అభివృద్ధికి నోచుకోని బీసీ కాలనీ, కొమ్మాలపాటి శ్రీధర్
సాక్షి, పెదకూరపాడు : ‘ఈ గ్రామవాసిగా పెదకూరపాడును దత్తత తీసుకుంటున్నా. గ్రామ దశ, దిశలు మారుస్తా. ఎక్కడా జరగని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా.. జన్మభూమి రుణం తీర్చుకుంటా’.. అంటూ పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన కొమ్మాలపాటి శ్రీధర్ హామీలు గుప్పించారు. అయితే ఆయన ఈ గ్రామానికి చేసింది మాత్రం శూన్యమని, సొమ్మొకరిది, సోకొకరిది అన్న చందంగా 13,14 ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో కాలనీలో రోడ్లు వేసి తన నిధులతో చేసినట్లు బీరాలు పలకడం మినహా ఒరగబెట్టింది ఏమీ లేదని గ్రామస్తులు ఎద్దేవాచేస్తున్నారు.
పెదకూరపాడు రైల్వేస్టేషన్‌లో జన్మభూమి, పల్నాడు ఎక్సెప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలన్నది గ్రామ ప్రజల చిరకాల వాంఛ. ఇందు కోసం ఎన్నోసార్లు రైల్వే అధికారులను కలసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో పెదకూరపాడులో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తానంటూ తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, తాజా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేదు. ఎక్సెప్రెస్ రైలుకు హాల్ట్ కల్పిస్తే హైదరాబాద్, విశాఖపట్నం వెళ్లేవారు గ్రామంలోనే రైలు ఎక్కొచ్చన్న ఆశ కలగానే మిగిలింది.
మూతపడ్డ హాస్టళ్లు
టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంఖ్య లేని కారణంగా పెదకూరపాడులో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం, బీసీ బాలుర వసతి గృహాన్ని రద్దుచేశారు. ఎమ్మెల్యేగా కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నా ఈ హాస్టళ్లను కొనసాగించేందుకు తీసుకున్న చర్యలు ఏమీ లేవని ఎస్సీ, బీసీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
సొమ్మొకరిది... సోకు ఒకరిది
ఇరుకుగా ఉన్న పెదకూరపాడు ప్రధాన రహదారి
తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి స్వగ్రామం పెదకూరపాడులో నిర్మించిన సీసీ రోడ్ల వ్యవహారం సొమ్మొకరది, సోకు ఒకరది అన్న చందంగా మారింది. ఈ గ్రామాన్నికి ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.1.95 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు నిర్మించారు. ఈ నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానివి. 13, 14 ఆర్థిక సంఘం నిధులు రూ.95 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతోనూ సీసీ రోడ్లు నిర్మించారు. పంచాయతీ నిధులు రూ.30 లక్షలు మంజూరయ్యాయి. వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్‌ను పక్కన పెట్టి ఆ నిధులతోనూ టీడీపీ వారే రోడ్లు వేశారు. అయితే కొమ్మాలపాటి శ్రీధర్ రహదారులు అంటూ బోర్డులు మాత్రం ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ఎమ్మెల్యే నిధులు కింద పెదకూరపాడు గ్రామానికి వచ్చింది రూ.60 లక్షలు. వాటిలో రూ.40 లక్షలే వినియోగించారు. మిగిలిన రూ.20 లక్షలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ఏమైంది?
ప్రజల చిరకాల కోరిక పెదకూరపాడులో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగాలన్నది. మేము అనేక సార్లు రైల్వే అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించాం. అయితే ప్రయోజనం లేదు. ఎమ్మెల్యేగా శ్రీధర్ రైళ్ల హాల్ట్ కూడా సాధించలేకపోయారు.
– షేక్ బాలిసైదా, అడ్వకేట్, పెదకూరపాడు
చేనేతలకు చేసింది శూన్యం
పెదకూరపాడులో చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వారికి కొమ్మాలపాటి చేసిన మేలు ఏమీ లేదు. సొంతూరు వ్యక్తి అయినా కనీసం చేనేత సమస్యలపై అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు. కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు.
– గాత్రం కాంతారావు,పెదకూరపాడు
Comments
Please login to add a commentAdd a comment