది లేరంటూ గంటన్నర వరకు ఎవరూ ఆవైపునకు రాలేదు. 
–జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement